Begin typing your search above and press return to search.

బాబు త‌లొగ్గ‌డం ప్ర‌జా విజ‌య‌మే..ఇక తేల్చుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   8 March 2018 6:14 AM GMT
బాబు త‌లొగ్గ‌డం ప్ర‌జా విజ‌య‌మే..ఇక తేల్చుకోవాల్సిందే
X

ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వంపై ఈ నెల 21వ తేదీన అవిశ్వాస తీర్మానం పెడతామని ఇప్పటికే ప్రకటించిన జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే ఈ నిర్ణయాన్ని ముందే ప్రకటించామని… మేం పెట్టే అవిశ్వాస తీర్మానానికి ఆయన కలిసి రావాలన్నారు… లేకపోతే చంద్రబాబు సిద్ధపడితే ఆయన చెబితే రేపు అవిశ్వాసం పెట్టడానికైనా తాము సిద్ధమని వైఎస్ జగన్ ప్రకటించారు. ఐదు కోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన ప్ర‌త్యేక హోదా విష‌యంలో డ్రామాలాడుతూ చ‌ంద్ర‌బాబు చ‌రిత్ర హీనుడిగా మిగిలిపోవ‌ద్ద‌ని, హోదా సాధ‌న‌కు మాతో క‌లిసి చిత్త‌శుద్ధితో పోరాటం చేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచించారు. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ ప్రకాశం జిల్లా సంతరావురులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

రెండేళ్ల క్రితం అరుణ్‌జైట్లీ నిన్న చేసిన ప్ర‌క‌ట‌నే చేశార‌ని, అప్పుట్లో అర్ధ‌రాత్రి ప్రెస్‌ మీట్ పెట్టి స్వాగ‌తించిన చంద్ర‌బాబు ఇప్పుడు త‌ప్పుప‌డుతూ యూట‌ర్న్ తీసుకున్నార‌ని వైఎస్ జ‌గ‌న్‌ అన్నారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు త‌లఒగ్గ‌డం సంతోష‌మ‌ని, ఆయ‌న చరిత్ర హీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే తాము ఈ నెల 21న కేంద్రంపై ప్రవేశ పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాల‌ని జ‌గ‌న్‌ డిమాండ్‌ చేశారు. ఆయన కోరితే ఇంకా ముందుగానే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తాను సిద్ధమని - ఒక వేళ చంద్రబాబే అవిశ్వాసం పెట్టేందుకు ముందుకు వచ్చినా మద్దతు ఇచ్చి తీరుతామని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి మేం ఎప్పుడైనా సిద్ధమన్న జగన్… టీడీపీ పెట్టినా మేం మద్దతిస్తామన్నారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజున మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక హోదా రాదని చంద్రబాబుకు ముందే తెలుసని వైఎస్ జగన్ తెలిపారు. ఆ విషయం తెలిసినా కేంద్రం నుంచి వైదొలగడానికి ఇంత సమయమా? అని ప్ర‌శ్నించారు. అప్పుడే రాజీనామా చేసి పోరాడి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేదన్నారు. ప్రత్యేక హోదాకు, 14వ ఆర్థిక సంఘానికి సంబంధంలేదన్న జగన్ హోదా ఇస్తామనే ముంద‌స్తు ష‌ర‌తుతోనే రాష్ట్రాన్ని విడగొట్టారన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టొద్దని గట్టిగా విభేదించింది తామేనని తెలంగాణలో అన్యాయం జరుగుతుందని తెలిసినా తాము విభజనను వ్యతిరేకించామన్నారు. `పార్టీలతో సంబంధం లేకుండా 25 మంది ఎంపీలు ఎక్కతాటిపై నిలబడదాం… అప్పుడే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంది. ఏ పార్టీ అయినా మాకు అభ్యంతరం లేదు. ప్రత్యేక హోదాకు ఎవరు సంతకం పెడితే వారికే మా మద్దతు ఉంటుంది`అని తెగేసి చెప్పారు.

రాబోయే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌డంపైనా వైఎస్ జ‌గ‌న్ స్పందించారు. `ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోరాటం చేస్తామా అనే విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సరికాదు.. వచ్చే ఏడాది ఈ అంశంపై చూద్దాం` అని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ హోదా ఇవ్వకుంటే వారికి మద్దతు ఇవ్వబోమ‌ని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే అవకాశం లేనట్లు కనిపిస్తోందని అయితే. మున్మందు పరిస్థితులు ఎలా మారుతాయో చూద్దామ‌న్నారు.