Begin typing your search above and press return to search.

జగన్ బెయిల్ రద్దు కేసు : జూన్ 1 కి వాయిదా .. చివరి అవకాశమన్న సీబీఐ కోర్టు !

By:  Tupaki Desk   |   26 May 2021 8:32 AM GMT
జగన్ బెయిల్ రద్దు కేసు : జూన్ 1 కి వాయిదా .. చివరి అవకాశమన్న సీబీఐ కోర్టు !
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణ‌రాజు వేసిన పిటిషన్ పై ఈ రోజు నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అయితే , ఇప్పటివరకూ ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న సీఎం జగన్ కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో ఈ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని జగన్ తో పాటు సీబీఐని గతంలో కోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే. అయితే, జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలుకు ఇంకోసారి గడువు కోరారు. కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌ డౌన్ కార‌ణంగా సీఎం జ‌గ‌న్ కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేక‌పోతున్నార‌ని ఆయ‌న త‌రఫు న్యాయ‌వాది తెలిపారు. అలాగే, దీంతోపాటు సీబీఐ నుంచి ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు ధర్మాసనానికి తెలియజేశారు.

అయితే, కౌంట‌ర్‌ ను మెయిల్ ద్వారా స‌మ‌ర్పించ‌వ‌చ్చ‌ని, ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఆయన జాప్యం చేస్తున్నార‌ని ర‌ఘురామ న్యాయ‌వాది అన్నారు. అలాగే ప్రతివాదులకు జరిమానా విధించాలని కోరారు. ఈ నేపథ్యంలో ర‌ఘురామ పిటీష‌న్‌ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని జ‌గ‌న్‌ కు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు ఇప్ప‌టికే ప‌లుమార్లు అవ‌కాశం ఇచ్చిన సీబీఐ కోర్టు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చింది. జూన్ 1 వ తేదీన కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని , కౌంటర్ దాఖలు చేయడానికి చివ‌రి అవ‌కాశాన్ని ఇస్తున్న‌ట్లు న్యాయస్థానం ప్రకటించింది. జూన్ 1 వ తేదీన కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌కుంటే నేరుగా విచార‌ణ చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించింది. ఆ తర్వాత కేసు విచారణను జూన్ 1 కి వాయిదా వేసింది.

అక్రమాస్తుల కేసులో బెయిల్‌ పై ఉన్న సీఎం జగన్‌ పై ప్రస్తుతం హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ సాగుతోంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో విచారణ ఆలస్యమవుతోంది. దీనితో ఈ విచారణ త్వరగా పూర్తి చేయాలని, సీఎం జగన్‌ కు గతంలో మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు ఇప్పటికే మూడుసార్లు విచారణకు వచ్చినా జగన్‌ తో పాటు సీబీఐ కూడా కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో ఆలస్యమవుతోంది. సిబిఐ , సీఎం జగన్ కౌంటర్ దాఖలు చేస్తే ఈ కేసు విచారణ ముందుకి వెళ్లే అవకాశం ఉంది.