Begin typing your search above and press return to search.

సీబీఐ ఎందుకిలా చేస్తోంది ?

By:  Tupaki Desk   |   27 July 2021 5:37 AM GMT
సీబీఐ ఎందుకిలా చేస్తోంది ?
X
జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను దర్యాప్తు చేస్తున్న సీబీఐ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు వేసిన పిటీషన్ను సీబీఐ ప్రత్యేక కోర్టు విచారిస్తోంది. బెయిల్ రద్దుచేయించి ఎలాగైనా జగన్ను జైలుకు పంపాలన్నది రఘురామ పంతం. ఇదే సమయంలో బెయిల్ ను కంటిన్యు చేసుకోవాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో సీబీఐ నిర్ణయమే కీలకమైంది. ఎలాగంటే రఘురామ ఆరోపణలు ఏమిటంటే తన కేసుల్లో సాక్ష్యులను జగన్ బెదిరిస్తున్నారని, ప్రభావితం చేస్తున్నారని. జగన్ తరపున లాయర్లేమో తమ క్లైంట్ సాక్ష్యులెవరినీ ప్రభావితం చేయటంలేదని వాదిస్తున్నారు. రాజకీయ వైరంతోనే రఘురామ సీఎంపై అనవసరంగా కేసు వేసినట్లు వాదనలో పదే పదే చెబుతున్నారు.

సో జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారా ? బెదిరిస్తున్నారా ? అనే విషయాన్ని చెప్పాల్సింది సీబీఐ అధికారులే. జగన్-రఘురామ వ్యవహారంలో తాము ఎందుకు తలదూర్చాలని అనుకున్నదో ఏమో కానీ బెయిల్ రద్దు విషయం కోర్టు విచక్షణకే సీబీఐ వదిలేసింది. రెండు విచారణల్లో ఇదే విధమైన వైఖరిని సీబీఐ వ్యక్తంచేసింది. అయితే మొన్నటి విచారణలో మాత్రం సీబీఐ తన వైఖరిని లిఖితపూర్వకంగా తెలియజేయాల్సిందే అని కోర్టు గట్టిగా చెప్పింది. దాంతో కాస్త సమయం కావాలని నాలుగో విచారణలో అడిగింది.

ఇక్కడ గమనించాల్సిందేమంటే మూడోసారి విచారణ సందర్భంగానే పదిరోజుల సమయం కావాలని సీబీఐ అడిగితే జడ్జి సరేనన్నారు. అయితే సోమవారం విచారణలో మళ్ళీ గడువు కావాలని సీబీఐ కోరితే 30వ తేదీకి విచారణను వాయిదావేశారు. అయితే విషయం ఏమిటంటే సాక్ష్యులను జగన్ ప్రలోభాలకు గురిచేస్తుంటే చేస్తున్నాడని చెప్పాలి. ఒకవేళ ఎవరినీ ప్రభావితం చేయటంలేదంటే అదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో చెప్పాలి. అప్పుడు బెయిల్ విషయంలో కోర్టు ఏదో నిర్ణయం తీసుకుంటుంది.

ఏ విషయమూ చెప్పకుండా సీబీఐ ఎందుకిలా వ్యవహరిస్తోందో అర్ధం కావటంలేదు. సాక్ష్యులను జగన్ ప్రభావితం చేస్తున్నాడన్నట్లుగా అఫిడవిట్ దాఖలు చేయాలని రఘురామ బీజేపీ నేతల ద్వారా ఒత్తిడి పెంచేస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో తాను ఎవరినీ ప్రభావితం చేయలేదని అఫిడవిట్ వేయాలన్నట్లుగా జగన్ కూడా కేంద్రం ద్వారా సీబీఐపై ఒత్తిడి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇలాంటి ప్రచారం సీబీఐకి ఎంతమాత్రం మంచిదికాదు. కాబట్టి ఉన్న విషయాన్ని వెంటనే తెలియజేస్తే కోర్టే ఏదో నిర్ణయం తీసుకుంటుంది.