Begin typing your search above and press return to search.

బాబు రికార్డుల గుట్టు విప్పిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   2 May 2017 5:06 PM GMT
బాబు రికార్డుల గుట్టు విప్పిన జ‌గ‌న్‌
X
బుల్లెట్టు అప్పుడ‌ప్పుడు గురి త‌ప్పొచ్చు. కానీ.. మిర్చి ఘాటు నుంచి త‌ప్పించుకోవ‌టం సాధ్యం కాదు. తాజాగా ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాట‌ల్ని చూస్తే.. ఇదే విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఏపీలోని రైతుల దుస్థితిపై రెండు రోజుల‌ రైతు దీక్ష‌ను నిర్వ‌హించిన జ‌గ‌న్‌.. త‌న దీక్ష‌ను విర‌మిస్తూ.. ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట‌లు మిర్చి మంట‌ని త‌ల‌పించేలా చేసి.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అండ్ కోకు దిమ్మ తిరిగిపోయేంత మంట పుట్టించాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. చంద్ర‌బాబు గొప్ప‌ల్ని.. ఆయ‌న మాట‌ల్లో తిప్పి కొట్టిన జ‌గ‌న్ వ్యాఖ్య‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా ఉండ‌ట‌మే కాదు.. బాబు పైకి స‌రికొత్త వ్యంగ్యాస్త్రాల‌కు కొత్త ఐడియాలుగా మార‌తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

వ‌రి నుంచి ఉల్లి వ‌ర‌కూ ఏ పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర దొర‌క్క రైతులు ప‌డుతున్న ఇబ్బందుల్ని క‌ళ్ల‌కుక‌ట్టేలా చెప్ప‌ట‌మే కాదు.. ఏపీలో మిర్చి రైతులు ప‌డుతున్న అవ‌స్థ‌ల్ని ఆయ‌న చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ ప్ర‌సంగాన్ని ఆయ‌న మాటల్లోనే చూస్తే..
త‌న రికార్డుల్ని తాను బ‌ద్ధ‌లు కొట్టుకుంటాన‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గొప్ప‌గా చెప్పుకుంటుంటారు. త‌న పాల‌న‌లో రైతుల్ని మోసం చేయ‌టంలో.. వ‌రుస క‌ర‌వుల‌తో రైతుల్ని అల్లాడించ‌టంలో ఆయ‌న త‌న రికార్డుల్ని తానే బ‌ద్ధ‌లు కొట్టుకుంటారు. వ‌రి నుంచి ఉల్లి వ‌ర‌కూ ఏ పంట‌కు మ‌ద్ద‌తు ధ‌రను లేకుండా చేయ‌టంలో బాబు స‌ర్కారు స‌రికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. అస‌లు రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా? లేదా? అన్న సందేహం క‌లిగేలా ప‌రిస్థితి ఉంది. రైతుల ప‌ట్ల ఏపీ స‌ర్కారు దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా రూ.3వేల కోట్ల‌తో స్థిరీక‌ర‌ణ నిధి పెడ‌తాన‌ని చెప్ప‌గానే.. రూ.5వేల కోట్ల‌తో స్థిరీక‌ర‌ణ నిధిని ఏర్పాటు చేస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు రైతుల్ని వెన్నుపోటు పొడిచారు. గ‌డిచిన మూడేళ్ల‌లో ఒక్క ద‌మ్మిడీ కూడా పెట్ట‌లేదు. బ్యాంకుల్లో బంగారం మొద‌లు.. రుణ‌మాఫీ వ‌ర‌కూ అనేక హామీలు ఇచ్చిన బాబు.. రైతుల్ని దారుణంగా మోసం చేశారు.

రైతులు తీవ్ర క‌ష్టాల్లో ఉన్న‌ప్ప‌టికీ అండ‌గా నిల‌వాల్సింది పోయి.. వారిని దారుణంగా మోసం చేశారు. జీఎస్టీ బిల్లు కోసం అసెంబ్లీ స‌మావేశాల్ని పెడ‌తాన‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. కానీ.. ఆ లోపు కానీ రైతుల‌కు మంచి చేయ‌క‌పోతే.. అసెంబ్లీని నువ్వు న‌డుపుకోలేవు. చంద్ర‌బాబులో క‌ద‌లిక రాకుంటే.. పోరాటాన్ని మ‌రింత తీవ్ర‌త‌రం చేస్తామ‌ని.. రైతుల క‌ళ్ల‌ల్లో క‌న్నీరు క‌నిపిస్తే ఏ ప్ర‌భుత్వం కూడా పుట్ట‌గ‌తులు లేకుండా పోవ‌టం ఖాయం.

