Begin typing your search above and press return to search.

కేంద్రాన్ని జగన్ దువ్వుతుంటే..పెద్దిరెడ్డి హీటెక్కించారే!

By:  Tupaki Desk   |   27 Aug 2019 1:30 AM GMT
కేంద్రాన్ని జగన్ దువ్వుతుంటే..పెద్దిరెడ్డి హీటెక్కించారే!
X
ఏపీకి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన మార్కు రాజకీయానికి తెర తీశారనే చెప్పాలి. కేంద్రం మాటలు పెడచెవిన పెడుతూనే ముందుకు సాగుతున్న జగన్... ఢిల్లీ పర్యటనలో మాత్రం కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఈ తరహా వైఖరికి జగన్ కు మాత్రమే సాధ్యమా? అన్న కోణంలో ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రారంభించిన ఈ తరహా రాజకీయం మరోమారు బయటపడిందనే చెప్పక తప్పదు.

ఇప్పటికే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ల విషయంలో కేంద్రంతో సున్నం పెట్టుకున్నట్టుగానే కనిపించిన జగన్... అన్నీ కేంద్రానికే చెప్పి చేస్తున్నామంటూ విజయసాయిరెడ్డి ద్వారా చెప్పించిన తీరుతో జగన్ కొత్త రాజకీయం మొదలైందన్న వాదన వినిపిస్తోంది. తాజాగా జగన్ ఇదే మార్కు రాజకీయాన్ని పోలవరం విషయంలోనూ అమలు చేస్తున్నట్లుగానే కనిపిస్తున్నారు. ఇప్పటికే పోలవవరం కాంట్రాక్టరును బయటకు పంపేసిన జగన్ సర్కారు... ఇప్పటిదాకా జరిగిన పనులు మినహా మిగిలిన పనుల కోసం రివర్స్ టెండర్లను పిలుస్తోంది. ఈ క్రమంలో టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ విషయంపై అటు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఇటు హైకోర్టు అక్షింతలేసినా జగన్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.

తాజాగా సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన జగన్... అక్కడ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ తో భేటీ అయ్యారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశం కోసమే హస్తిన వెళ్లిన జగన్... షెకావత్ తో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రావాలని షెకావత్ ను ఆహ్వానించిన జగన్... షెకావత్ నుంచి అందుకు అంగీకారం కూడా తీసుకున్నారు. ఇదంతా ఢిల్లీలో అనుసరిస్తున్న సాఫ్ట్ వ్యూహం కాగా... ఏపీలో తనదైన హార్డ్ మంత్రాన్ని కూడా రక్తి కట్టించేశారు. తాను షెకావత్ తో భేటీ అయిన సమయంలోనే ఏపీలో తన కేబినెట్ లోని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మీడియా ముందుకు పంపిన జగన్... పెద్దిరెడ్డి చేత కాస్తంత కఠిన వ్యాఖ్యలు చేయించారు.

పోలవరం విషయంలో తాము వెనక్కు తగ్గేది లేదని చెప్పిన పెద్దిరెడ్డి... రివర్స్ టెండర్లలోనే కాకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా తేల్చి పారేశారు. మొత్తంగా కేంద్రం ఎంతగా ఈ ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేసినా కూడా తనదైన మార్కును చూపించుకునేందుకే జగన్ యత్నించారన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా ఢిల్లీలో తాను కేంద్ర ప్రభుత్వ పెద్దలను దువ్వుతున్న సమయంలోనే ఇక్కడ రాష్ట్రంలో తన కేబినెట్ మంత్రుల చేత ఘాటు కామెంట్లు చేయించడం ద్వారా జగన్ తనదైన మార్కు రాజకీయానికి పదును పెట్టారని చెప్పక తప్పదు.