Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ప‌రిణ‌తి చూసిన నేత‌ల ప‌రేషాన్..

By:  Tupaki Desk   |   24 Nov 2016 5:30 PM GMT
జ‌గ‌న్ ప‌రిణ‌తి చూసిన నేత‌ల ప‌రేషాన్..
X
డీమోనిటైజేష‌న్ నిర్ణ‌యంతో దేశంలోని రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ అల‌జ‌డి రేగింది. మోడీ నిర్ణ‌యంపై ఆ పార్టీ నేత‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తుంటే విప‌క్షాల‌న్నీ భ‌గ్గుమంటున్నాయి. దీనిపై ఎవ‌రి అవ‌గాహ‌న మేర‌కు వారు మాట్లాడుతున్నారు. ముఖ్య‌మంత్రిగా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న‌ - ఆర్థిక‌వేత్త‌గా గుర్తింపు ఉన్న చంద్ర‌బాబు వంటివారు కూడా దీనిపై త‌డ‌వ‌కో మాట చెబుతూ త‌మ పిల్లిమొగ్గ‌లు వేస్తున్నారు. నిర్ణ‌యం వెలువ‌డిన వెంట‌నే స్పందించి ఆ త‌రువాత ప్ర‌జల క‌ష్టాలు చూసి మాట మారుస్తున్నారు. కేసీఆర్ వంటి సీఎంల‌దీ అదే ప‌రిస్థితి. గ‌ట్టిగా స‌మ‌ర్థించ‌లేక‌.. గ‌ట్టిగా వ్య‌తిరేకించ‌లేక డోలాయ‌మానంలో ఉన్నారు. ప‌రిణ‌తి ఉన్న ఎంద‌రో నేత‌ల‌ది అదే ప‌రిస్థితి. వంద‌లాది ఆర్థిక అంశాలు ముడిప‌డి ఉన్న ఇంతటి సంక్లిష్ట నిర్ణ‌య ప‌ర్య‌వ‌సానాల‌పై త‌క్ష‌న అభిప్రాయాలు వ్య‌క్తం చేయ‌డం తొంద‌ర‌ప‌డ‌డ‌మే అవుతుంది.. కానీ చాలామంది నేత‌లు అదే తొంద‌ర‌పాటుతో త‌మ అవ‌గాహ‌న రాహిత్యాన్ని చాటుకున్నారు. అయితే... జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రంతిప్పే చంద్ర‌బాబు వంటి సీనియ‌ర్ నేత‌లు కుర్ర‌కుంక అంటూ తీసిప‌డేసే వైసీపీ అధినేత జ‌గ‌న్ మాత్రం ఈ విష‌యంలో లేటుగా అయినా లేటెస్టుగా స్పందించి ఆర్థికవేత్త‌లుగా గొప్ప‌లు పోయే నేత‌లంతా ముక్కున వేలేసుకునేలా పూర్తి అవ‌గాహ‌న‌తో దీని ప‌రిణామాల‌పై మాట్లాడ‌డంతో నేతలంతా షాక్ తిన్నారు. ఆరేడు నెల‌లు క‌స‌ర‌త్తు చేసి మోడీ తీసుకున్న నిర్ణ‌యాన్ని అంతలా సునిశితంగా విశ్లేషించిన జ‌గ‌న్ ప‌రిణ‌తిని చూసి తామెందుకు అలా మాట్లాడ‌లేక‌పోయామా అని అసూయ‌ప‌డుతున్నారు. కొంద‌రైతే... మొక్క‌కు అంటుక‌ట్టిన‌ట్లు... ఇంటికి గోడ క‌ట్టిన‌ట్లు ఎంత ప‌ద్ధ‌తిగా చెప్పాడ‌య్యా.. ఏమాత్రం క‌న్ఫ్యూజ‌న్ లేకుండా క్లారిటీ ఇచ్చాడు జ‌గ‌న్ అని అంటున్నారు.

సానుకూల‌ - ప్ర‌తికూల ప్ర‌భావాలూ రెండింటినీ చూపుతున్న మోడీ నిర్ణ‌యంపై జ‌గ‌న్ త‌న అభిప్రాయాల‌ను విస్ప‌ష్టంగా వెల్ల‌డించారు. రాజ‌కీయ కోణంలో - నిర్వ‌హ‌ణ కోణంలో.. ప‌ర్య‌వ‌సానాలు - ఫ‌లితాల కోణంలో మొత్తంగా జ‌గ‌న్ దీన్ని అద్భుతంగా విశ్లేషించార‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. చివ‌ర‌కు జ‌గ‌న్ పేరెత్తితే ఒంటికాలిపై లేచే టీడీపీ నేత‌లు కూడా జ‌గ‌న్ లా త‌మ నేత చంద్ర‌బాబు మాట్లాడ‌లేక‌పోయార‌ని అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో అంగీక‌రిస్తున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ వ్యాఖ్య‌లు జాతీయ మీడియాలోనూ ప్ర‌ముఖంగా రావ‌డంతో ఇత‌ర రాష్ర్టాల నేత‌లు కూడా జ‌గ‌న్ అవ‌గాహ‌న‌ను చూసి శ‌భాష్ అంటున్నారు.

