Begin typing your search above and press return to search.

టైమ్స్ నౌ స‌ర్వేతో చంక‌లు గుద్దుకంటే న‌ష్ట‌మే!

By:  Tupaki Desk   |   19 March 2019 5:51 AM GMT
టైమ్స్ నౌ స‌ర్వేతో చంక‌లు గుద్దుకంటే న‌ష్ట‌మే!
X
నిరాశ‌.. నిస్పృహ‌లు చేయాల్సిన ప‌నిని చేయ‌నివ్వ‌దు. అదే టైంలో మితిమీరిన ఆత్మ‌విశ్వాసం కూడా ఇలాంటి ప‌రిస్థితే ఉంటుంది. 2014 ఎన్నిక‌ల వేళ‌లో.. ఏపీలో తాము గెలిచిన‌ట్లేన‌న్న భ‌రోసా.. అతి న‌మ్మ‌కం జ‌గ‌న్ పార్టీ కొంప ముంచిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో జ‌రిగిన త‌ప్పు ఈ ఎన్నిక‌ల్లో అస్స‌లు జ‌ర‌గ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ బ‌లంగా ఉన్నారు. అయితే.. ఆయ‌న ఉన్నా.. చుట్టూ చోటు చేసుకునే ప‌రిణామాలు మాత్రం జ‌గ‌న్ బ్యాచ్ త‌ప్పుదారి ప‌ట్టేలా చేస్తున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎన్నిక‌ల వేళ‌లో కంటికి క‌నిపించే విష‌యాల‌కు.. చాప కింద నీరులా సాగే అంశాల‌కు మ‌ధ్య వైరుధ్యం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. తెలివి.. స‌మ‌య‌స్ఫూర్తి.. వాస్త‌వాల్ని అంగీక‌రించే గుణం లాంటివి ఉన్నోళ్లు మాత్ర‌మే వాస్త‌వ ప‌రిస్థితుల్ని గుర్తెరిగి అప్ప‌టిక‌ప్పుడు త‌మ వ్యూహాల్ని మార్చుకుంటూ ఉంటారు.

ఈ విష‌యంలో తెలంగాణ అధికార ప‌క్షం చాలా అలెర్ట్ గా ఉంటుంద‌ని చెప్పాలి. తాజాగా చూస్తే ప్ర‌ముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ సంస్థ ఒక స‌ర్వేను వెల్ల‌డించింది. దీని ప్ర‌కారం ఏపీలోని 25 లోక్ స‌భ స్థానాల‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్ని సొంతం చేసుకోనున్న‌ట్లు వెల్ల‌డించింది. దీంతో.. జ‌గ‌న్ వ‌ర్గం సంబ‌ర‌ప‌డిపోతోంది. ఇప్పుడున్న వేళ‌లో ఇలాంటి సంతోషం ఏ మాత్రం మంచిది కాదు.

ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లులోనే విజ‌యం ఖాయ‌మ‌న్న ధీమా మంచిది కాదు. ఎందుకంటే అజాగ్ర‌త్త‌ను పెంచ‌టంతో పాటు.. అన‌వ‌స‌ర‌మైన ధీమాను తీసుకొస్తుంది. దీంతో ఎన్నిక‌ల వేళ‌లో చేయాల్సిన ప‌నుల్ని వ‌దిలేయ‌టం.. అధికారం మ‌న‌కే వ‌స్తుంది కాబ‌ట్టి.. కొన్ని విష‌యాల్ని ప‌ట్టించుకోని త‌త్వ్తం పెరుగుతుంది. ఇలాంటివి విజయాన్ని దూరం చేసే ప్ర‌మాదం ఉంది.

మ‌రో కీల‌క‌మైన అంశం ఏమంటే..హిందీ.. ఇంగ్లిషు మీడియా సంస్థ‌ల‌కు చెందిన స‌ర్వేల‌ను పూర్తిగా న‌మ్మటం స‌రైన ప‌ద్ద‌తి కాదు. ఎందుకంటే.. ఆయా మీడియా సంస్థ‌ల‌కు తెలంగాణ‌లో.. ఆంధ్రాలో నెట్ వ‌ర్క్ ఉండ‌దు. చాలా త‌క్కువ శాంపిల్ తో వారు తుది నిర్ణ‌యానికి వ‌చ్చేస్తుంటారు. ఏపీ సంగ‌తిని ప‌క్క‌న పెడితే.. ఇదే సంస్థ తెలంగాణ‌లో టీఆర్ ఎస్ కు 13 ఎంపీ స్థానాలు.. బీజేపీకి రెండు.. కాంగ్రెస్‌ కు ఒక‌టి.. మ‌జ్లిస్ (ఇత‌రులు) ఒక స్థానం గెలుస్తుంద‌న్న అంచ‌నా వేసింది.

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయం గురించి తెలిసిన ఎవ‌రూ కూడా బీజేపీ రెండు స్థానాల్లో గెలిచే అవ‌కాశం లేద‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్ప‌గ‌ల‌రు. కానీ.. స‌ద‌రు మీడియా సంస్థ మాత్రం బీజేపీ రెండు స్థానాల్లో గెలుపు ప‌క్కా అని లెక్క చెప్పింది. ఈ కోణంలో చూసిన‌ప్పుడు టైమ్స్ నౌ స‌ర్వేను పూర్తిగా విశ్వ‌సించ‌టం కూడా త‌ప్పే అవుతుంది. మొత్తంగా చెప్పేదేమంటే.. స‌ర్వేల్లో గెలుపు ప‌క్కా అని చెప్పినా.. దాన్ని మ‌న‌సుకు తీసుకోకుండా.. తుది వ‌ర‌కూ పోరాడాల‌న్న ఆలోచ‌న‌ను విడిచి పెడితే ఫ‌లితం తారుమారు కావ‌టం ఖాయం. అందుకే.. టౌమ్స్ నౌ లాంటి స‌ర్వేల‌ను న‌మ్ముకున్నా.. నెత్తికి ఎక్కించుకున్నా న‌ష్టమే సుమా.