Begin typing your search above and press return to search.

పర్చూరు: హితేష్ ఔట్.. వెంకటేశ్వరరావు ఇన్

By:  Tupaki Desk   |   13 March 2019 7:58 AM GMT
పర్చూరు: హితేష్ ఔట్.. వెంకటేశ్వరరావు ఇన్
X
ఆ కుటుంబానికి ఎంతో పేరుంది.. స్వయంగా దివంగత ఎన్టీఆర్ పిల్లనిచ్చిన కుటుంబం దగ్గుబాటి.. ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరిని దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు ఇచ్చి వివాహం జరిపించారు. మామకు తోడుగా తెలుగుదేశం పార్టీలో వెలుగు వెలిగిన వెంకటేశ్వరరావు ఆ తర్వాత పరిణామాలతో రాజకీయాలకు దూరంగా జరిగారు. తోడల్లుడు చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసేయగా.. అందుకు మౌనసాక్షిగా నిలబడ్డ దగ్గుబాటి దాన్ని భరించలేక బయటకొచ్చి బాబుపై పుస్తకాలు రాస్తూ...విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు. కొద్దికాలానికి భార్య పురంధేశ్వరీని రాజకీయాల్లో ఉంచి తాను వైదొలిగారు..

కానీ ఇప్పుడు ఎన్నికల టైం వచ్చింది. పురంధేశ్వరీ బీజేపీలో ఉండగా.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు హితేష్ చెంచురామ్ రాజకీయ భవిష్యత్ కోసం అడుగులు వేశారు. ఇటీవలే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలిసి ప్రకాశం జిల్లా పర్చూరు టికెట్ ను కొడుకు హితేష్ కు ఇప్పించేందుకు చర్చలు జరిపారు. ఆ టికెట్ ఖాయమైందని ప్రచారం జరిగింది. అధికారికంగా జగన్ ఇస్తాడని అనౌన్స్ కూడా వచ్చేసింది. అయితే కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఇప్పుడు జగన్.. దగ్గుబాటి వెంకటేశ్వరరావునే పర్చూరు నుంచి పోటీ చేయమంటున్నారనే వార్తలు వస్తున్నాయి.

తాజాగా ప్రతిపక్ష నేత జగన్ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై సర్వే నిర్వహించారట.. ఈ సర్వేలో పర్చూరులో హితేష్ చెంచురామ్ బలం సరిపోదని తేలిందట.. పర్చూరులో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన ఏలూరి సాంబశివరావు ఉన్నారు. ఆయనను ఢీకొట్టడానికి హితేష్ సరిపోడని.. వేంకటేశ్వరరావు పోటీచేసినా గెలుపు అంత ఈజీ కాదని సర్వేలో స్పష్టమైందట.. అందుకే జగన్.. తాజాగా హితేష్ ను పక్కనపెట్టి ఏకంగా వెంకటేశ్వరరావునే బరిలోకి దిగాలని సూచించినట్టు తెలిసింది.

రాజకీయాల నుంచి వైదొలిగి చాలా కాలం కావడంతో వెంకటేశ్వరరావు బలం.. బలగం తగ్గిపోయింది. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడ్డా ఆయన గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. అందుకే పర్చూరు సీటు విషయంలో జగన్ ఇచ్చిన హామీ మేరకు హితేష్ కాకుండా వెంకటేశ్వరరావునే బరిలో దించుతున్నారట... మరి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను కొట్టేంత సామర్థ్యం వెంకటేశ్వరరావుకు ఉందా లేదా అన్నది ఎన్నికల తర్వాతే తేలనుంది.