ముఖ్యంగా జ‌గ‌న్ న‌ల్ల‌డ‌బ్బు అరిక‌ట్ట‌డానికి తీసుకునే చ‌ర్య‌లు అవ‌స‌రమే అని నొక్కి చెబుతూనే... అలాంటి పెద్ద నిర్ణ‌యం తీసుకునే ముందు ప్రభుత్వం ప్రతిపక్షాలను సంప్రదించడం, సామాన్యులను సంప్రదించడం చేస్తే ఎంతో బాగుండేద‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం అలా చేయ‌క‌పోవ‌డ‌మే పెద్ద లోప‌మ‌ని... అందుకే ఈ ఇబ్బందుల‌ని ఆయ‌న సూత్రీక‌రించారు. అదేకాకుండా ఎంతో ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాల్సిన ఈ నిర్ణ‌యం ముందే కొందరికి తెలియ‌డ‌మ‌న్న‌ది పెద్ద లోప‌మ‌ని తేల్చారు. చంద్ర‌బాబు వంటి కేంద్రంతో మంచి సంబంధాలున్న‌వారికి ముందే తెలియడంతో వారు అంతా స‌ర్దుకున్నార‌ని... దానివ‌ల్ల మోడీ ల‌క్ష్యం ఆదిలోనే దెబ్బ‌తింద‌ని జ‌గ‌న్ ఏకిప‌డేశారు.

నల్లడబ్బును అరికట్టడాన్ని స్వాగతిస్తూనే ఆయ‌న నిర్ణ‌యం అమ‌ల్లో లోపాల‌ను ప్ర‌స్తావించారు. దానివ‌ల్ల ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందులు ప‌డుతున్నారో కళ్ల‌కు క‌ట్టారు. మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రణాళికలు కూడా సరైన విధంగా అమలు చేయకుంటే విఫలమవుతాయంటూ ఆయ‌న మోడీకి సూచ‌న చేశారు. అంత‌ర్జాతీయ స్థాయిలో ఇలాటి నిర్ణ‌యాలు గ‌తంలోనూ అమ‌లు లోపాల కార‌ణంగానే దెబ్బ‌తిన్నాయ‌న‌డానికి ఉదాహ‌ర‌ణలు కూడా చూపించి దీనిపై తాను ఎంత అధ్య‌య‌నం చేశార‌న్న‌ది చెప్ప‌క‌నే చెప్పారు. అవిభాజ్య ర‌ష్యాకు అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన మిఖాయిల్ గోర్బచేవ్ ఆ దేశాన్ని సోషల్ ఎకనామిక్ నుంచి లిబరల్ ఎకానమిగా మార్చేందుకు తీసుకున్న నిర్ణ‌యం ఎలా ఫెయిలైందో జ‌గ‌న్ విశ్లేషించారు. నిర్ణ‌యం గొప్ప‌దైనా, దాని అమలుకోసం సరైన చర్యలు తీసుకోకపోవడంతో విఫలమైందని గుర్తు చేశారు. నోట్ల రద్దు అమలులో ఇప్పుడు పారదర్శకత లోపించిందన్నారు.

ప్ర‌జ‌ల క‌ష్టంపై జ‌గ‌న్ ఆవేద‌న‌..

నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం త‌రువాత జ‌గ‌న్ ప్ర‌జ‌ల సాధక‌బాధ‌కాల‌న్నీ క‌ళ్లారా చూశార‌ని తెలుస్తోంది. ఆయ‌న మాట‌ల్లో ప్ర‌జ‌ల క‌ష్టం ప్ర‌త్య‌క్షంగా క‌నిపించింది. పెద్ద నోట్ల రద్దుతో చిన్న - సన్నకారు రైతులు ప‌డుతున్న క‌ష్టాల‌ను ఆయ‌న వివ‌రించారు. రైతులు తమ పంటను అమ్ముకోలేని - కొత్త పంటలు వేసుకోలేని పరిస్థితిని... వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలో సగం కూడా రాని పరిస్థితిని ఆయ‌న వివ‌రించారు.

