Begin typing your search above and press return to search.

జగన్ చాయిస్ సర్ ప్రైజ్

By:  Tupaki Desk   |   13 Jun 2021 4:30 PM GMT
జగన్ చాయిస్ సర్ ప్రైజ్
X
తాజాగా ప్రభుత్వం నుండి గవర్నర్ కోటాలో భర్తీ కోసం వెళ్ళిన నాలుగు ఎంఎల్సీల పేర్ల విషయంలో వివాదం మొదలైంది. రమేష్ యాదవ్, లేళ్ళ అప్పిరెడ్డి, మోషేన్ రాజు, తోట త్రిమూర్తుల పేర్లు గవర్నర్ ఆమోదం కోసం వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. సామాజికవర్గాల సమతూకానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే జగన్మోహన్ రెడ్డి తాజా జాబితాను కూడా అలాగే రెడీ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సామాజికవర్గాల సమతూకం పాటించే విషయంలో ఎవరికీ అభ్యంతరాలు కనబడటంలేదు. అలాగే మోషేన్ రాజు, రమేష్ యాదవ్, లేళ్ళ అప్పిరెడ్డి విషయంలో కూడా ఎలాంటి అభ్యంతరాలు వినబడటం లేదు. అయితే తోట త్రిమూర్తుల విషయంపైనే పార్టీలో, బయటా బాగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే పై నాలుగు పేర్లలో త్రిమూర్తుల పేరు మాత్రమే బాగా వివాదాస్పదమవుతోంది.

తోట పేరుమీద ఇంత వివాదం మొదలుకావటానికి కారణం ఏమిటంటే ఆయన చరిత్రే అనిచెప్పాలి. తోట తన రాజకీయ జీవితాన్ని ఇండిపెండెంట్ ఎంఎల్ఏగా మొదలుపెట్టారు. తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన తోట అప్పట్లో టీడీపీ కోసం ప్రయత్నం చేసుకున్నారు. అయితే టికెట్ దక్కకపోవటంతో ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచారు. తర్వాత టీడీపీలో చేరిపోయారు.

అప్పట్లో రామచంద్రాపురం నియోజకవర్గంలోని దళితులపై దాడులు జరిగి వాళ్ళని చెట్టుకు కట్టేసి గుండ్లుకొట్టించిన ఘటన జరిగింది. ఆ ఘటన యావత్ దేశంలో సంచలనమైంది. అదే తర్వాత దళితుల శిరోముండనం ఘటనగా పాపులరైంది. ఆ ఘటనలో తోట ప్రధాన నిందుతుడట. అప్పటినుండి ఇప్పటికీ ఆ కేసు విచారణ జరుగుతునే ఉంది. ఈ విషయం ఒక ఎత్తైతే తరచూ పార్టీలు మారటం తోటకు బాగా అలవాటుగా మారిపోయిందనే ఆరోపణలున్నాయి.

ముందు టీడీపీలోకి వెళ్ళిన తోట తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో కి మారారు. మళ్ళీ టీడీపీలో చేరారు. ఇపుడు తాజాగా వైసీపీలో చేరారు. కేవలం తన అవసరాలు, ప్రయోజనాల కోసమే తోట అధికారపార్టీలోకి జంప్ చేస్తుంటారనే ప్రచారం విపరీతంగా ఉంది. రేపు ఇంకేదైనా పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే వెంటనే ఆ పార్టీలోకి దూకటానికి తోట రెడీగా ఉంటారనే సెటైర్లు కూడా పేలుతున్నాయి.

కాపు నేతకే అవకాశం ఇవ్వాలని అనుకుంటే పెద్దాపురం ఇన్చార్జి దొరబాబు లాంటి వాళ్ళు చాలామందే ఉన్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మొత్తంమీద తోట విషయంలో మాత్రం జగన్ ది బ్యాడ్ చాయిసే అని పార్టీ నేతలే అంటున్నారు. మరి తోట విషయంలో జరుగుతున్న ప్రచారం జగన్ దృష్టికి వెళుతుందా ?