Begin typing your search above and press return to search.

'వంచ‌న‌దినం'.. మోడీ.. బాబుల‌కు జ‌గ‌న్ షాక్‌

By:  Tupaki Desk   |   23 April 2018 4:53 AM GMT
వంచ‌న‌దినం.. మోడీ.. బాబుల‌కు జ‌గ‌న్ షాక్‌
X
ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఏపీలో ఏ పార్టీ ప్ర‌య‌త్నాలు చేసినా అభినందించాల్సిందే. కానీ.. హోదా సాధ‌న పేరుతో రాజ‌కీయంగా ల‌బ్థి పొంద‌ట‌మే ధ్యేయంగా.. కోట్లాది రూపాయిలు ఖ‌ర్చు చేసే మోస‌పు ఎత్తుల్ని త‌ప్ప‌నిస‌రిగా ఖండించాల్సిందే. మొన్న‌టికి మొన్న బెజ‌వాడ‌లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేసిన ఒకరోజు దీక్షకు అధికార యంత్రాంగాన్ని.. ప్ర‌భుత్వ నిధుల్ని ఎంత దారుణంగా వాడేశారో తెలిసిందే.

హోదా సాధ‌న‌తో మీడియాతో మైలేజీ సంపాదించే ప్ర‌య‌త్నం చేసిన బాబుకు.. కీర్తి కంటే అప‌కీర్తి ఎక్కువ‌గా వ‌చ్చింది. హోదా మీద దీక్షను చేసేది ఇప్పుడా? అన్న మాట ఏపీలో ఎక్కువ‌గా వినిపించింది. అంతేనా.. ఎంత దీక్ష అయితే మాత్రం ఇంత హ‌డావుడి.. ఇంత ఆర్భాట‌మా? దీక్ష అన్న‌ది నిర‌స‌న తెలిపేలా.. టార్గెట్ చేసిన వారికి చురుకు పుట్టేలా చేయాలే కానీ.. ప్ర‌చారం కోసం కోట్లాది రూపాయిలు ఖ‌ర్చు పెట్టేయ‌ట‌మా? అన్న సందేహం వ్య‌క్తం చేసేలా బాబుగారి దీక్ష సాగింది.

బెజ‌వాడ దీక్ష‌తో భారీ మైలేజీ వ‌చ్చేసింద‌న్న భావ‌న‌లో ఉన్న చంద్ర‌బాబు ఈ నెల 30న తిరుప‌తిలో మ‌రో దీక్ష‌కు రెఢీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రానికి ఇస్తామ‌న్న ప్ర‌త్యేక హోదా హామీ అమ‌లు కాని నేప‌థ్యంలో కేంద్రం తీరును.. హోదా అమ‌లు కోసం రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న మోస‌పూరిత విధానాల‌కు వ్య‌తిరేకంగా ఏపీ విప‌క్షం ఈ నెల 30న వంచ‌న దినాన్ని నిర్వ‌హించాల‌ని.. అందుకు విశాఖ‌ను వేదిక‌గా చేసుకోవాల‌ని డిసైడ్ చేశారు.

హోదా సాధ‌న‌లో మోడీ తీరును ఎప్ప‌టిక‌ప్పుడు త‌ప్పు ప‌డుతున్నా.. అదేమీ క‌నిపించ‌ని బాబు అండ్ కో ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్ పార్టీ మీద మోస‌పూరిత ప్ర‌చారం చేస్తుంటారు.

దీనికి చెక్ పెట్టేలా జ‌గ‌న్ కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేశారు. ఒక కార్య‌క్ర‌మంతోనే ఏపీని మోసం చేసిన మోడీ తీరును.. చంద్ర‌బాబు తీరును ఎండ‌గ‌ట్టేలా వంచ‌న దినాన్ని నిర్వ‌హించనున్నారు. కృష్ణా జిల్లా అగిరిప‌ల్లి వ‌ద్ద పాద‌యాత్ర శిబిరంలో ఆదివారం రాత్రి జ‌రిగిన పార్టీ ముఖ్య‌నేత‌ల స‌మావేశంలో ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

ఈ నెల 30న విశాఖ‌లో ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ 12 గంట‌ల పాటు హోదా కోసం రాజీనామా చేసిన పార్టీ లోక్ స‌భ స‌భ్యుల‌తో పాటు రాజ్య‌స‌భ స‌భ్యులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఇత‌ర ముఖ్య‌నేత‌లు నిరాహార దీక్ష చేసి నిర‌స‌న తెల‌ప‌నున్నారు. ఓప‌క్క ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తూనే.. మ‌రోవైపు జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను య‌థావిధిగా నిర్వ‌హిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

నాలుగేళ్లుగా ప్ర‌త్యేక హోదా గురించి హేళ‌న‌గా మాట్లాడి.. హోదా అంటే జైల్లో పెడ‌తాన‌ని హెచ్చ‌రించిన చంద్ర‌బాబు తిరుప‌తిలో ఈ నెల 30న ప్ర‌త్యేక హోదా కోసం దీక్ష చేయ‌టం ఏమిట‌ని జ‌గ‌న్ సూటిగా ప్ర‌శ్నించారు. తిరుప‌తిలో హోదా మీద దీక్ష వంచ‌న కాదా? అని ప్ర‌శ్నించిన జ‌గ‌న్‌.. అస‌లు రాష్ట్రానికి ఇంత‌కాలం హోదా రాక‌పోవ‌టానికి ప్ర‌ధాన కార‌ణంగా చంద్ర‌బాబేన‌న్నారు.

రాజ‌కీయ స్వార్థం కోసం కేంద్రం ద‌గ్గ‌ర ప్ర‌త్యేక హోదా హామీని నీరుగార్చేలా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు.. ఈ రోజున దీక్ష‌పేరుతో నాట‌కాలు ఆడుతున్నార‌న్నారు. అదే స‌మ‌యంలో హోదా అంశంపై ఇచ్చిన హామీని మ‌రిచిన మోడీ త‌ప్పు చేశార‌ని.. ఏపీ ప్ర‌జ‌ల్ని వంచించార‌ని.. ఈ ఇద్ద‌రి వంచ‌న‌కు వ్య‌తిరేకంగా త‌మ పార్టీ వంచ‌న దినాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. మోడీని టార్గెట్ చేయ‌టం లేద‌ని చెప్పే బాబు బ్యాచ్ కు.. తాజా వంచ‌న స‌భ మీద ఏం మాట్లాడ‌తారో చూడాలి.