Begin typing your search above and press return to search.

తిరుమలేషుడి ఆశీర్వాదం జగన్ కా.? బాబుకా?

By:  Tupaki Desk   |   12 March 2019 6:04 AM GMT
తిరుమలేషుడి ఆశీర్వాదం జగన్ కా.? బాబుకా?
X
సమస్త భూ మండలానికి దేవుడు ఒక్కడే.. ఏ దేశంలో ఆ దేవుళ్లు ఉన్నారు.. పూజిస్తారు. మనకు మాత్రం మన తిరుమల వేంకటేశ్వరుడు ఆరాధ్య దేవుడు. ఆయనంటే దేశంలో అమితమైన భక్తి - గౌరవం.. ప్రధాని నుంచి ప్రతిపక్ష నేత దాకా.. ఏపీ సీఎం చంద్రబాబు నుంచి ప్రతిపక్ష నేత జగన్ దాకా తిరుమల వెంకన్నను దర్శించుకోనిదే ఏ పని మొదలు పెట్టరంటే అతిశయోక్తి కాదు..

ఇటీవలే రాహుల్ గాంధీ దేశంలో లోక్ సభ ఎన్నికల ప్రకటనకు కొద్దిరోజుల ముందే తిరుమల వెంకన్నను కాలినడకన వెళ్లి మరీ దర్శించుకొని ఈసారి అధికారం ప్రాప్తించేలా చూడమని వేడుకున్నాడు. ఇక అంతకుముందు మోడీ కూడా తిరుమలేషుడిని దర్శించుకొని మరోసారి అధికారాన్ని నిలబెట్టాలని కోరుకున్నాడు..

వీరే కాదు.. తెలంగాణలో మంత్రులుగా ఎన్నికైన వారంతా తిరుమలేషుడిని దర్శించుకొని మొక్కలు చెల్లించారు. ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది. వైఎస్ జగన్ తన పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి ఎన్నికల కార్యక్షేత్రంలోకి దూకడానికి ముందు తిరుమల వెంకన్నను దర్శించుకొని అధికారం ప్రాప్తింపచేయాలని కోరుకున్నాడు. తిరుమల నుంచే సమరశంఖారావం పూరిస్తున్నట్టు ప్రకటించి ప్రచార సభలకు వెళ్లిపోయారు.

తాజాగా చంద్రబాబు ఈరోజు తిరుమల బయలు దేరుతున్నాడు. తిరుమల వెంకన్నను దర్శించుకొని అక్కడే తొలి ప్రచార సభను నిర్వహించబోతున్నారు. 2019 ఎన్నికల ప్రచారాన్ని సెంటిమెంట్ గా తిరుపతి నుంచే చంద్రబాబు మొదలు పెట్టబోతున్నాడు.

ఇలా అందరికీ సెంటిమెంట్ గా మారిపోయాడు తిరుమల వెంకటేశ్వరుడు.. మరి అధికార - ప్రతిపక్షాల నేతలూ ఆ స్వామినే శరణువేడుతున్నారు.. ఆ తిరుమలేషుడి కరుణా కటాక్షం ఎవ్వరికుంటుంది.? ఈ సారి స్వామి ఎవరికీ అధికారం కట్టబెడుతాడన్నది తెలియాలంటే ఎన్నికలు ముగిసేవరకూ వేచిచూడాల్సిందే..