Begin typing your search above and press return to search.

నేనూ లోకలే అంటున్న జగన్..

By:  Tupaki Desk   |   29 March 2017 8:35 AM GMT
నేనూ లోకలే అంటున్న జగన్..
X
ఏపీ సీఎం చంద్రబాబు ఎంతో పట్టుదలగా ఆగమేఘాల మీద అమరావతిలో అసెంబ్లీని నిర్మించడం.. ఈసారి బట్జెట్ సమావేశాలు అక్కడే నిర్వహించడం తెలిసిందే. అయితే... అసెంబ్లీని సొంత నేలకు తెచ్చాను.. మన ప్రజాప్రతినిధులను మన నేలపైనే సమావేశపరిచాను.. శతాబ్దాల తరువాత ఇక్కడ పాలన మళ్లీ మొదలైంది అంటూ జబ్బలు చరుచుకున్న చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు మాత్రం తాను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని.. అసెంబ్లీ ఇక్కడికి తేవడం వల్ల విపక్ష నేత జగన్ మరింత బలపడిపోతున్నారని బాధపడుతున్నారట. అందుకు కారణం ఉంది.. ఇంతకాలం హైదరాబాద్ కేంద్రంగానే తన గళం వినిపించిన జగన్ ఇప్పుడు అసెంబ్లీ రావడంతో అమరావతికి రావాల్సి వచ్చింది. దీంతో అసెంబ్లీ సమావేశాలు జరిగినంత కాలం ఆయన అమరావతిలో ఉండడంతో విజయవాడ సహా అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అనేక అంశాలను ప్రత్యక్షంగా గమనించే వీలు కలిగింది. అంతేకాదు.. నిరసనలు, ధర్నాలు ఎవరు చేసినా వారిని వెళ్లి కలిసి విషయం తెలుసుకుని సంఘీభావం ప్రకటించడం.. వారి తరఫున గళం వినిపించడంతో మైలేజి పెరిగింది. దీంతో జగన్ కూడా సభలో, బయట పట్టు సాధించేందుకు మరింత కసరత్తు చేయడం మొదలుపెట్టారు. సభలో కానీ, మీడియా ముందు కానీ ఆయన మాట్లాడుతున్నది వింటుంటే విపరీతంగా అధ్యయనం చేసి వస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో జగన్ దూకుడు చూసి చంద్రబాబు కాస్త కంగారు పడుతున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశాలకు, ప్రస్తుతం నవ్యాంధ్రలో సొంత గడ్డపై జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ మాట్లాడుతున్న తీరు పరిశీలిస్తే, విపక్ష నేత దూకుడు పెంచారన్న సంగతి అర్థమవుతోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రజాసమస్యలు, అంశాలపై కాకుండా అధికార-ప్రతిపక్షపార్టీ మధ్య ఆధిపత్యపోరుకు వేదికగా మారిన విషయం కాదనలేనిది. అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డుకుంటున్నా తరచూ మీడియా ద్వారా ప్రజలకు వెల్లడించే ప్రతి వ్యూహాన్ని కొనసాగిస్తూ తన వాదనలను వినిపించడంలో జగన్ విజయం సాధిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశాల్లో మీడియాతో పెద్దగా భేటీ కాని జగన్, అమరావతిలో మాత్రం దాదాపు ప్రతిరోజూ మీడియాలో ఉండే వ్యూహాన్ని కొనసాగిస్తున్నారు. సభ వాయిదా పడిన మధ్యలో, సభ ముగిసిన సమయంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పాల్సినవి చెబుతున్నారు.

ప్రధానంగా సాగు-తాగు నీరు, విద్యుత్ అంశాలపై ఆయన లేవనెత్తుతున్న అభ్యంతరాలు, చేస్తున్న విమర్శలు పరిశీలిస్తే జగన్ సభకు వచ్చే ముందు అన్ని అంశాలపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది. నిజానికి, రాష్ట్రంలో ఆ రెండు అంశాలపై ఇప్పటివరకూ సంపూర్ణ విషయ పరిజ్ఞానం ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబునాయుడు మాత్రమే. ఇరిగేషన్-పవర్ అంశాల్లో బాబు ఫైళ్లు చూడకుండానే గణాంకాలు సహా మాట్లాడుతుంటారు. ఇప్పుడు జగన్ కూడా ఆధారాలు సహా డీటెయిల్డ్ గా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇరికించేలా గళమెత్తుతున్నారు.

అంతేకాదు... తాజాగా విజయవాడలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ - సీనియర్ ఐపిఎస్ అధికారి బాలసుబ్రమణ్యంపై తెదేపా ఎంపి కేశినేని నాని - ఎమ్మెల్యే బోండా ఉమ - ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన దాడితో అధికారపార్టీ రాజకీయంగా ఇబ్బందిపడిన పరిస్థితిని సొమ్ము చేసుకోవడంలో, జగన్ సఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కృష్ణాజిల్లా నందిగామ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో పదిమంది చనిపోయిన ఘటనలో తనతోపాటు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలపై పెట్టిన కేసులను.. తాజాగా ఐపిఎస్ అధికారి గన్‌ మెన్‌ పై చేయిచేసుకున్నా కేసు పెట్టని ప్రభుత్వ పక్షపాతాన్ని జనంలోకి పంపించడంలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ పరిణామాలన్నీ చూస్తున్న చంద్రబాబు.. జగన్ విషయంలో కొత్త వ్యూహంతో వెళ్లకపోతే అమరావతిలో ఆయన దూకుడును ఆపడం కష్టమని ఒకరిద్దరు సీనియర్లతో అన్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/