Begin typing your search above and press return to search.

ఆధారాలివిగో..బాబుది 420 దీక్ష కాదా?

By:  Tupaki Desk   |   17 April 2018 4:58 PM GMT
ఆధారాలివిగో..బాబుది 420 దీక్ష కాదా?
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడుకు త‌న రాజ‌కీయ అవ‌స‌రాలు త‌ప్పించి న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్‌ పై చిత్త‌శుద్ధి లేద‌ని వైసీపీ అధినేత - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఆరోపించారు. దీక్ష పేరుతో చంద్ర‌బాబు చేస్తున్న‌ది రాజ‌కీయ హ‌డావుడి మాత్ర‌మేన‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ప్రజా సంకల్ప యాత్ర 138వ రోజు కృష్ణా జిల్లా మైలవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జ‌గ‌న్ ప్రసంగించారు.తన పుట్టిన రోజు ఏప్రిల్‌ 20న ఒక రోజు దీక్ష చేస్తారట..ఆయనది ఫోర్‌ ట్వంటీ దీక్ష కాదా అని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఢిల్లీలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసిన రోజున చంద్రబాబు కూడా తన ఎంపీలతో రాజీనామా చేయించి దీక్షలో కూర్చోబెడితే దేశం మొత్తం చర్చ జరిగేదన్నారు. కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేదన్నారు. కానీ ఆ రోజు చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలు చేయించలేదన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఏప్రిల్‌ 20న బాబు కొంగ జపం చేస్తారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు.

ప్ర‌త్యేక హోదాను చంద్రబాబే నీరుగార్చారని, వేరొకరు సీఎంగా ఉండి ఉంటే హోదా నడుచుకుంటూ వచ్చేదని వైఎస్ జ‌గ‌న్‌ అన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తిని రాష్ట్రం నుంచి తరిమికొట్టి.. రాజకీయాల్లోకి నిజాయితీ, విశ్వసనీయతను తీసుకురావాలని ఆయ‌న కోరారు. `ఈ పెద్ద మనిషి ఏప్రిల్‌ 20న పుట్టిన రోజుట. అంటే ఫోర్‌ ట్వంటీ. ఆయన పుట్టిన రోజు నిరాహార దీక్ష చేస్తారట. అయ్య చంద్రబాబు ఆ రోజు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. ఆ రోజు నీవు కూడా, నీ ఎంపీలు కూడా రాజీనామా చేసి నిరాహార దీక్ష చేసి ఉంటే దేశం మొత్తం దీని గురించి చర్చించి ఉండేది కాదా అని చంద్రబాబును అడగండి. ఆ రోజు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి నిరాహార దీక్ష కూర్చుంటే చంద్రబాబు వారి ఎంపీలతో రాజీనామా చేయించి దీక్ష చేయించలేదు. అలాంటి 420 వ్యక్తి పుట్టిన తేదీ రోజు దీక్ష చేస్తారట. ఆ దీక్ష ఫోర్‌ ట్వంటీ దీక్ష కాదా? ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కావడమే మనం చేసుకున్న ఖర్మ. ఇటువంటి అన్యాయమైన పాలన పోవాలి` అని జ‌గ‌న్ అన్నారు.

మైలవరం ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమా ల‌క్ష్యంగా జ‌గ‌న్ వినూత్న రీతిలో విమ‌ర్శ‌లు చేశారు. ` ఈనియోజకవర్గంలోకి రాగానే నాతో ప్రజలు అన్నమాట ఏంటో తెలుసా? అన్నా..అన్యాయపు రాజుగారి దర్భార్‌లో ఈయన ఓ అవినీతి మంత్రి ఉన్నారు. చంద్రబాబు మూడుపులు ఎంత రావాలో నిర్ణయిస్తే వాటిని మూటకట్టి చేరవేసి..అందులో వాటాలు పంచుకునే వారిలో ఈ మంత్రి ఒక్కరూ అని చెబుతున్నారు. పట్టిసీమ, పోలవరం, రాజధాని భూములు, ఇసుక మాఫియా వరకు ఆ రాజు, ఈ మంత్రి దోపిడీ టీడీపీ పాలనలో మనం చూస్తున్నాం` అని జ‌గ‌న్ అన్నారు.
`ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి చంద్రబాబు సమక్షంలో జారీ చేసిన జీవో ఏంటో తెలుసా..22, 63..ఈ జీవో ఎంటో తెలుసా ? ఈపీసీ విధానంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఎస్కలేషన్‌కు తావులేకపోయినా చంద్రబాబు అధికారంలోకి రాకముందే ఎస్క‌లేషన్‌ పేరుతో లంచాలు పంచుకుంటున్నారు. ఇవాళ వీళ్లు చేసిన దోపిడీని కాగ్‌ తేల్చింది. నా కేంటి సిగ్గు అన్నట్లుగా మంత్రి, చంద్రబాబు ఇద్దరూ కూడా ఉన్నారు. వీరు చేసిన అవినీతితో ఏం చేయాలో దిక్కు తోచక మన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు.వారితో రాజీనామా చేయించి గెలిపించుకునే సత్తా వీరికి లేదు` అంటూ అధికార పార్టీని ఎమోష‌నల్‌గా టార్గెట్ చేశారు వైఎస్ జ‌గ‌న్‌.

