Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ తో జగన్ చెలిమి..?

By:  Tupaki Desk   |   29 Aug 2018 1:30 AM GMT
కేసీఆర్‌ తో జగన్ చెలిమి..?
X
రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎవరి అంచనాలకు అందదు. అందుకే రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఓ నానుడి. కాంగ్రెస్ పార్టీ పతనమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు స్వర్గీయ ఎన్.టీ. రామరావు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆనాడు కాంగ్రెస్‌ పై పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్ది వెంకయ్యనాయుడును గెలిపించేందుకు ప్రచారానికి కూడా వెళ్లారు. ఈ సంఘటనను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో ఎన్టీఆర్‌ కు అంతటి వైరముంది. ఆ వైరాన్ని - శత్రుత్వాని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్‌ తో కలిసేందుకు ముందుకు వస్తున్నారు. ఇదీ రాజకీయమంటే. బద్దశత్రువులైన తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును ఓడించేందుకు ఒక్కటవుతున్నారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్ మోహన రెడ్డికి ఉమ్మడి శత్రువులైన కాంగ్రెస్‌ తెలుగుదేశం పార్టీలను ఓడించాలని ఉండదా... అని ప్రచారం జరుగుతోంది. వై.ఎస్. రాజశేఖ‌ర రెడ్డిపై అభిమానంతో ఆయన కుమారుడు జగన్ మోహన రెడ్డిపై సానుభూతి చూపిస్తున్నవారు తెలంగాణలో ఎక్కువ మందే ఉన్నారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ వాసులు ఎన్నో ప్రయోజనాలు పొందారు. అలాగే తెలుగుదేశం పార్టీ తెలంగాణను వ్యతిరేకించిందనే కోపంతోను ఉన్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితీ - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. గత ఎన్నికలలో ఖమ్మం లోక్‌ సభ స్థానం నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ ఎంపీ తర్వాత టీఆర్ ఎస్ లో చేరారు. ఆయన చేరికకు ముందు పార్టీ అధినేత జగన్ మోహన రెడ్డి అనుమతి తీసుకున్నారు.

ఖమ్మంతో పాటు హైదారబాద్ - నిజామబాద్‌ - కరీంనగర్ జిల్లాలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పట్ల అభిమానం చూపించే వారున్నారు. ఇక సెట్టిలర్లు కూడా చంద్రబాబు నాయుడుపై ఆగ్రహంగానే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎం జరుగుతుందోనని భయపడిన సెటిలర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాక పోవడంతో ఈ ప్రభుత్వం పట్ల అనుకూలంగానే ఉన్నారు. పైగా ఈ ఎన్నికలలో సెటిలర్లకు కూడా టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ఆ పార్టీ పట్ల సానుభూతిగా ఉన్నారు. టీఆర్ ఎస్‌ కు తోడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కూడా కలిస్తే తెలంగాణలో ఎన్నికలు యుద్దాన్ని తలపిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రజలకు కేసీఆర్ పాలనపై గురి కుదిరింది.

అక్కడ కేసీఆర్‌ కు లక్షలాది మంది అభిమానులున్నారు. దీనికి నిదర్శనం కేసీఆర్ ఆంధ్రలో పర్యటించిన ప్రతీసారి అక్కడి వారు చెబుతున్న స్వాగతం - ఇస్తున్న నీరాజనాలే తార్కాణం . ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కేసీఆర్ జగన్ మోహన రెడ్డి తరఫున నేరుగా ప్రచారం చేయకపోయిన తన అర్దబలాన్ని అంగబలాన్ని జగన్ మోహన రెడ్డికి అందించవచ్చు. ఈ ప్రాతిపదికపై కేసీఆర్ - జగన్ కలసి ప్రయాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి.