Begin typing your search above and press return to search.

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ వాయిదా .. సీబీఐ కోర్టు సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   17 May 2021 9:58 AM GMT
జగన్ బెయిల్ రద్దు పిటీషన్ వాయిదా .. సీబీఐ కోర్టు సంచలన వ్యాఖ్యలు
X
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే , సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్‌ పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటీషన్‌ పై తదుపరి విచారణను సీబీఐ న్యాయస్థానం ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఇదే చివరి అవకాశం అంటూ సిబిఐ అధికారులకి , సీఎం జగన్ కి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీ నాటి విచారణ సమయానికి తప్పనిసరిగా కౌంటర్‌ ను దాఖలు చేయాలని న్యాయస్థానం సీఎం వైఎస్ జగన్‌ ను ఆదేశించింది.

వైసీపీ రెబల్ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ న్యాయస్థానం ఇదివరకు వైఎస్ జగన్‌కు దాఖలు చేసిన బెయిల్‌ ను రద్దు చేయాలని కోరుతూ ఆయన కోర్టుని ఆశ్రయించారు. సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వైఎస్ జగన్‌ కు ఇచ్చిన బెయిల్‌ ను రద్దు చేసి, ఆయనపై నమోదైన ఆస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలంటూ సీబీఐ న్యాయస్థానంలో పిటీషన్ వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సీబీఐ న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ అధికారులు, వైఎస్ జగన్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. రెండుసార్లు కూడా కౌంటర్‌ దాఖలు చేయలేదు. దీనితో విచారణ వాయిదా పడుతూ వచ్చింది. తాజా విచారణలో కూడా కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని ఇరు పక్షాల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఈ సారి కూడా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సీబీఐ న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి చివరి అవకాశం ఇచ్చి, విచారణ ఈ నెల 26కి వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్ కావడం వల్ల దీని వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని పలువురు నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఎంపీ రఘురామను అలా అరెస్ట్ చేశారో , లేదో టీడీపీ , బీజేపీ ,జనసేన స్పందించిన తీరును వైసీపీ నాయకులు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎంపీ రఘురామ వెనుక ఉంటూ , ఆయన్ని ముందుకు పెట్టి కథ నడిపిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.