Begin typing your search above and press return to search.

హ్యాట్సాఫ్ జగన్.. ఏపీకి కేంద్రం పోల`వరం`

By:  Tupaki Desk   |   14 March 2020 1:30 PM GMT
హ్యాట్సాఫ్ జగన్.. ఏపీకి కేంద్రం పోల`వరం`
X
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టే నాటికి రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం చంద్రబాబు నేతృత్వలోని గత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పును ఖజానాపై మిగిల్చి చేతులు దులుపుకుంది. ఓ వైపు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు....మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు...జగన్ సర్కార్ కు భారీగా నిధులు కావాల్సిన అవసరం ఉంది. ఆబ్కారీ శాఖ ద్వారా అడ్డగోలుగా ఖజానా నింపుకునే అవకాశమున్నా....జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి దశల వారీ మద్యనిషేధాన్ని అమలు చేస్తున్నారు. చంద్రబాబులా ప్రచారాలకు, ఆర్భాటాలకు పోని జగన్....రాష్ట్రాభివృద్ధికి, ప్రజా ప్రయోజనాలకు సంబంధించి సైలెంట్ గా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధం ఉండేలా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీకి కేంద్రం నుంచి భారీ సాయం రాబోతున్నట్లు తెలుస్తోంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి కేంద్రం నుంచి 48 వేల కోట్ల రూపాయల నిధుల విడుదలకు మార్గం సుగమమైందని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటివరకు పోలవరం భూసేకరణ, పునరావాస వ్యయం, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎవరు చెల్లిస్తారనే అంశంపై క్లారిటీ లేదు. అయితే, తాజాగా కేంద్రం తో జగన్ సంప్రదింపుల నేపథ్యంలో వాటన్నింటినీ కేంద్రం చెల్లించనుందని తెలుస్తోంది.

తాజాగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సవరించిన అంచనా వ్యయం రూ.55 వేల 545 కోట్లు అని తెలుస్తోంది. అందులో సింహభాగం రూ.48 వేల కోట్లు చెల్లించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్రం పోలవరంపై16 వేల కోట్లు ఖర్చు చేసింది. మరో 32 వేల కోట్లు భరించనుందని, అందులో భూసేకరణ..పునరావాసాలకు సంబంధించి 27వేల కోట్లు ఖర్చు చేయనుందని తెలుస్తోంది.

ప్రాజెక్టు ఇంజనీరింగ్ కోసం మరో 5 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుందని తెలుస్తోంది. సవరించిన అంచనా వ్యయం ప్రకారం మిగిలిన 7 వేల 545 కోట్లు రాష్ట్రం భరిస్తే సరిపోతుందని తెలుస్తోంది. అంతేకాకుండా, 2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారట. అందుకు కేంద్రం కూడ సహకరించేందుకు సిద్ధంగా ఉందట. ఏది ఏమైనా పగ్గాలు చేపట్టి పట్టు మని పది నెలలు కూడా కాకుండానే కేంద్రం నుంచి ఇంత భారీ మొత్తంలో నిధులు రాబట్టిన జగన్ ....మిగిలిన నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడుపుతారనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు.