Begin typing your search above and press return to search.

బాబుపై కొత్త పోరాటానికి పిలుపునిచ్చిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   22 April 2017 6:02 PM GMT
బాబుపై కొత్త పోరాటానికి పిలుపునిచ్చిన జ‌గ‌న్‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నిర్ణ‌యాల‌పై వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాను అణగదొక్కే దిశ‌గా సీఎం చంద్రబాబు చ‌ర్య‌లు తీవ్ర ఆక్షేప‌ణీయ‌మ‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. చంద్ర‌బాబు తీరును నిరసిస్తూ కొత్త పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ ద్వారా త‌న అభిప్రాయాలు పంచుకున్నారు.

త‌న త‌ప్పులు సోషల్ మీడియా ఎత్తిచూపుతుంద‌నే కార‌ణంతో సోష‌ల్ మీడియాను అణ‌గ‌దొక్కేందుకు సీఎం చంద్ర‌బాబు సిద్ధ‌మ‌య్యార‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. అందుకే అదే సోష‌ల్ మీడియా అస్త్రంగా చేసుకుని సీఎం చంద్ర‌బాబుపై పోరాటం చేయాలని జ‌గ‌న్ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా మీద ఏపీ ప్రభుత్వం కనబరుస్తున్న అసహనం, గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన స్పందించారు. పొలిటికల్ పంచ్ అనే ఫేస్‌బుక్ పేజీ నిర్వ‌హిస్తున్న రవికిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లడం, తర్వాత వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం కార్యాలయంలో సోదాలు చేయడం, అక్కడి సిబ్బందికి నోటీసులు ఇవ్వడం తదితర ఘటనల నేపథ్యంలో జ‌గ‌న్ ట్వీట్ చేశారు. సోష‌ల్ మీడియాను అణిచివేసేలా సాగుతున్న చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను ఖండించాలని పిలుపునిచ్చారు. ఏపీ సర్కారు అప్రజాస్వామిక విధానాలను కలిసికట్టుగా వ్యతిరేకించాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారులంతా ఈ దారుణాల‌పై స్పందించాలని వైఎస్ జ‌గ‌న్‌ ట్విట్టర్ ద్వారా కోరారు.