Begin typing your search above and press return to search.

మరోసారి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   30 Dec 2022 9:30 AM GMT
మరోసారి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు!
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. జనసేన, టీడీపీ అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సీపట్నంలో పర్యటించిన వైఎస్‌ జగన్‌ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పవన్, చంద్రబాబులపై తీవ్ర విమర్శలు చేశారు.

చంద్రబాబు పాలనలో ప్రజలకు ఒక్క మంచి పనైనా జరిగిందా? అని ప్రశ్నించారు. దత్త తండ్రిని దత్తపుత్రుడు (పవన్‌) నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారని పవన్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి ఈ రాష్ట్రం కాకుంటే.. మరో రాష్ట్రం.. ఈ ప్రజలు కాకుంటే.. మరో ప్రజలు.. ఈ భార్య కాకుంటే మరో భార్య అన్నదే వారి తీరని ఎద్దేవా చేశారు. తద్వారా మరోసారి పవన్‌ కల్యాణ్‌ పెళ్లిళ్ల వ్యవహారాన్ని జగన్‌ ఎత్తారు.

రాష్ట్రంలో ఏ మంచి జరిగినా తనవల్లేనని చంద్రబాబు చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. సింధుకు బ్యాడ్మింటన్‌ కూడా తానే నేర్పానని చంద్రబాబు చెప్పుకుంటారని అవహేళన చేశారు. కుప్పంలో చంద్రబాబు రెవెన్యూ డివిజన్‌ కూడా పెట్టలేకపోయారని గుర్తు చేశారు.

చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేవి వెన్నుపోటు, మోసాలు మాత్రమేనని తీవ్ర విమర్శలు చేశారు. అన్ని వర్గాలను మోసం చేసిన బాబును ప్రజలు ఎందుకు నమ్ముతారు అని సీఎం జగన్‌ ప్రశ్నించారు.

నర్సీపట్నాన్ని గత పాలకులు పట్టించుకోలేదని జగన్‌ అన్నారు. నర్సీపట్నం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నర్సీపట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. ఈ ప్రాంతం రూపురేఖలను తాము మార్చబోతున్నామన్నారు. ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటామని అన్నారు. తాము చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తామని జగన్‌ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో తాము యుద్ధం చేస్తున్నామని జగన్‌ చెప్పారు. ఎల్లో మీడియా నిత్యం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుందన్నారు. మంచి చేస్తున్నా.. వారికి చెడే కనిపిస్తుందని చెప్పారు. దుష్టచతుష్టయం అంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, పవన్‌ అని మండిపడ్డారు. అవ్వాతాతలకు మంచి చేస్తుంటే దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోందని నిప్పులు చెరిగారు. పెన్షన్లపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

తన పాలనలో ప్రతి వర్గాన్ని కూడా వంచించిన బాబు సభకు జనం ఎందుకొస్తారు? అని జగన్‌ ప్రశ్నించారు. రుణాలు మాఫీ చేస్తానని మోసం చేసినందుకా.. జనం వచ్చేది అని నిలదీశారు. లేదా రుణాలు పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేసినందుకు బాబు సభలకు ప్రజలు వస్తారా అని జగన్‌ ప్రశ్నించారు.

మన రాష్ట్రానికి రావాల్సిన హోదాను ప్యాకేజీ కోసం చంద్రబాబు తాకట్టుపెట్టినందుకు చంద్రబాబు సభలకు జనం రావాలా అన్నారు. ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేసినందుకు ఆయన సభలకు రావాలని అని నిలదీశారు. ఇలా అందరినీ మోసం చేశాక.. చంద్రబాబు సభకు ఎవరైనా వస్తారా? అని ప్రశ్నించారు. బాబు సభకు జనాన్ని తీసుకురావడానికి నానా కష్టాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాపంలో దత్తపుత్రుడు పవన్‌కు కూడా వాటా ఉందని సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఫోటో షూట్, డ్రోన్‌ షాట్స్‌ కోసం జనం రాకపోయినా జనం బాగా వచ్చారని చూపించేందుకు చంద్రబాబు ప్రయత్నించారని జగన్‌ ఆరోపించారు. కందుకూరులో ఇరుకు రోడ్డులోకి జనాన్ని నెట్టి 8 మందిని చంపేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో కూడా చంద్రబాబు తన షూటింగ్‌ కోసం 29 మందిని బలిగొన్నారని గుర్తు చేశారు. రాజకీయాలు అంటే షూటింగ్‌లు కాదన్నారు. రాజకీయం అంటే డైలాగులు కూడా కాదని చెప్పారు, డ్రోన్‌ షాట్‌లు, డ్రామాలు కాదని.. రాజకీయం అంటే రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, నిరుపేద, మధ్య తరగతి కుటుంబంలో మార్పులు తీసుకురావడమేనని జగన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

రాజకీయ నాయకుడంటే ప్రజలకు సేవకుడని జగన్‌ చెప్పారు. చంద్రబాబు మాదిరి ప్రజలపై అధికారం చెలాయించడం కాదన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. అలాగే ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్న వ్యక్తి కూడా చంద్రబాబేనన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.