Begin typing your search above and press return to search.

రైతులకి సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం జగన్

By:  Tupaki Desk   |   2 Jan 2020 12:48 PM GMT
రైతులకి సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం జగన్
X
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఏపీలోని రైతులకు సంక్రాంతి కానుక ఇవాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసాలో భాగంగా అన్నదాతలకు సంక్రాంతి కానుకగా ప్రకటించిన రూ.2 వేలను గురువారం నుంచి వారి ఖాతాలకు నేరుగా బదిలీ చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నధం అయ్యింది. వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ పథకం క్రింద రాష్ట్రంలోని రైతులు - కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 ఇస్తామని ప్రకటించి ఇప్పటికే రూ.11,500ను జమ చేసింది ఏపీ సర్కార్ .అయితే మిగతా రెండు వేలు కూడా సంక్రాంతి కానుకగా ఖాతాల్లో జమ చేస్తుంది సర్కార్ . ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ద్వారా ఆర్ధిక సాయం అందుకున్న లబ్ధిదారుల పేర్లను శుక్రవారం నుంచి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించబోతున్నారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రం ఆర్ధిక కష్టాల్లో ఉన్నప్పటికీ రైతు భరోసా అందిస్తున్నామని చెప్తోంది వైసీపీ సర్కార్ .కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఇచ్చే రూ.6000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.7,500 కలిపి - మొత్తంగా ఏడాదికి రూ.13,500 ప్రతి రైతు కుటుంబానికి అందిస్తోంది. మొత్తంగా సుమారు 46,50,629 మంది ఖాతాలకు రైతు భరోసా తుది విడత మొత్తం దాదాపు రూ.1,082 కోట్లను నేరుగా బదిలీ చెయ్యనున్నారు . వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా రైతులకు అందించే ఈ ఆర్థిక సాయం, వ్యవసాయ పెట్టుబడికి ఉపకరిస్తుందని భావిస్తున్నాను అని , ఈ సందర్భంలో వ్యవసాయ ఉత్పాదకాల నాణ్యతను పరిశీలించేందుకు, తద్వారా నాణ్యమైన ఉత్పాదకాలను మాత్రమే రైతన్నలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంచేందుకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో 147 డాక్టర్‌ వైఎస్సార్‌ సమీకృత ప్రయోగశాలలను, 13 జిల్లా కేంద్రాలలో నోడల్‌ ప్రయోగశాలలను ఏర్పాటు చేయబోతున్నాం అని సీఎం జగన్ తెలిపారు.