Begin typing your search above and press return to search.

జగన్...బాబు.. పవన్ : లేడీస్ ఫాలోయింగ్ ఎవరికి ఎంత...?

By:  Tupaki Desk   |   7 Jan 2023 2:30 AM GMT
జగన్...బాబు.. పవన్ : లేడీస్ ఫాలోయింగ్ ఎవరికి ఎంత...?
X
ఏపీలో వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకూ కీలకమే. ఒక విధంగా చెప్పాలీ అంటే అగ్ని పరీక్షగా చూడాలి. అధికార వైసీపీ ఈసారి ఎన్నికలలో గెలిస్తే హ్యాపీగా మూడు దశాబ్దాల పాటు విపక్షం లేని ఏపీని చేసి అధికారం చలాయించాలనుకుంటోంది. తెలుగుదేశం ఈసారి కనుక అధికారంలోకి వస్తే వైసీపీని మళ్లీ ఎన్నికల వేళకు లేకుండా చేయాలని చూస్తోంది. జనసేన అయితే ప్రధాన పార్టీలలో ఏదో ఒకటి ఎలిమినేట్ అయితే తాము ఆ ప్లేస్ లోకి రావాలనుకుంటోంది.

ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాలు ఉన్నాయి. ఇక కులాలు ప్రాంతాలు, వర్గాలు ఎన్ని ఉన్నా మహిళా సెక్షన్ అతి పెద్ద ప్రభావిత ఓటు బ్యాంక్ అన్నది తెలిసిందే. అలా కనుక చూసుకుంటే రాజకీయ పార్టీలు అన్నీ కూడా మహిళా ఓట్ల కోసమే గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇక చూస్తే ఏపీలో కొత్త ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది.

దాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని తెలిసింది. రాష్ట్రంలో ఏపీలో 3కోట్ల 99 లక్షల 84 వేల 868 మంది ఓటర్లు ఉన్నారు. గమ్మత్తేంటి అంటే ఇందులో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో 1 కోటి 97 లక్షల 59 వేల 489 మంది పురుష ఓటర్లు ఉంటే 2 కోట్ల 2 లక్షల 21 వేల 455 మంది మహిళా ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించింది.

అంటే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఏపీలో అయిదు లక్షల మంది అదనంగా ఉన్నారన్న మాట. మరో విషయం తీసుకుంటే పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఓటింగులో పాలు పంచుకునేది మహిళా ఓటర్లే. పైగా వారు గుంభనంగా ఉంటారు. తన ఓటు ఎటు వేశారో చెప్పారు. అలాగే వారు తమ అభిప్రాయాలను కచ్చితంగా ఈవీఎం మిషన్ వద్దనే వెల్లడిస్తారు.

దాంతో వారు ఎవరి పక్షం అన్నది తేలితే కనుక ఆ పార్టీదే ఎన్నికల్లో అధికారం అని చెప్పవచ్చు. మహిళా ఓటర్లు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నారని, పైగా వారు వివిధ సంక్షేమ పధకాల లబ్దిదారులు కాబట్టి తమకే వారు ఓటు అని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక లక్షల రూపాయలను నేరుగా మహీళల ఖాతాలలో వేశాం కాబట్టి మరో మారు తమనే ఎన్నుకుంటారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

అయితే తెలుగుదేశం వాదన ఆశ మరో విధంగా ఉంది. ఏపీలో శాంతి భద్రతలు లేవు, మహిళల మీద అత్యాచారాలు పెరిగాయి. అదే విధంగా స్కీముల కంటే ధరలు ఇతర భారాలు అధికం అయ్యాయి. దాంతో మహిళాగ్రహం కట్టలు తెంచుకుంటుంది, అదే తమకు శ్రీరమా రక్షగా మారుతుందని అంటున్నారు. మహిళల ఓట్లతోనే తమ ప్రభుత్వం భారీ ఆధిక్యతతో గెలవడం ఖాయమని చెబుతోంది.

జనసేనకు మహిళా ఓట్ల మీద ఆశలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కి సినీ గ్లామర్ తో పాటు పొలిటికల్ గ్లామర్ ఉందని, అందుకే ఆయనకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సారధ్యంలో జనసేన గెలుపునకు మహిళా ఓటర్లే కారణం అవుతారని ధీమా పడుతోంది. మరి మహిళా ఓటర్లు పెరగడం తమకు శుభసూచకం అని ప్రతీ రాజకీయ పార్టీ భావిస్తోంది. ఇంతకీ మహిళా ఓటర్లు ఎవరికి పట్టం కడుతారు అన్నదే కీ పాయింట్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.