Begin typing your search above and press return to search.

షర్మిల పాదయాత్ర వేళ.. షర్మిలతో వరుస పెట్టి జగన్ సన్నిహితుల భేటీ

By:  Tupaki Desk   |   26 Oct 2021 4:10 AM GMT
షర్మిల పాదయాత్ర వేళ.. షర్మిలతో వరుస పెట్టి జగన్ సన్నిహితుల భేటీ
X
చెప్పినట్లుగానే పార్టీ పెట్టటం.. పాదయాత్రను షురూ చేయటంలో వైఎస్ షర్మిల ముందున్నారు. మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నంగా ఆమె తన పార్టీని నడిపిస్తున్నారు. సాధారణంగా ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే.. అందులోని పేరున్న నేతల్ని చేర్చుకోవటం.. అనంతరం రాష్ట్రస్థాయి.. జిల్లా స్థాయి.. నియోజకవర్గ స్థాయి నేతల చేరికల మీద ఫోకస్ చేయటం లాంటివి చేస్తారు. అందుకు భిన్నంగా వేళ్ల మీద లెక్కించే నాయకులు మాత్రమే పార్టీలో ఉన్నా.. వాటి గురించి ఆలోచించకుండా ప్రజల్లో పలుకుబడి పెంచుకోవటానికి పాదయాత్ర అనే అస్త్రాన్ని బయటకు తీసిన షర్మిల.. ఆ దిశగా తన ప్రయాణాన్ని షురూ చేయటం తెలిసిందే.

పాదయాత్రలో భాగంగా నిత్యం తెలంగాణ రాష్ట్ర మంత్రిని.. ప్రభుత్వాన్ని సూటిగా టార్గెట్ చేస్తూ.. ఘాటుగా రియాక్టు అవుతున్నారు. విమర్శలు.. ఆరోపణల్ని సంధించే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోందని చెప్పాలి. సెంటిమెంట్ లో భాగంగా చేవెళ్ల నుంచి పాదయాత్రను షురూ చేసిన ఆమె.. తాను పర్యటించే ప్రతి ప్రాంతంలో ఒక విషయాన్ని మాత్రం ఆమె పదే పదే చెబుతున్నారు.

తానూ తెలంగాణ ఆడబిడ్డనే అని.. ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. ఇక్కడే చదివా.. ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకున్నానని.. కొడుకును.. కూతర్ని కన్నానని.. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే తాను ప్రజల ముందుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రజలకే తన జీవితాన్ని అంకితం చేస్తానని.. తనను ఆశీర్వదించాలని ఆమె ప్రజల్ని కోరుతున్నారు. తాజాగా ఆమె షురూ చేసిన పాదయాత్ర ఆరో రోజుకు చేరుకుంది. సోమవారం ఆమె 14.6 కిలోమీటర్లు మాత్రమే నడిచారు. రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదని.. కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయంటూ మండిపడ్డారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పాదయాత్ర సందర్భంగా ఏపీకి చెందిన తన సోదరుడు జగన్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు షర్మిలతో భేటీ కావటం.. మంతనాలు జరపటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకిలా? అన్న దానికి సరైన సమాధానం రాజకీయ వర్గాల నుంచి రావట్లేదు. ఇక.. ఆమెను కలిసి ఆ ఇద్దరు కీలక నేతల్ని చూస్తే.. లేమూరులో నిర్వహించిన మాట - ముచ్చట కార్యక్రమంలో ఏపీలోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అయితే.. ఆయన వేదికను పంచుకోకుండా ప్రజల మధ్యనే కూర్చొని షర్మిల ప్రసంగాన్ని వినటం గమనార్హం. దీనికి ఒక రోజు ముందు అంటే.. ఆదివారం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా షర్మిలతో భేటీ కావటం విశేషం. ఇలా.. జగన్ కు అత్యంత సన్నిహితులైన ఇరువురు నేతలు వరుస పెట్టి రెండు రోజుల్లో ఒక్కొక్కరు చొప్పున షర్మిలతో భేటీ అయిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షించేలా.. రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర తీసేలా ఉందని చెప్పాలి.