Begin typing your search above and press return to search.

జగన్ విత్ మోడీ : ఉక్కు జోలికి రావొద్దని మోడీజీకు చెప్పండి సార్...?

By:  Tupaki Desk   |   2 Jun 2022 11:30 AM GMT
జగన్ విత్ మోడీ : ఉక్కు జోలికి రావొద్దని మోడీజీకు చెప్పండి సార్...?
X
విశాఖకు మారు పేరు ఉక్కు నగరం. అలాంటి పేరు తెచ్చి ఏపీకే గర్వకారణంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం ఆరాటపడుతోంది. అదే టైమ్ లో ఇప్పటికే చాలా అడుగులు చకచకా వేసేసి ప్రైవేట్ వద్య శిల మీద విశాఖ స్టీల్ ని నిలపడానికి చూస్తోంది. మరి ఈ సమయంలో 477 రోజులుగా విశాఖ ఉక్కు మా హక్కు. దాన్ని ప్రైవేట్ పరం కానీయమని శపధం చేస్తున్న కార్మికుల మనసు ఎలా ఉంటుంది.

ఇక ఏపీలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్ కంటే ఎవరికి ఉంటుంది. అందుకే విశాఖ ఉక్కు ఉద్యమ నేతలు జగన్ కి వినతి చేస్తున్నారు. ప్రధాని మోడీని కలుస్తున్న జగన్ తొలి మాటగా విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయవద్దు అని చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి.

ఇప్పటికి నాలుగు సార్లు ప్రధాని మోడీని కలసిన జగన్ విశాఖ ఉక్కు విషయం మాత్రం ప్రస్థావించలేదని ఉక్కు కార్మిక సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. ఈసారి మాత్రం ఏ మాత్రం నిరాశపరచకుండా విశాఖ ఉక్కు విషయంలో గట్టిగా ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడాలని వారు కోరుతున్నారు.

గత ఏడాది జనవరి 27న విశాఖ ఉక్కుని నూరు శాతం ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం ప్రకటించినది లగాయితూ ఉద్యమం మొదలైందని వారు గుర్తు చేస్తున్నారు. అలుపు లేకుండా సాగుతున్న ఈ ఉద్యమంలో కార్మికులదే తుది విజయం అని కూడా చెబుతున్నారు. ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటన తరువాత మొదట్లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి వైసీపీ సర్కార్ పంపించిందని, అయితే తరువాత మాత్రం ఆ సంగతి మరచిపోయిందని వారు ఆరోపిస్తున్నారు.

దేశంలో సొంత గనులు లేకుండా కూడా లాభాల బాటలో పట్టిన విశాఖ ఉక్కు విషయంల ఉక్కు మంత్రి పార్లమెంట్ వేదికగా అనేక రకాలుగా అవమానించే విధంగా మాట్లాడారని వారు అంటున్నారు. ఇక కరోనా విపత్తుని కూడా లెక్కచేయకుండా తామంతా ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ వద్ద ఆదోణల చేపట్టిన సంగతిని గుర్తు చేశారు.

విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవాలి, ఈ విషయంలో జగన్ చొరవ తీసుకోవాలని, ఆయన మీద కోటి ఆశలతో కార్మిక లోకం ఉందని కూడా వారు అంటున్నారు. మరి ప్రధాని మోడీతో భేటీ అవుతున్న జగన్ ఉక్కు విషయం ఈసారి అయినా ప్రస్తావిస్తారా. చూడాలి.