Begin typing your search above and press return to search.

అమ్మ అలా మాట్లాడుతున్నప్పడు చప్పట్లు కొట్టటమా జగన్?

By:  Tupaki Desk   |   9 July 2022 4:59 AM GMT
అమ్మ అలా మాట్లాడుతున్నప్పడు చప్పట్లు  కొట్టటమా జగన్?
X
మిగిలిన సందర్భాలు వేరు. అరుదైన పరిణామాలు వేరు. అరుదుగా జరిగినప్పటికి అనూహ్యంగా జరిగినప్పుడు.. ఆ క్షణాన స్పందించే తీరు చాలా చాలా కీలకం. ఆ సమయాన వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరిస్తే అంతకు మించిన గొప్ప విషయం మరొకటి ఉండదు. అందుకు భిన్నంగా వేలెత్తి చూపేలా వ్యవహరిస్తేనే తిప్పలు అన్ని. అనూహ్య రీతిలో చోటు చేసుకునే అరుదైన ఉదంతాలకు.. అందరికి ఆమోదయోగ్యమైన రీతిలో రియాక్టు కావటం అతి తక్కువ మంది మాత్రమే రియాక్టు అవుతుంటారు.

అలాంటిది ముందుగా అనుకున్నది అనుకున్నట్లుగా చేసే వేళలో.. ఎలా వ్యవహరించాలన్న దానిపై బోలెడంత క్లారిటీ ఉంటుంది. అత్యున్నత స్థానాల్లో ఉన్నప్పుడు.. తాను ముందు ఫిక్సు చేసిన సీన్ లో ఎవరెలా ఉండాలన్న దానిపైనా వర్కువుట్ చేస్తారు. మరి.. ఆ కసరత్తు ఏపీ సీఎం జగన్ విషయంలో ఏమైంది? ఎందుకు తేడా కొట్టింది? అన్నదిప్పుడు ప్రశ్న. జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న వైఎస్ విజయమ్మ.. పార్టీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవటం తెలిసిందే.

అయితే.. ఇదంతా జగన్ ఒత్తిడి మేరకు.. ఇష్టం లేకున్నా విజయమ్మ తన పదవికి రాజీనామా చేస్తున్నారంటూ జగన్ కు వ్యతిరేకంగా ఉండే మీడియా చెబుతున్న మాట. ఇందులో నిజాలు ఎంతన్న విషయానికి వస్తే.. ఎవరి వాదనను వారు వినిపిస్తున్నారు. అబద్ధాల్ని వండి వారుస్తోంది ఎల్లో మీడియా అంటూ విరుచుకుపడుతున్న వారికి మాటల్ని చూస్తున్నప్పుడు కలిగే సందేహం ఏమంటే.. ఒకవేళ అదే నిజమైతే.. అమ్మ చేత జగన్ రాజీనామా చేయిస్తున్నారన్నది జరగకూడదు కదా?

కానీ.. అలా జరగటం చూసినప్పుడు ఎంత ఎల్లో మీడియా అయినా.. అది చెబుతున్నదే జరుగుతున్నప్పుడు.. దాన్ని ఎల్లో మీడియా అంటూ ముద్ర వేయటం సరికాదేమో? అన్న సందేహం కలుగక మానదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రత్యేక సందర్భంలో తన తల్లి తాను పెట్టిన పార్టీలో గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్న వైనంపై కొడుకైన జగన్ ఎలా రియాక్టు కావాలి? అన్నది మరో ప్రశ్న.

నిజానికి ఒక రాష్ట్రానికి పవర్ ఫుల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మంత్రదండం లాంటి అధికార దండం చేతిలో ఉన్నప్పుడు.. పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తానని తన తల్లి నిర్ణయాన్ని మార్చేంత శక్తి జగన్ కు లేదా? అన్నది ప్రశ్న.

మిగిలిన సందేహాల్ని మనసులో భద్రంగా దాచేసుకున్నా.. విజయమ్మ రాజీనామా మాట నోటి నుంచి వచ్చిన వేళలో.. జగన్ చేతులు చప్పట్లు కొట్టటం దేనికి నిదర్శనం? అన్నది మరో ప్రశ్న. తన తల్లి తన పదవికి రాజీనామా చేస్తున్న వేళలో.. జగన్ చేతులు చప్పట్లు కొట్టటం ద్వారా.. అందరూ ఆ నిర్ణయాన్ని స్వాగతించాలన్న సందేశాన్ని తన చేతలతో చేసి చూపించారా? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీసిందని చెప్పాలి.