Begin typing your search above and press return to search.

జగన్ సంకల్పం.. ప్రజలకు భరోసా

By:  Tupaki Desk   |   12 Aug 2018 4:58 PM GMT
జగన్ సంకల్పం.. ప్రజలకు భరోసా
X
ఒక్కో జిల్లా దాటుతుంటే.. జనం తన వెంట సముద్రమై కదలి వస్తుంటే... తన సంకల్ప బలం రెట్టింపవుతుంటే.. లక్ష్యం సమీపిస్తుంటే.. అలుపెరగని ఆ పథికుడిపై ప్రజల్లో విశ్వాసం కొండలా పెరిగిపోతోంది.. అందుకు తగ్గట్లుగానే ఆ పథికుడు ప్రజలకు పూర్తి భరోసా ఇస్తూ ముందుకు సాగిపోతున్నాడు. రాయలసీమ - దక్షిణ కోస్తా - గోదావరి జిల్లాలను దాటి ఉత్తరాంధ్రలోకి అడుగుపెట్టే ముందు సరికొత్తగా - నిండు కుండలా కనిపిస్తున్నారు. ప్రేమను పంచుతున్న ప్రజలకు పూర్తి భరోసా ఇస్తున్నారు.

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన జగన్ మరింత ఆత్మవిశ్వాసంతో కనిపించారు. తాను ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడడమే కాకుండా ప్రజల్లోనూ ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఆయన ఉత్తేజకరంగా మాట్లాడారు. రాష్ట్రం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రజల్ని ఆదుకుంటానని, పరిస్థితుల్ని మెరుగుపరుస్తానని భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న తప్పుల వల్ల కావొచ్చు.. ఆ పార్టీ చేస్తున్న అరాచకాల వల్ల కావొచ్చు ఇన్నాళ్లు తన పాదయాత్రలో జగన్ సీఎం చంద్రబాబుపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయించేవారు. ప్రజలు తమ కష్టాలు చెప్పుకొన్న ప్రతిసారీ అందుకు కారణమైన ప్రభుత్వంపై ఆయన మండిపడేవారు. కానీ - ఈ రోజు తుని సభలో మాత్రం రాష్ట్రంలోని సమస్యలన్నీ ప్రస్తావిస్తూనే అవన్నీ తీర్చే బాధ్యత తనదంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. మీ కష్టాలు ఇంకా కొన్ని నెలలే అంటూ వారిలో భవిష్యత్తుపై ఆశలు పెంచారు.

నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మీరెన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు.. మరో ఆర్నెళ్లలో ఎన్నికలొస్తున్నాయి - దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.. ఈ అబద్ధం - మోసం - అవినీతి - అన్యాయాల నుంచి అందరం గట్టెక్కుతాం అంటూ జగన్ భరోసాగా మాట్లాడారు. ప్రజలు నిరుత్సాహానికి గురికావొద్దని - రాజన్న రాజ్యం వచ్చే రోజు అతి త్వరలో ఉందని అన్నారు జగన్.

ఇష్టారాజ్యంగా పెంచేస్తున్న స్కూలు - కాలేజీ ఫీజులకు కళ్లెం వేస్తాననన్నారు. "చంద్రబాబు స్వయంగా నారాయణ - చైతన్య పేరుతో తనే బినామీ స్కూళ్లు నడుపుతున్నారు. ప్రభుత్వ విద్యను పేదవాడికి పూర్తిగా దూరంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో పాఠశాలలు మూతపడుతున్నాయి. ఈ విధానం మారాలి. విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావాలి. ఫీజులు నియంత్రించాలి. జగన్ అనే నేను మీ అందరికీ భరోసా ఇస్తున్నాను.. విద్యావ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాను. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటుచేస్తాను" అంటూ తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పారు. మైనింగ్స్ ను నియంత్రిస్తానని - రైలు తగలబెట్టిన వివాదంలో అక్రమ కేసుల్ని ఎత్తేస్తానని - కాకినాడ సెజ్ ను తిరిగి ప్రభుత్వపరం చేస్తానని ఇలా ఎన్నో కీలకమైన అంశాలపై ప్రజలకు భరోసా ఇస్తూ మాట్లాడారాయన.