Begin typing your search above and press return to search.

బాబు ఇలాకాలో జ‌గ‌న్!...సంక్రాంతి వేడుక‌లు జంట‌గానేనా?

By:  Tupaki Desk   |   26 Dec 2017 12:00 PM GMT
బాబు ఇలాకాలో జ‌గ‌న్!...సంక్రాంతి వేడుక‌లు జంట‌గానేనా?
X
అదేంటీ... టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు - వైసీపీ అధినేత‌ - ఏపీ అసెంబ్లీలో విప‌క్ష నేత‌గా ఉన్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్రాంతి వేడుక‌ల‌ను క‌లిసి జ‌రుపుకుంటారా? అంటే... ఏమో మ‌రి? అయినా వారిద్ద‌రూ క‌లిసి సంక్రాంతి వేడుక‌లు నిర్వ‌హించుకుంటే... జ‌నానికి అంత‌కంటే ఆనందం ఏముంటుంది? అది కూడా ఇటీవ‌లే వారిద్ద‌రూ త‌మ మ‌ధ్య ఉన్న పంతాల‌ను ప‌క్క‌న ప‌డేశార‌న్న విష‌యం కూడా ఇటీవ‌లే వెలుగు చూసింది మొన్న జ‌గ‌న్ బ‌ర్త్ డేను పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు గ్రీటింగ్స్ చెప్ప‌డం, దానికి ఎంతో సంతోషం వ్య‌క్తం చేసిన జ‌గ‌న్‌... చంద్ర‌బాబుకు ధ‌న్య‌వాదాలు చెప్ప‌డం మ‌న‌కు తెలిసిందేగా. నిత్యం మాట‌ల తూటాలు పేల్చుకునే చంద్ర‌బాబు - జగ‌న్‌ ల మ‌ధ్య జ‌రిగిన ఈ గ్రీటింగ్స్‌ - థ్యాంక్స్ నిజంగా జ‌నానికి ప‌ర‌మానందాన్ని ఇచ్చాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎంతైనా ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్ర‌బాబు - విప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్‌ కు శుభాకాంక్ష‌లు చెప్ప‌డంలో ఆశ్య‌ర్యం ఏమీ లేదు గానీ... మాట‌ల మంట‌లు రేగుతున్న త‌రుణంలో ముందుగా బాబే పంతాల‌ను ప‌క్క‌న‌పెట్టేశార‌ని చెప్పాలి. అస‌లు చంద్ర‌బాబు విషెస్ చెప్ప‌కుంటే జ‌గ‌న్ స్పందించే వారు కాదు క‌దా. అయినా బాబు పంతాలు ప‌క్క‌న‌పెట్టి విషెస్ చెప్పినంత‌నే... జ‌గ‌న్ స్పందించాల్సిన అవ‌స‌రం కూడా ఏమీ లేదు. అయితే చంద్ర‌బాబు పంతం ప‌క్క‌న‌పెట్టార‌ని భావించిన జగ‌న్‌... తాను కూడా పంతాల‌ను ప‌క్క‌న‌పెట్టేశార‌నే చెప్పాలి.

అయినా ఇదంతా ఇప్పుడు ఎందుక‌నేగా మీ డౌటు? ఇప్పుడు చెప్పే విష‌యం గ‌నుక తెలిస్తే... ఈ వార్త ఎంత‌టి ప్రాధాన్యం క‌లిగిన‌దో ఇట్టే అర్థం కాక మాన‌దు. అస‌లు విష‌యంలోకి వ‌స్తే... ఇంకో ఏడాదిలో జ‌రిగే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట సుదీర్ఘ పాద‌యాత్ర ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ యాత్ర ఇప్ప‌టికే క‌డ‌ప‌ - క‌ర్నూలు జిల్లాల్లో పూర్తి కాగా... మూడో జిల్లా అయిన అనంత‌పురం జిల్లాలో కొన‌సాగుతోంది. ఈ నెల 28న అంటే... మ‌రో రెండు రోజుల్లో అనంత‌పురం జిల్లాలోనూ త‌న యాత్ర‌ను పూర్తి చేసుకునే జ‌గ‌న్‌... చంద్ర‌బాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో ప్ర‌వేశిస్తారు. చిత్తూరు - అనంత‌పురం జిల్లాల స‌రిహ‌ద్దు అయిన తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌కవ‌ర్గంలో అడుగు పెట్ట‌డం ద్వారా జ‌గ‌న్ చిత్తూరు జిల్లాలోకి త‌న యాత్ర‌ను తీసుకెళ్ల‌న్నారు. తంబ‌ళ్ల‌ప‌ల్లి నుంచి మ‌ద‌న‌ప‌ల్లి - అటు నుంచి పీలేరు - అక్క‌డి నుంచి చిత్తూరు - అక్క‌డి నుంచి చిత్తూరు - చిత్తూరు నుంచి చంద్ర‌గిరి మీదుగా తిరుప‌తి దాకా జ‌గ‌న్ యాత్ర సాగుతుంది. ఇది అంద‌రికీ తెలిసిందే క‌దా అంటే... ఇందులో ఎవ‌రికీ తెలియ‌ని ఓ విష‌యం అయితే దాగి ఉంది.

