Begin typing your search above and press return to search.

అలా నోరు జారకూడదు జగన్

By:  Tupaki Desk   |   15 March 2016 5:10 AM GMT
అలా నోరు జారకూడదు జగన్
X
కీలక సమయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కానీ.. ఆ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ కు ఆ అలవాటు ఉన్నట్లు అస్సలు కనిపించదు. ఆగ్రహం వస్తే వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేసే జగన్.. తొందరపాటుతో జారిన ఒక మాట ఆయన్ను అడ్డంగా బుక్ అయ్యేలా చేసింది. భావోద్వేగాలకు లోనైన సమయంలో మాట స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే.. అలాంటి మాట చెప్పి హుందాగా విషయాన్ని తేల్చేస్తే పోయే దానికి.. తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరించిన జగన్.. అడ్డంగా బుక్ అయ్యారనే చెప్పాలి.

ఏపీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టిన వైఎస్ జగన్ పార్టీ.. ఆ తీర్మానంపై చర్చ సందర్భంగా అంతా తానై వ్యవహరించారు. చర్చలో భాగంగా ఏపీ అధికారపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును దునుమాడే క్రమంలో నోరు జారి..చంద్రబాబు తన పలుకుబడితో కోర్టుల్లో కేసులు కొట్టివేయించుకున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్య అధికారపక్షానికి అస్త్రంగా మారింది. న్యాయవ్యవస్థను కించిపరిచినందుకు భేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ ఏపీ అధికారపక్షం డిమాండ్ చేసింది.

ఇలాంటి సమయాల్లో విపక్షాన్ని మరింత ఇరుక్కుపోయేలా చేసే మాటల చాతుర్యం ఉన్న మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. జగన్ ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసా అంటూ వివరించిన వైనంతో.. విపక్ష నేతల నోట మాట రాని పరిస్థితి. ఇదిలా ఉండగా.. తాను వ్యవస్థ ను మేనేజ్ చేశానని అనలేదని.. వ్యవస్థలు అని అన్నానంటూ జగన్ చెప్పటం.. దానికి ప్రతిగా మాట్లాడిన యనమల.. జగన్ మాట్లాడిన మాట.. రికార్డుల్లో ఉన్న..‘‘బాబు తన పలుకుబడితో కోర్టులో కేసులు కొట్టి వేయించుకున్నారు’’ అంటూ చేసిన మాటను యనమల బలంగా ప్రస్తావించటంతో జగన్ డిఫెన్స్ లో పడిపోయిన పరిస్థితి.

ఇదే సమయంలో.. జగన్ కావాలని అని ఉండరని.. ఫ్లో లో టంగ్ స్లిప్ అయి ఉంటుందన్న మాటను ఒకరిద్దరు నేతలు ప్రస్తావించినా.. జగన్ తాను అన్న మాటల్ని సరి చేసుకునేందుకు ప్రయత్నించలేదు. ఇదే సందర్భంలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. జగన్ కొవ్వెక్కి న్యాయవ్యవస్థ మీద ఆరోపణలు చేశారంటూ వ్యాఖ్యానించటం సభను మరింత వేడెక్కేలా చేసింది. అయితే.. తానుఅన్న మాటను అచ్చెన్నాయుడు వెనువెంటనే వెనక్కి తీసుకొని.. తప్పు మాట్లాడితే సర్దుబాటు చేసుకోవాలన్న వైనాన్ని చూపించినా జగన్ మాత్రం ససేమిరా అనటం గమనార్హం.

ఇలా జగన్ తన మొండితనంతో న్యాయవ్యవస్థ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిగా నిలిచారు. కొన్ని విషయాల్లో నోరు జారకూడదు. ఒకవేళ ఒత్తిడితో జారినా.. దాన్ని వెంటనే సరి చేసుకోవటానికి భేషజాలకు పోకూడదు. కానీ.. మొండితనం మూర్తీభవించిన జగన్.. తాను నోరు జారిన విషయం అందరికి అర్థమైనా.. దాన్ని సరి చేసుకోవటానికి ఏమాత్రం సిద్ధంగా లేకపోవటం చూసినప్పుడు.. జగన్ మొండితనం ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి అర్థమైన పరిస్థితి. ప్రయోజనం లేని మొండితనంతో లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయం జగన్ కు ఎప్పటికి అర్థమవుతుందో..?