Begin typing your search above and press return to search.

జగనన్న సైన్యం అదేనా...?

By:  Tupaki Desk   |   2 Oct 2021 2:30 PM GMT
జగనన్న సైన్యం అదేనా...?
X
జగన్ ఒంటరిగానే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఈ రోజు ఆయన ఏపీలోని అయిదున్న కోట్ల జనంలో తనకంటూ విశేష అశేష అభిమానులను సంపాదించుకున్నారు. జగన్ ఒక విధంగా చూస్తే రాజకీయంగా అతి పెద్ద బలవంతుడిగానే ఉన్నారు. ఆయన విపక్షంలో ఒక్క ఎంపీగా ఉన్నపుడే నిలువరించలేని దుర్బలత్వం ఏపీలోని టీడీపీ లాంటి పార్టీలకు ఉంది. ఇపుడు జగన్ సీఎం సీట్లో ఉన్నారు. మరి ఆయన్ని గద్దె దించడం అంటే అది తమాషా కాదు, అంతకంటే ఆషామాషీ వ్యవహారం కూడా కాదు. జగన్ ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నారు. తనకంటూ ప్రత్యేకమైన సైన్యాన్ని కూడా ఆయన నిర్మించుకున్నారు. ఆయన కోటను బద్ధలు కొట్టాలి అంటే ముందు ఈ సైన్యాన్ని జయించాలి. ఇంతకీ జగన్ సైన్యం ఏంటి అన్న ప్రశ్న రావచ్చు. ఆ సైన్యం చాలానే ఉంది. వారు మాత్రం వైసీపీ నేతలు, కార్యకర్తలు అసలు కానే కారు.

జగన్ సైన్యం అంటే ఏపీలోని నాలుగు లక్షల‌ మంది సచివాలయ సిబ్బంది అంటే వింతగా ఉన్నా కూడా అదే నిజం. అదెలా అంటే సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ సచివాలయ వ్యవస్థను గాంధీ జయంతి రోజున ప్రారంభించారు. ప్రతి సచివాలయంలో పర్మనెంట్ సిబ్బందితో పాటు టెంపరరీగా వాలంటీర్లు ఉన్నారు. వీరంతా లక్షలలో ఉన్నారు. వీరికి అలా ఈ ఉపాధి ఇచ్చింది జగన్, ఈ వ్యవస్థను క్రియేట్ చేసింది జగన్. ఇక వీరి ఉపాధి మరింతగా స్థిరం కావాలన్నా వీరికంటూ జాబ్స్ పదిలం కావాలన్నా కూడా జగన్ మీదనే అది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే సచివాలయాలు జగన్ మానస పుత్రికలు కాబట్టి. ఇలా లక్షల్లో ఉన్న సచివాలయ సిబ్బంది వారి కుటుంబ సభ్యులను లెక్కల్లోకి తీసుకుంటే కచ్చితంగా ఇరవై లక్షల దాకా సైన్యం జగన్ వైపు ఉన్నట్లే అన్నదే ఇక్కడ విశ్లేషణ.

మరి వీరిలో సచివాలయ సిబ్బందికి ప్రోబేషన్ ఇస్తమాని వైసీపీ సర్కార్ చెప్పింది. ఆ తరువాత వీరి జాబ్స్ పర్మనెంట్ అవుతాయి. ఇక వాలంటీర్ల గౌరవ వేతనాలు పెరగాలన్నా వారికి కూడా పర్మనెంట్ జాబ్స్ కావాలన్నా కూడా జగన్ ఏలుబడిలో ఉండడం అత్యవసరం. అందువల్ల వీరంతా వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జగన్ మళ్లీ సీఎం కావాలని కృషి చేస్తారు. తమ శక్తి కొలదీ వీరు కూడా జనాలను ఆకట్టుకుని వైసీపీ విజయంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఒక వేళ వైసీపీ అధికారంలోకి రాకపోతే పార్టీ వారితో పాటు వీరికి కూడా తీవ్ర నష్టమే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్ తెచ్చిన సచివాలయ వ్యవస్థ ఇంకా బాల్యావస్థలో ఉంది. దీన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఒక గాడిన పెట్టేంతవరకూ జగనే సీఎం గా ఉండాలి. ఒక వేళ ఆయన్ని కాదని మరో పార్టీ అధికారంలోకి వస్తే అపుడు సచివాలయ వ్యవస్థ ఉంటుందా అన్నది కూడా అతి పెద్ద డౌట్ గా చెబుతున్నారు.


జగన్ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ ఆ తరువాత ప్రభుత్వాలు కొనసాగించకపోతే ఇబ్బందులు ఎదుర్కోనేది అక్కడి ఉద్యోగులే. అందువల్ల జగన్ మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలి అని సంక్షేమ ఫలాలు అందుకునే ప్రజలు ఎంతలా కోరుకుంటారో తెలియదు కానీ ఈ సైన్యం మాత్రం తప్పనిసరిగా కోరూంటుంది అంటున్నారు. ఇలా జగన్ తనకంటూ అతి ముఖ్యమైన సైన్యాన్నే బలంగా రూపొందించుకున్నారు అంటున్నారు. జగన్ సైతం సచివాలయ వ్యవస్థనే బలంగా నమ్ముకున్నారు. డిసెంబర్ నుంచి జగన్ ఏపీలో పర్యటనలు షురూ చేయనున్నారు. అపుడు ఆయన సచివాలయాలను సందర్శిస్తారు. ఇప్పటికే ఏపీలో అమలయ్యే ప్రతీ కార్యక్రమం సచివాలయం అడ్రస్ గానే సాగుతోంది. దాంతో రానున్న రోజులలో ఇటు జగన్ కి ఈ వ్యవస్థ ఎంత ఆధారంగా ఉంటుందో అటు ఆ వ్యవస్థకు జగన్ అంత అవసరంగా మారుతున్నారు. మరి రాజు గారి కోటలోకి ప్రవేశించాలంటే ముందు ఈ సైన్యాన్ని ఎదుర్కోవడం ఏ రాజకేయ పార్టీకైన బహు కష్టమే. దీనికి విరుగుడు గా విపక్షం ఏ రకమైన యుద్ధ వ్యూహాలను రూపొందించుకుంటుందో చూడాలి.