అదేంటంటే... వ‌చ్చే నెల 14న సంక్రాంతి ఉంది క‌దా. స‌రిగ్గా సంక్రాంతి ప‌ర్వ‌దినానికి జ‌గ‌న్ యాత్ర చంద్ర‌బాబు సొంతూరు ఉన్న చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశిస్తుందట‌. అంతేకాదండోయ్‌... స‌రిగ్గా సంక్రాంతి ప‌ర్వ‌దినానికి ఈ యాత్ర చంద్ర‌గిరి నియోజ‌కవ‌ర్గ కేంద్రానికి చాలా ద‌గ్గ‌ర‌గా వ‌స్తుంద‌ట‌. మొన్న క్రిస్‌ మ‌స్ వేడుక‌ల‌ను పాద‌యాత్ర‌లో భాగంగా ఏర్పాటు చేసుకున్న శిబిరంలోనే జ‌రుపుకున్న జ‌గ‌న్‌... సంక్రాంతి వేడుక‌ల‌ను కూడా యాత్ర‌లోనే జ‌రుపుకోనున్నారు. ఇదిలా ఉంటే... ప్ర‌తి సంక్రాంతికి ఎక్క‌డ ఉన్నా కూడా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని త‌న సొంతూరు నారావారిప‌ల్లెలో జ‌రుపుకునే చంద్ర‌బాబు... ఈ సంక్రాంతికి కూడా త‌న స్వ‌గ్రామానికే వెళ‌తారు. తానొక్క‌డే కాకుండా కుటుంబ స‌భ్యుల‌నంతా వెంట‌బెట్టుకుని వెళ్లే చంద్ర‌బాబు... తాను పుట్టిన ఊరిలో సంక్రాంతి వేడుక‌ల‌ను ఘ‌నంగానే జ‌రుపుకుంటున్న వైనం మ‌న‌కు తెలియ‌నిదేమీ కాదు.

మ‌రి సంక్రాంతి ప‌ర్వ‌దినానికి త‌న ఊరికి అత్యంత స‌మీపంలో ఉండే జ‌గ‌న్‌ కు చంద్ర‌బాబు సంక్రాంతి శుభాకాంక్ష‌లు చెప్ప‌కుండా ఉంటారా? ఇంటికి పిల‌వ‌కుండా ఉంటారా? అన్న విషయం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అంతేకాకుండా చంద్ర‌బాబు ఆహ్వానిస్తే... జ‌గ‌న్ ఆయ‌న ఇంటికి వెళ్ల‌కుండా ఉంటారా? అన్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఇవ‌న్నీ చెప్పుకునేందుకు కాస్తంత ఆస‌క్తిగానే ఉన్నా... జ‌రిగేవేనా? అన్న అనుమానాలు కూడా లేక‌పోలేదనుకోండి. అయినా బ‌ర్త్ డే నాడు ఎక్క‌డో దూరాన ఉన్న జ‌గ‌న్‌ కు శుభాకాంక్ష‌లు చెప్పిన చంద్ర‌బాబు... తాను ఎంతో ఇష్టంగా జ‌రుపుకునే సంక్రాంతి వేడుక‌ల సంద‌ర్భంగా త‌న‌కు కూత‌వేటు దూరంలో ఉండే జ‌గ‌న్‌ ను ప‌ల‌క‌రించ‌కుండా ఉంటారా? త‌న ఊరికి ఆహ్వానించ‌కుండా ఉంటారా? అన్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఏదేమైనా సంక్రాంతి సంద‌ర్భంగా ఈ ఇద్ద‌రు నేత‌లు క‌ల‌వాల‌ని, సంక్రాంతి సంబ‌రాల‌ను ఇద్ద‌రూ క‌లిసి నిర్వ‌హించుకోవాల‌ని మ‌న‌సారా కోరుకుందాం. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?