రైతుల క‌ష్టాలుతెలీకూడ‌ద‌ని.. రైతులు ప‌డుతున్న క‌ష్టాల్ని ఎక్క‌డ తెలుస్తాయ‌న్న ఉద్దేశంతో మిర్చియార్డుకు ప్రభుత్వం ఈ రోజు సెలవు ఇచ్చింది. రైతుల‌కేం చేయ‌కున్నా వాళ్లు ప‌డి ఉంటార‌ని బాబు స‌ర్కారు దిక్కుమాలిన ఆలోచ‌న‌లు చేస్తోంది.బాబు పాల‌న‌లో మూడేళ్లుగా రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు రావ‌టం లేదు. ఇదే మిర్చి యార్డుకు ఐదు వారాల కింద‌ట వ‌చ్చా. ఆ రోజు క్వింటాలు మిర్చి రూ.ఆరేడు వేలు ప‌లుకుతుంది. ఈ రోజు.. రూ.రెండు వేల నుంచి రూ.నాలుగు వేల మ‌ధ్యే ప‌లుకుతోంది. రైతుల ప‌ట్ల ప్ర‌భుత్వం ఎంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తుందో చెప్ప‌టానికిదే నిద‌ర్శ‌నం. బాబు త‌న రికార్డుల్ని తానే బ‌ద్ధ‌లు కొట్టుకుంటాన‌ని చెబుతుంటారు. నిజ‌మే ఆయ‌న సీఎం అయ్యే నాటికి రాష్ట్రంలోసాగునీటి విస్తీర్ణం 43 ల‌క్ష‌ల హెక్టార్లు ఉంటే.. 2016-17 నాటికి అది 37 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయింది. బాబు సీఎం అయిన నాటి నుంచి ప్ర‌తి ఏటా సాగు విస్తీర్ణం త‌గ్గుతోంది. ఇలాంటి గొప్ప రికార్డులు బాబుకు మాత్ర‌మే సాధ్యం.

బాబు ప‌వ‌ర్‌లోకి రాగానే బ్యాంకులు తాము ఇవ్వాల‌నుక‌న్న రుణాల కంటే త‌క్కువ‌గా ఇస్తున్నాయి. 2014-15లో బ్యాంకుల రుణాల ల‌క్ష్యం రూ.56వేల కోట్లు అయితే.. ఇచ్చింది మాత్రం రూ.39వేల కోట్లే. గ‌త ఏడాది బ్యాంకుల ల‌క్ష్యం రూ.83వేల కోట్లు అయితే.. బ్యాంకులు ఇచ్చింది మాత్రం రూ.39వేల కోట్లే. ఇలాంటి రికార్డులు బాబు మాత్ర‌మే బ‌ద్ధ‌లు కొట్ట‌గ‌ల‌రు.

బాబు సీఎం కాగానే క‌రువు ఆయ‌న వెంటే వ‌చ్చింది. వ‌రుస‌గా మూడేళ్లు క‌రువే క‌రువు. నిజ‌మే.. ఆయ‌న రికార్డును ఆయ‌న మాత్ర‌మే బ‌ద్ద‌లు కొడ‌తారు. గ‌తంలో తొమ్మిదేళ్లు ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు రైతుల మ‌ద్ద‌తు ధ‌ర‌ను రూ.170 పెంచితే.. దివంగ‌త మ‌హా నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న ఐదేళ్ల హ‌యాంలో మ‌ద్ద‌తు ధ‌ర‌ను రూ.500 నుంచి రూ.1031కి తీసుకెల్లారు. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రైతుల‌కు న్యాయం జ‌రిగేలా చేశారు. బాబు హ‌యాంలో ముష్టి వేసిన‌ట్లు నాలుగు శాతం కూడా మ‌ద్ద‌తు ధ‌ర పెర‌గ‌లేదు. క్వింటాలు మిర్చిని రూ.8వేల‌కు కొంటాన‌ని గ‌తంలో ప్ర‌భుత్వం చెప్పింది. కానీ.. త‌న హామీని నిల‌బెట్టుకోలేదు. ఇప్పుడు క్వింటాలు ధ‌ర రూ.2 వేల నుంచి రూ.4వేల వ‌ర‌కూ ఉంది. రైతుల్ని క‌ష్టాల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోని ఇంత సిగ్గుమాలిన ప్ర‌భుత్వం ఉంటుందా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/