Begin typing your search above and press return to search.

జగన్ - చిరు లంచ్ వేళ.. ఏం మాట్లాడుకున్నారో మీకెవరు చెప్పారు పేర్నినాని?

By:  Tupaki Desk   |   23 Jan 2022 8:30 AM GMT
జగన్ - చిరు లంచ్ వేళ.. ఏం మాట్లాడుకున్నారో మీకెవరు చెప్పారు పేర్నినాని?
X
ఇద్దరు ప్రముఖులు వ్యక్తిగత స్థాయిలో కలిసి.. పలు విషయాల మీద మాట్లాడుకున్న విషయాలు బయటకు వస్తే.. అవెలా వస్తాయి? అన్నది ప్రశ్నగా మారుతుంటుంది. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటపెడితే తప్పించి బయటకు రావు. అది కూడా కాదంటే.. ఆ ఇద్దరికి సంబంధించిన వ్యక్తులతో.. ఆయా ప్రముఖులు తమకు తాముగా ఏదైనా చెప్పినప్పుడు.. ఆ సమాచారాన్ని సేకరించి మీడియా వార్తలు ఇస్తుంటుంది. ఈ సందర్భంగా సదరు ప్రముఖులకు సంబంధించిన వారు.. మీడియా మీద తెగ కామెంట్లు చేస్తారు? ఇద్దరు కలిసి మాట్లాడుకున్న విషయాలు మీడియాకు ఎలా తెలుస్తాయి? అంటూ ధర్మ సందేహాన్ని సంధిస్తుంటాయి.

తాజాగా ఏపీ సీఎం జగన్ - మెగాస్టార్ చిరంజీవిలు ఇద్దరు సీఎం నివాసంలో భోజనం చేసిన వైనం.. ఆ తర్వాత వారిద్దరూ తాపీగా మాట్లాడుకున్న మాటలు ఏమిటన్న విషయాన్ని గన్నవరం ఎయిర్ పోర్టులో చిరంజీవే ఓపెన్ గా చెప్పేశారు. సీఎం నివాసంలో తనకు లభించిన ఆదరణ విషయంలో చిరంజీవి ఎంత సంతోషంగా ఉన్నారన్నది ఆయన మాటలే చెప్పేశాయి. సో.. జరిగిన లంచ్ భేటీ మొత్తం సానుకూల వాతావరణంలోనే కావటంతో.. దానికి సంబంధించిన వివరాల్ని బయటపెట్టటం ద్వారా.. ఇద్దరు ప్రముఖుల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేనట్లే.

కానీ.. ఈ లంచ్ ఎపిసోడ్ లో అక్కడ లేని మంత్రి పేర్ని నానికి.. జగన్ - చిరులు ఏం మాట్లాడుకున్నారన్నది ఆయనకు ఎలా తెలుస్తుంది? భోజనం చేశారే తప్పించి.. సినిమా టికెట్ల వ్యవహారం వారి మాటల్లో రాలేదని ఆయన ఎలా చెప్పారు? మిగిలిన ముఖ్యమంత్రుల మాదిరి జగన్.. కేసీఆర్ లు.. మంత్రులతో టచ్ లో ఉండటమే కాదు.. ఎప్పటికప్పుడు వారితో భేటీ అయ్యే వీలు లేదు. అలాంటప్పుడు పేర్ని నాని నోటి నుంచి వచ్చిన తాజా మాటలు ఆయనకు ఎవరు చెప్పారు? అన్నది అసలు ప్రశ్న.

తన బాస్ జగన్ ఇంట్లో జరిగిన లంచ్ భేటీ గురించి.. మంత్రి పేర్నొ నాని చెప్పిన మాటలకు సీఎం జగన్ అనుమతి ఉందా? అన్నది మరో ప్రశ్న. ఎందుకిలా? ఒక మంత్రి మాట్లాడకూడదా? అంటే.. అందుకు గతంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలే కారణం. తాను సీఎం జగన్ కు పెద్ద పాలేరునని.. తనకు పదవి ఇచ్చిన ఆయనకు విధేయుడిగా ఉంటానంటూ గతంలో చేసిన వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుంటే.. పెద్ద పాలేరుగా ఉండే తాను.. తన యజమాని ఇంట్లో జరిగిన విషయాల్ని చెప్పే సాహసం చేస్తారా?

అంటే.. సీఎం జగనే తనకు తానుగా పేర్ని నానికి.. చిరంజీవితో తాను చేసిన లంచ్ సందర్భంగా ఏమేం మాట్లాడుకున్నామో చెప్పి.. ఆ విషయాలన్ని చిరు చెప్పిన వాటికి భిన్నంగా ఉన్నాయి కాబట్టి.. ఆ విషయాల్ని ప్రజలకు చేరవేయాలని పేర్ని నానిని ఆదేశించారా? అన్నది మరో సందేహం.

ఏపీ ముఖ్యమంత్రి జగన్.. మెగాస్టార్ చిరంజీవిల మధ్య జరిగిన లంచ్ భేటీలో ఏమేం మాట్లాడారన్న విషయాల్ని పేర్ని నానికి ఎవరు చెప్పారు? అక్కడ జరిగిన సంభాషణల్లో సినిమా టికెట్లకు సంబంధించిన చర్చ జరగలేదన్న సమాచారం ఆయనకు ఎలా తెలిసింది? ఒకవేళ ఆయనకు ఎవరైనా చెబితే.. ఆ విషయాన్ని వెల్లడించే దమ్ము.. ధైర్యం ఆయనకు ఉందా? అన్నది ప్రశ్న. మరి.. ఈ విషయాల్ని రివీల్ చేసే సత్తా పేర్ని నాని మాష్టారికి ఉందా? అన్నదిప్పుడున్న ప్రశ్న. మరి.. ఈ సందేహాలకు పేర్ని నాని ఎప్పుడు సమాధానాలు ఇస్తారో?