పురాణాలు చదివేటప్పుడు చాలామంది రాక్షసులు, భకాసుడు, రావనాసుడి పేర్లు విన్నామ‌ని ఇక్కడ ఇసుకాసురులు ఉన్నారని జ‌గ‌న్ ఆరోపించారు. ` ఈ ఇసుకాసురుల‌కు చంద్రబాబు బాస్‌. చంద్రబాబు తాను ఉంటున్న ఇల్లు కృష్ణ నది ఒడ్డున అక్రమ కట్టడాల్లో సిగ్గులేకుండా ఉంటున్నారు. ఈ పెద్ద మనిషి ఇంటి పక్కనే, కళ్ల ఎదుటనే ఇసుక ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. ఉండవల్లి నుంచి వెంకటాయపాలెం, రాయపూడి, అప్పరాజుపాలెం తదితర గ్రామాల్లో చంద్రబాబు కళ్లముందే వేలాది లారీలతో ఇసుకను దోచుకుంటున్నారు. కృష్ణా నది ఇవతల కూడా మంత్రి ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు చేపట్టి అవినీతికి పాల్పడుతున్నారు. లక్షల టన్నుల ఇసుకను తరలిస్తున్నా ముఖ్యమంత్రి ఏమీ పట్టించుకోవడం లేదు.దీని అర్థం విఫరీతంగా అవినీతి ఏస్థాయిలోకి వెళ్లిందో అర్థమవుతుంది. చిన్నబాబు నుంచి మొదలైతే పెద్దబాబు దాకా అవినీతిమయమైంది. అందుకే అవినీతి పాల‌న పోవాలి. ప్ర‌జా సంక్షేమ పాల‌న రావాలి` అని జ‌గ‌న్ అన్నారు. కృష్ణా జిల్లాను తీవ్రంగా కుదిపేసిన పుష్క‌రాల‌ను సైతం ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. `ఇదే జిల్లాలో నాతో ప‌లువురు త‌మ ఆవేద‌న పంచుకున్నారు. అన్నా..ఎన్నో పుష్కరాలు చూశామన్నా..కృష్ణా నది పుష్కరాలు అని చెప్పి రూ.1400 కోట్లు దోచేశారని చెబుతున్నారు. నీళ్ల పొట్లాలు, మజ్జిగ ప్యాకెట్లు, స్నానఘట్టాల్లో కూడా అవినీతి ఉంది. – ఇదే కృష్ణానదిలో లైసెన్స్‌ లేకుండా బోట్లు తిప్పుతున్నారు. ఆ బోట్లు తిప్పినందుకు కోట్లలో కమీషన్లు మంత్రులు, చంద్రబాబు పంచుకుంటున్నారు. లైసెన్స్‌ లేని బోట్లలో తీసుకెళ్తు 23 మంది అమాయకులు చనిపోయారు. మంత్రిని భర్తరఫ్‌ చేయకుండా చంద్రబాబు సిగ్గులేకుండా పాలిస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో వందకు పైగా కంకర క్వారీలు నిర్వహిస్తున్నారు. ఇంత చేస్తున్నా ఈ ప్రభుత్వం ఏమీ మాట్లాడటం లేదు. చంద్రబాబు అవినీతి పాలన ఏ స్థాయిలో ఉంది అంటే..రాజధాని భూముల స్కాం మనందరం చూశాం. ఫలాని ప్రాంతంలో రాజధాని వస్తుందని చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఇదే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, ఆయన బినామీలు తుళ్లూరు ప్రాంతంలో భూములు కొని, ఆ తరువాత తీరిగ్గా రాజధాని ఇక్కడ కాదు అక్కడ అని ప్రకటిస్తారు. కారు చౌకగా భూములు కొని చంద్రబాబు రైతులను మోసం చేశారు. ఈయన చేసిన ఇన్‌ సైడర్‌ ట్రెడింగ్‌ కు పాల్పడింది వాస్తవం కాదా?. రాజధానిలో జోనింగ్‌ విధానం అంటూ తానూ, తన బినామీల భూములు పోకుండా జోనింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన రైతులు వ్యవసాయ జోన్లలో వాళ్ల భూçములు ఉన్నాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.` అంటూ జ‌గ‌న్ కీల‌క అంశాల‌పై కృష్ణా జిల్లా వాసులు పున‌రాలోచ‌న చేసుకునే అంశాల‌ను ప్ర‌స్తావించారు.