Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ కేబినెట్‌ లో నోరున్న మంత్రులు లేరా...!

By:  Tupaki Desk   |   19 July 2019 5:07 AM GMT
జ‌గ‌న్ కేబినెట్‌ లో నోరున్న మంత్రులు లేరా...!
X
ఏపీ కేబినెట్ లో విష‌య ప‌రిజ్ఞానం గ‌ల మంత్రులెవ‌రూ లేరా.. త‌మ వాగ్దాటితో ప్ర‌తిప‌క్షాన్ని క‌ట్ట‌డి చేయగ‌లిగే సమ‌ర్ధులెంద‌రు.. ప్రభుత్వ విధానాల‌ను వివరించి - జనంలో మెప్పు పొందడానికి పనికొచ్చే వారెవ‌రు.. ఇపుడు ఇదే చ‌ర్చ రాష్ట్ర‌వ్యాప్తం గా జ‌రుగుతోంది. ఏపీ అసెంబ్లీలో మొత్తం పాతిక మంది మంత్రులు ప్రభుత్వంలో ఉన్నారు. వీరిలో నోరున్న - విషయం బాగా వివరించగలిగిన మంత్రులెంద‌రు ఉన్నార‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ వ‌న్‌ మేన్ షో క‌న‌పడుతోంద‌ని - మిగ‌తా మంత్రులెవ‌రు ప్ర‌తిప‌క్షాన్ని ధీటుగా ఎదుర్కోలేక పోతున్నార‌ని వైసీపీ సానుభూతిప‌రులు ఒకింత ఆవేద‌న గురవుతున్నారు.

అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు అత్యంత కీల‌క‌మైన‌వి. ఏ ప్రభుత్వానికైనా కత్తి మీద సాము లాంటివి. సుధీర్ఘ కాలం సాగే ఈ సమావేశాలపై అటు ప్రజలకు కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ఏం చేయబోతోందో చెప్పుకునేందుకు ఈ సమావేశాలు ఎంత‌గానో ఉపయోగపడతాయి. ఇదే క్ర‌మంలో సర్కార్ ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం ప్ర‌య‌త్నిస్తుంది. అయితే తొలిసారి అధికారంలోకి వచ్చిన వైసీపీకి తొలి బడ్జెట్ సమావేశాలు ఎంతటి ప్రతిష్టాత్మకమో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

స‌భ‌లో అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టేందుకే ప్ర‌తిప‌క్షం ఎప్పుడూ ప్ర‌య‌త్నిస్తుంది. అర్థ‌వంత‌మైన చ‌ర్య‌లు కాకుండా - అధికార ప‌క్షంపై బుర‌ద జ‌ల్ల‌డం పైనే దృష్టి పెడుతుంది. సహజంగానే అధికార పక్షాన్ని రెచ్చగొడుతుంది. సహనంతో దాన్ని తీసుకుంటూ చర్చ కోసం ముందుకు సాగాల్సిన అవసరం - బాధ్యత అధికార పార్టీ మీద ఉంది. అలాగని ప్రతిపక్షం విమర్శలు చేస్తున్నా విడిచిపెట్టమని కాదు - వారికి సబ్జెక్ట్ తోనే సవాల్ ని ఎదుర్కోవాలి. అయితే వైసీపీ మంత్రుల్లో ఆ రకంగా స్పందించే వారు పెద్దగా కనిపించడంలేదన్న విమర్శలు వస్తున్నాయి.

ప్రతిపక్షం ట్రాప్ లో కొందరు మంత్రులు పడిపోతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. పాత సభను దృష్టిలో పెట్టుకుని టీడీపీ మీద ప్ర‌తికారం తీర్చుకోవాల‌న్న ఆతృత‌లో ఘాటుగా కాంమెంట్లు చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో జగన్ ఏరి కోరి తెచ్చుకున్న అయిదుగురు డిప్యూటీ సీఎంలు కూడా సభలో మౌనంగా కనిపిస్తున్నారు. ఒక్క పిల్లి సుభాష్ చంద్రబోస్ తప్ప మిగిలిన వారు స‌భ‌లో నోరెత్తడంలేదు. దీంతో అర్థ‌వంత‌వ‌మైన చ‌ర్చ‌లు లేకుండా - అసెంబ్లీ స‌మావేశాలు పేలవంగా సాగుతున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌ట‌కీ అయినా మంత్రులు త‌మ ప‌ద‌వులు త‌మ‌కు ఉన్నాయ‌ని కాకుండా అల‌క్ష్యం వీడి నిర్మాణాత్మ‌క‌మైన కౌంట‌ర్లు ఇస్తే జ‌గ‌న్‌ కు చాలా హెల్ఫ్‌ ఫుల్‌ గా ఉంటుంది.