Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ దెబ్బ‌కు మోదీని గుర్తు చేసుకుంటున్న బాబు

By:  Tupaki Desk   |   17 Dec 2019 5:07 PM GMT
జ‌గ‌న్ దెబ్బ‌కు మోదీని గుర్తు చేసుకుంటున్న బాబు
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. న‌వ్యాంద్ర‌ప్ర‌దేశ్‌ కు అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమ‌ని తెలిపిన సీఎం జ‌గ‌న్ `ఆంధ్రప్రదేశ్‌ కు బహుశా.. మూడు రాజధానులు రావొచ్చు.. మూడు రాజధానులు నిర్మించే ఆలోచనలో ఉన్నాం` అని స‌భా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ద‌క్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్న సంగతిని ప్ర‌స్తావిస్తూ అదే విధంగా వినూత్న నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలున్నాయని జగన్ చెప్పారు. అయితే, దీనిపై ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఊహించ‌ని రీతిలో రియాక్ట‌య్యారు. పిచ్చోడి చేతిలో రాయిలా జ‌గ‌న్ పాల‌న మారింద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఆయ‌న గుర్తు చేసుకున్నారు.

మూడు రాజ‌ధానులు రావ‌చ్చ‌ని ప్ర‌క‌ట‌న చేసిన సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టంగా ఏ ప్ర‌క‌ట‌న చేయ‌ని సంగ‌తి తెలిసిందే. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం రాజధాని విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదని - రాజధాని అంశంపై అధ్యయానికి నియమించిన రెండు కమిటీలు మరో రెండు వారాల్లో నివేదిక ఇస్తాయని - వాటిపై కూలంకషంగా చర్చలు జరిపిన తర్వాతనే తగిన నిర్ణయం తీసుకుంటామని జగన్ అన్నారు.

అయితే, దీనిపై చంద్ర‌బాబు ఘాటుగా రియాక్ట‌య్యారు. జగన్ ప్రభుత్వానివి తుగ్లక్ చర్యలు అంటూ మండిప‌డ్డారు. ``రాజధానిని ఎవరైనా మూడు ప్రాంతాల్లో పెడతారా? సీఎం జగన్ ఎప్పుడు ఏం చేస్తారో తెలియడం లేదు... సీఎం ఎక్కడ కూర్చుంటారు..? సీఎం ప్రకటనతో ప్రాంతీయ విభేదాలు వస్తాయి.. కేంద్రం దృష్టికి రాజధాని అంశాన్ని తీసుకెళ్తాం`` అని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. త‌ద్వారా కేంద్రంతో మిలాఖ‌త్ అయి జ‌గ‌న్‌ను ఇర‌కాటంలో ప‌డేసే స్కెచ్ వేశారు. అయితే, జ‌గ‌న్‌ పై బాబు ఏమ‌ని ఫిర్యాదు చేస్తారు? దాన్ని కేంద్రం ఏ విధంగా తీసుకుంటుంది అనేది స‌హ‌జంగానే ఆస‌క్తిక‌ర అంశం.