Begin typing your search above and press return to search.

జగన్ నిర్ణయంతో కేసీఆర్ కు కొత్త మంట!

By:  Tupaki Desk   |   4 Sep 2019 5:10 AM GMT
జగన్ నిర్ణయంతో కేసీఆర్ కు కొత్త మంట!
X
ఇచ్చిన మాటను నెరవేర్చే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంత సీరియస్ గా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. వేలాది మంది కార్మికులు.. ఉద్యోగుల కలను తన తాజా నిర్ణయంతో తీరచేశారు ఏపీ సీఎం. దశాబ్దాలు వినిపిస్తున్న డిమాండ్ ను తొంభై రోజుల కసరత్తుతో ఒక కొలిక్కి తీసుకురావటమే కాదు.. తన నిర్ణయంతో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు జగన్.

ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే కలను సాకారం చేసిన జగన్ నిర్ణయం ఏపీ ఆర్టీసీ ఉద్యోగుల్లో కొత్త సంతోషానికి కారణమైంది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో 52 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. బస్సు ఛార్జీలను అందరికి అందుబాటులో ఉండేలా చేయటంతో పాటు.. ట్రాన్స్ పోర్ట్ రెగ్యులేటరీ కమిషన్ ను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు.

అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న బస్సుల స్థానే దశల వారీగా ఎలక్ట్రికల్ బస్సుల్ని తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని తాజా మంత్రివర్గ సమావేశంలో తీసుకోనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపివేయటంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఇదంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తలనొప్పిగా మారనున్నట్లు చెబుతున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపివేయాలంటూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం కేసీఆర్ మీద కొత్త ఒత్తిడిగా మారనుంది. నిర్ణయం ఏదైనా.. పథకం ఎలాంటిదైనా తాను తీసుకోవాలే తప్పించి.. మరొకరు అమలు చేసిన పథకాల్ని.. విధానాల్ని తాను పాటించే విషయంలో కేసీఆర్ కు కొన్ని వ్యక్తిగత రిజర్వేషన్లు ఉన్నాయి. వాటికి భిన్నంగా ఆయన నిర్ణయం తీసుకోలేరు.

ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని సర్కారులో కలిపివేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణలోని ఆర్టీసీని సైతం ప్రభుత్వంలో కలిపివేయాలన్న డిమాండ్ మరింతగా ముదరటం ఖాయం. ఒకరు తీసుకున్న నిర్ణయాల్ని తాను అమలు చేయటమా? అన్నట్లుగా కేసీఆర్ తీరు ఉంటుందని.. ఇలాంటివేళ.. జగన్ నిర్ణయం కారణంగా తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి మరింత తీవ్రమవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే విషయంలో కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండనుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతి విషయంలోనూ తానే ముందుండాలని భావించే కేసీఆర్.. తాజా పరిణామాలు మింగుడుపడని రీతిలో ఉంటాయని చెబుతున్నారు.