Begin typing your search above and press return to search.

సంత‌కం ఎక్క‌డ పెట్ట‌మంటే అక్క‌డ పెడ‌తా- జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   21 March 2017 8:16 AM GMT
సంత‌కం ఎక్క‌డ పెట్ట‌మంటే అక్క‌డ పెడ‌తా- జ‌గ‌న్‌
X
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఏదో విధంగా విప‌క్ష నేత‌ను ఇరిటేట్ చేయ‌టం ద్వారా.. చ‌ర్చ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించాల‌న్న ధోర‌ణిలో ఏపీ అధికార‌ప‌క్షం వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వ త‌ప్పుల్ని.. ప్ర‌భుత్వ విధానాల్ని విమ‌ర్శించినంత‌నే.. జ‌గ‌న్ పై వ్య‌క్తిగ‌త దాడుల‌కు దిగుతూ.. విప‌క్షాల‌ను రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇందుకు నిద‌ర్శ‌నంగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్య‌ల్ని చెప్పొచ్చు. విప‌క్ష నేత‌పై వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేసిన మంత్రి అచ్చెన్నాయుడి తీరుపై జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఎర్ర‌న్నాయుడి వ్యాఖ్య‌ల అనంత‌రం జ‌గ‌న్ మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా అధికార‌ప‌క్ష నేత‌లు చెబుతున్న అస‌త్యాల‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సూట్ కేసులో బ్లాక్ మ‌నీ పెట్టుకొని ఆడియో.. వీడియో టేపుల్లో దొరికిపోయింది ఎవ‌రు? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు.

త‌న ఆస్తుల‌పై త‌ర‌చూ త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌న్న జ‌గ‌న్‌.. త‌న ఆస్తులు రూ.43వేల కోట్లుగా మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నార‌ని.. అందులో ప‌దో వంతు మొత్తం ఇస్తే.. వాళ్లు ఎక్క‌డ సంత‌కాలు పెట్ట‌మంటే.. తాను ఎక్కడ పెట్టమంటే అక్క‌డ సంత‌కాలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లుగా జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. అబ‌ద్ధాలు చెప్ప‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు.. మంత్రి అచ్చెన్నాయుడికి అల‌వాటుగా మారింద‌న్న జ‌గ‌న్‌.. దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణించిన త‌ర్వాత‌.. తాను కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని.. ఈ కార‌ణంగానే త‌న‌పై కేసులు పెట్టిన‌ట్లుగా చెప్పారు. నాడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మ‌క్కైన చంద్ర‌బాబు.. అచ్చెన్నాయుడు సోద‌రుడు ఎర్ర‌న్నాయుడు త‌న‌పై కేసులు వేసిన‌ట్లుగా వెల్ల‌డించారు.

త‌న‌కు ఏమాత్రం సంబంధం లేని విష‌యాల్లోనూ త‌న‌పై కేసులు వేశార‌ని.. ప‌ద‌కొండు ఛార్జ్ షీట్ల‌లో తేలింది కేవ‌లం రూ.1200 కోట్లు మాత్ర‌మేన‌ని.. ఏబీసీ రికార్డుల ప్ర‌కారం సాక్షి దిన‌ప‌త్రిక దేశంలోనే ఎనిమిదో స్థానంలో ఉంద‌ని.. రూ.1800 కోట్ల న‌ష్టాల్లో ఉన్న ఈనాడు షేర్‌ను ఒక్కొక్క‌టి రూ.5.26ల‌క్ష‌ల‌కు అమ్మితే.. త‌మ షేర్ల‌ను ఈనాడు కంటే త‌క్కువ ధ‌ర‌కే అమ్మామ‌ని.. సాక్షి ఇన్వెస్ట‌ర్లు అంతా లాభాల్లో ఉన్న‌ట్లుగా వెల్ల‌డించారు. రికార్డులు చూసి మాట్లాడాల్సిన చంద్ర‌బాబు.. నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం స‌రికాదంటూ జ‌గ‌న్ ఫైర్ అయ్యారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. తెలుగు త‌మ్ముళ్లు ఆరోపించిన మొత్తంలో ప‌దిశాతం ఇస్తే.. ఎక్క‌డ సంత‌కం కావాలో అక్క‌డ పెడ‌తాన‌ని జ‌గ‌న్ నేరుగా స‌వాలు విసిరినా.. అధికార‌ప‌క్ష నేత‌ల నుంచి సూటి స‌మాధానం రాక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/