Begin typing your search above and press return to search.

పింఛన్ల తొలగింపుపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   27 Dec 2022 4:30 PM GMT
పింఛన్ల తొలగింపుపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు!
X
ఆంధ్రప్రదేశ్‌ లో దాదాపు 62 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా జగన్‌ ప్రభుత్వం పింఛన్లు అందజేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే జనవరి నుంచి రూ.250 పెంచి రూ.2,750 అందజేయనున్నారు. అంటే.. ప్రస్తుతం ఇస్తున్న రూ.2,500 పింఛన్‌ ను రూ.2,750 చేస్తారు. ఈ పింఛనుదారులపైనే జగన్‌ ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. తాము వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటిన లబ్ధిదారుల వద్దకే వెళ్లి పించన్లు అందజేస్తున్నామని చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ 62 లక్షల మంది తమకే ఓటేస్తారని గట్టి నమ్మకంతో ఉంది.

అయితే వివిధ కారణాలతో గత కొన్ని రోజులుగా పింఛన్లను తొలగిస్తున్నారు. ఆదాయపన్ను కడుతున్నారని, నిర్దేశిత పరిమితిని మించి పొలం ఉందని, ఇళ్ల స్థలం ఉందని, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇలా పలు కారణాలతో లబ్ధిదారులను తొలగిస్తున్నారు. దీనిపై ప్రధాన మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఇలా దాదాపు 1,25,000 మందికిపైగా లబ్ధిదారులను అర్హుల జాబితా నుంచి తొలగిస్తోందని ప్రధాన మీడియా పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం సందర్భంగా పింఛన్‌ తొలగింపుపై వస్తున్న వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ కొన్ని మీడియా సంస్థలపై మండిపడ్డారు. పింఛన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నోటీసులు ఇస్తేనే పింఛన్లు తీసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అనర్హులకు పథకాలు రాకూడదు, ఇవ్వకూడదనేదే తమ అభిప్రాయమని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు అనర్హులకు నోటీసులు ఇస్తారని, రీసర్వే చేసి చర్యలు తీసుకుంటారని తేల్చిచెప్పారు. రీ వెరిఫికేషన్‌ లేకుండా లబ్ధిదారులను తొలగించబోరని హామీ ఇచ్చారు.

లంచాలు లేకుండా అర్హులకు పథకాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా జగన్‌ గుర్తు చేశారు. అర్హులు ఎవరైనా మిగిలిపోతే వారిని గుర్తించి మళ్లీ తర్వాత వారందరికీ పథకాలు వర్తింపజేస్తున్నామని అన్నారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు వసూళ్లకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఏ పథకం రావాలన్నా ఆ కమిటీలకు లంచం ఇవ్వాల్సిన దుస్థితి ఉండేదని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని.. మధ్యవర్తులు లేకుండా లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని గుర్తు చేశారు.

ఒకవేళ కొన్ని మీడియా సంస్థలు ఆరోపించినట్లు తప్పులు జరిగితే సరిదిద్దుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి తప్పు లేకపోతే ప్రెస్‌మీట్‌ పెట్టి ఆ మీడియా సంస్థలను తిట్టడానికి కూడా వెనుకాడొద్దని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించడం విశేషం.

కాగా వివిధ కారణాలతో పథకాలు అందక మిగిలిన పోయిన 2,79,065 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.590.91 కోట్లను వర్చువల్‌ పద్ధతిలో సీఎం జగన్‌ జమ చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.