దేశ‌ - రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితుల‌ను ఆయ‌న ఎంత‌గానో అధ్య‌య‌నం చేసి ఈ నిర్ణ‌య ప్ర‌భావాన్ని వివ‌రించారు. దేశంలోని 6 లక్షల 38 వేల‌ గ్రామాలు క్యాష్ ఎకానమీపైనే న‌డుస్తున్నాయ‌న్న స‌త్యం చెప్పిన జ‌గ‌న్.. గ్రామాల్లో 75 శాతం మంది క్యాష్ ఎకానమీపైనే లావాదేవీలు సాగిస్తున్నార‌ని తెలిపారు. 92 శాతం గ్రామాల్లో బ్యాంకులు లేవ‌న్న స‌త్యాన్ని జ‌గ‌న్ చెప్ప‌డంతో ఎవ‌రూ దాన్ని కాద‌న‌లేని ప‌రిస్థితి. 53 శాతం జనాభాకు మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయ‌ని... దేశంలో ఉన్న ఏటీఏంలలో పదిశాతం కూడా గ్రామాల్లో లేవ‌ని... జ‌గ‌న్ చెప్ప‌డంతో అవును క‌దా.. ఇవ‌న్నీ ఆలోచించ‌కుండా మేమంతా మోడీని శ‌భాష్ శ‌భాష్ అన్నామే అని ప‌లువురు నేత‌లు వాపోతున్నార‌ట‌.

గ‌తంలో పెద్ద నోట్లు ర‌ద్దు చేసిన సంద‌ర్భంలో ఇలాంటి ప‌రిస్థితి లేద‌ని... దేశంలో 50 లక్షల మందికి 2 కోట్ల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. ఇవన్ని 120 కోట్ల మంది జనాభాకు ఏవిధంగా సరిపోతాయ‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించ‌డంతో ఎవ‌రి వ‌ద్దా స‌మాధానం లేని ప‌రిస్థితి. గొప్ప నిర్ణ‌య‌మే అయినా ముందస్తు సన్నాహాలు చేయకుండా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సమజసం కాద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అంతేకాదు... క్యాష్ లెస్ ఎకాన‌మీని స‌మాజంలో వ్యాప్తించెందించాలంటే ముందుగా ప్ర‌జ‌ల‌కు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాల‌ని చెప్పారు.

గ‌తంలో 1975లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు చెలామణిలో వాటి భాగం 0.6 శాతం మాత్రమే ఉండేద‌ని.. ఇప్పుడు 86 శాతం చెలామణిలో ఉన్న కరెన్సీని రద్దు చేసినప్పుడు అందుకు చాలా కస‌ర‌త్తు అవ‌స‌ర‌మ‌ని.. కానీ, అదేమీ లేకుండా రంగంలోకి దిగి ప్ర‌జ‌ల‌ను క‌ష్టాల్లోకి నెట్టార‌ని జ‌గ‌న్ ఏకిప‌డేశారు. ముంద‌స్తు ప్రణాళిక లేకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తొలుత స‌మ‌ర్థించి త‌రువాత ప్లేటు మార్చిన చంద్రబాబును కూడా ఆయ‌న ఏకిప‌డేశారు.

జ‌రిగిపోయినదాన్ని ఎవ‌రూ మార్చ‌లేక‌పోయినా జ‌రిగిన న‌ష్టం నుంచి కోలుకునేలా ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వాల‌ని సూచించారు. ఏటీఎంల వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారికి నష్ట పరిహారం ఇప్పించాల‌నిజ‌గ‌న్ డిమాండు చేశారు. అంద‌రిలా తాను వెంట‌నే స్పందించ‌లేద‌ని... మంచీ చెడులన్నీ తెలుసుకుని.. ప్ర‌జ‌ల‌తో మాట్లాడి, వారి క‌ష్ట‌న‌ష్టాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడుతున్నాన‌ని చెప్పిన ఆయ‌న నాయ‌కులు ఎలా ఉండాలో కూడా చెప్ప‌క‌నే చెప్పారు. నాయ‌కులంటే మైకు ప‌ట్టుకుని నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ‌డం కాద‌ని.. ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డం అని.. స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేయ‌డం నాయ‌కుల ల‌క్ష‌ణ‌మ‌ని జ‌గ‌న్ త‌న స్పంద‌న‌తో అంద‌రికీ గుణ‌పాఠం చెప్పారు. రోజంతా స‌మావేశాలు - స‌మీక్ష‌లు - ప్రెస్ మీట్లు నిర్వ‌హిస్తే స‌రిపోద‌ని... అంశాల‌పై అవ‌గాహ‌న‌ - ప్ర‌జాకోణం ఉండాల‌ని ఆయ‌న నేత‌ల‌కు కొత్త పాఠం చెప్పారు. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై స్పంద‌న‌తో జ‌గ‌న్ త‌న‌కు, మిగ‌తా నేత‌ల‌కు మ‌ధ్య ఉన్న తేడాను నిరూపించుకున్న‌ట్ల‌యింది. రాజ‌కీయాల్లో అనుభ‌వం ఒక్క‌టే చాల‌ద‌ని... అవ‌గాహ‌న‌, ప్ర‌జ‌ల ప‌ట్ల స‌హానుభూతి ఉండాల‌న్న స‌త్యాన్ని ఆయ‌న చాటారు. దీంతో నేత‌లంతా ఇప్పుడు భుజాలు త‌డుముకుంటున్నారు... డీమానిటైజేష‌న్ పై నాలెడ్జి పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఏమో అనుకున్నాం కానీ కుర్రాడిలో చాలా డెప్తుందే అని త‌మ‌లో తాము అనుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/