Begin typing your search above and press return to search.

టీడీపీ అనుకున్నది ఒక‌టి.. జ‌గ‌న్‌కు జ‌రిగింది మ‌రొక‌టి..!

By:  Tupaki Desk   |   25 Aug 2021 8:38 AM GMT
టీడీపీ అనుకున్నది ఒక‌టి.. జ‌గ‌న్‌కు జ‌రిగింది మ‌రొక‌టి..!
X
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఒక‌టి త‌ల‌స్తే.. సీఎం జ‌గ‌న్‌కు మ‌రొక విధంగా మేలు జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలోనూ ఇప్పుడు కూడా రాష్ట్రంలో జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. టీడీపీ ఊహించినట్టుగా ఏమీ జ‌ర‌గ‌డం లేద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. ఎస్సీ వ‌ర్గాల బ‌లం, వారి అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయి. గత ఎన్నిక‌ల స‌మ‌యంలో వీరి అభ‌యంతోనే జ‌గ‌న్ అనేక నియోజ‌క‌వ‌ర్గాల‌ను కైవ‌సం చేసుకున్నారు. ఇక‌, టీడీపీకి ఎస్సీలు దూర‌మ‌వుతున్నార‌నే వాద‌న కూడా ఇటీవ‌ల కాలంలో బ‌లంగా వినిపిస్తోంది.

ఎస్సీ సామాజిక వ‌ర్గాల‌కు జ‌గ‌న్ మేళ్లు చేస్తున్నార‌ని.. అందుకే ఆ వ‌ర్గం వారు త‌మ‌తో నే ఉన్నార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఎస్సీ సామాజిక వ‌ర్గాన్ని వైసీపీకి దూరం చేసేందుకు టీడీపీ ప్ర‌ధానంగా దృష్టి పెట్టింది. అందుకే కొన్నాళ్ల కింద‌ట నుంచి ఎస్సీ వ‌ర్గాల‌పై ఈగ‌వాలినా.. అది జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల వ‌ల్లే అనే ప్ర‌చారాన్ని భారీగా చేస్తోంది. గ‌తంలో రాజ‌ధానిలోని ఎస్సీ రైతుల‌పై పోలీసులు లాఠీ చార్జి చేయ‌డంతో హుటాహుటిన జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. ఎస్సీ క‌మిష‌న్ గుంటూరులో ప‌ర్య‌టించేలా కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబు చ‌క్రం తిప్పారు.

అయితే.. ఎస్సీ క‌మిష‌న్ స‌భ్యులు వ‌చ్చారు. కానీ, గుంటూరులో ప్ర‌తిప‌క్ష నేత‌లు త‌మ‌కు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఏమీ జ‌ర‌గ‌డం లేద‌ని.. అంతా బాగానే ఉంద‌ని.. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌డం రాష్ట్ర ప్ర‌భుత్వ బాధ్య‌త‌ని తేల్చేశారు. దీంతో అప్ప‌ట్లో ఆ వ్యూహం బెడిసి కొట్టింది. ఇక‌, తాజాగా గుంటూరులో జ‌రిగిన ద‌ళిత విద్యార్థిని ర‌మ్య హ‌త్య ఘ‌ట‌న‌ను కూడా టీడీపీ వ్యూహాత్మ‌కంగా త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నించింది. ఈ క్ర‌మంలోనే ర‌మ్య హ‌త్య ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కార‌ణంగానే జ‌రిగిందంటూ.. జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌కు ఫిర్యాదులు చేసింది. ఇక్క‌డ కు వ‌చ్చి ప‌రిశీలించాల‌ని కూడా అభ్య‌ర్థించింది. దీంతో తాజాగా గుంటూరుకు వ‌చ్చిన ఎస్సీ క‌మిష‌న్ ఉపాధ్య‌క్షుడు హ‌ల్దార్‌.. అన్నీ ప‌రిశీలించారు.

ఆవెంట‌నే ఆయ‌న జ‌గ‌న్ స‌ర్కారుకు భారీ కితాబు ఇచ్చారు. ప్ర‌భుత్వం అనుస‌రించిన విధానం.. దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శ‌మ‌ని.. ర‌మ్య కుటుంబాన్ని ప్ర‌భుత్వం బాగానే ఆదుకుంద‌ని.. తేల్చేశారు. దీంతో టీడీపీ అనుకున్న‌ట్టుగా జాతీయ క‌మిష‌న్ జ‌గ‌న్ స‌ర్కారును ఎక్క‌డా ప‌న్నెత్తు మాట అన‌లేదు. ఈ ప‌రిణామంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌హా ఆపార్టీ నాయ‌కులు ఇబ్బంది ప‌డ్డార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంటే.. జ‌గ‌న్ స‌ర్కారుకు ఎస్సీల‌ను దూరం చేయాల‌నే వ్యూహం ఫ‌లించ‌క‌పోవ‌డం.. ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం గ‌మ‌నార్హం.