Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల కామెంట్ల‌పై జ‌గ‌న్ కౌంట‌ర్‌.. ఫుల్ ఫైర్‌

By:  Tupaki Desk   |   20 Oct 2022 9:56 AM GMT
ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల కామెంట్ల‌పై జ‌గ‌న్ కౌంట‌ర్‌.. ఫుల్ ఫైర్‌
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న‌ను విమ‌ర్శిస్తున్న వైసీపీ నాయ‌కుల‌పై ఇటీవ‌ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. చెప్పులు చూపించిన విష‌యం తెలిసిందే. ఇదేస‌మ‌యంలో ప్యాకేజీ అంటే.. బాగుండ‌ద‌ని.. హెచ్చ‌రించారు. మ‌రీ ముఖ్యంగా తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాన‌ని.. వైసీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నార‌ని.. వారు కూడా.. విడాకులు ఇచ్చి ఎన్న‌యినా.. చేసుకోవాల‌ని.. అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై సీఎం జ‌గ‌న్ నేరుగా స్పందించారు. తాజాగా ఆయ‌న ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు.

''మూడు పెళ్లిళ్లు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు. ఎంతో కొంత ఇచ్చి వ‌దిలించుకుని.. మ‌రొక‌రిని పెళ్లిచేసుకోవాల‌ని అంటున్నారు. ఇలా అయితే.. స‌మాజం ఏమ‌వుతుంది..? మ‌హిళ‌ల ఆత్మాభిమానం ఏమ‌వుతుంది?'' అని ప్ర‌శ్నించారు. గత పాలకులు తాము చేసిన మంచేంటో చెప్పలేని పరిస్థితికి చేరుకున్నారని.. పేదవాడి బాగోగులు పట్టించుకునే ప్రభుత్వం తమదని సీఎం జగన్‌ మరోసారి ఉద్ఘాటించారు. ఎన్టీఆర్‌ జిల్లా అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో జరిగిన రైతుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

పనిలో పనిగా ప‌వ‌న్‌ వ్యాఖ్యలకు సీఎం జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ''వెన్నుపోటుదారులంతా ఎవరికీ మంచి చేయలేదు. పైగా ఎన్నికల తర్వాత వాళ్లు వాగ్దానాలు మరిచిపోతారు. కానీ, మన ప్రభుత్వం అలా కాదు. మేనిఫెస్టోలో ఇచ్చిన దాదాపు అన్ని హామీలు నెరవేర్చాం. పైగా మనం ఎవరికీ అన్యాయం చేయలేదు. మూడు రాజధానుల వల్ల మంచి జరుగుతోందని చెప్తున్నాం. కానీ, కొందరు చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. బూతులు తిట్టడంలో వీధి రౌడీలను మించిపోయారు'' అని వ్యాఖ్యానించారు.

''దత్త పుత్రుడితో ఏం మాట్లాడిస్తున్నారో మనమంతా చూస్తున్నాం. మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని చెబితే.. కాదు మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని కొందరు అంటున్నారు. నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్లు టీవీల్లో ఇలాంటి సందేశాలతో ఏం చెప్పాలనుకుంటున్నారు. వాళ్లు అలా మాట్లాడడం మొదలుపెడితే.. మన ఆడవాళ్ల మానప్రాణాలు, అక్కాచెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి?. ఇలాంటివాళ్లా మన నాయకులు? ఇలాంటి నాయకులు మనకు దిశ దశ చూపగలారా?.. ఒక్కసారి ఆలోచించండి'' అని ప్రజలకు పిలుపు ఇచ్చారు సీఎం జగన్‌.

ఇటువంటి దుష్టచతుష్టయం కూటమిగా ఏర్పడి.. మీ బిడ్డ మీద( సీఎం జగన్‌), ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారట.. ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంత మంది ఏకం కావడం ఆశ్చర్యంగా అనిపిస్తుందని సీఎం జగన్‌ అన్నారు. కుతంత్రాలను, కుళ్లును, మీడియాను, దత్తపుత్రుడిని వాళ్లు నమ్ముకుంటే.. కానీ, తాను మాత్రం ప్రతీ అవ్వాతాతా, అక్కాచెల్లి, అన్నదమ్ములని నమ్ముకున్నానని సీఎం జగన్‌ తెలిపారు. ఇది మంచికి.. మోసానికి జరుగుతున్న యుద్ధమని.. పేదవాడికి.. పెత్తందారుడికి మధ్య జరుగుతున్న యుద్ధమని. సామాజిక న్యాయానికి.. సమాజాన్ని ముక్కలు చెక్కలు చేయాలనుకుంటున్న వాళ్లకు మధ్య జరుగుతన్న యుద్ధమని.. అన్నారు.

ఇలాంటి యుద్ధంలో కుట్రలు, కుతంత్రాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కనిపిస్తాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ మోసాలను నమ్మొద్దు.. ఈ యెల్లో మీడియాను పట్టించుకోవద్దు.. మంచిని మాత్రమే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగింది అంటే.. జగనన్నకు తోడు నిలవండి. ఈ బిడ్డకు మీ గుండెలో చోటు ఇవ్వండి అని ఆకాంక్షించారు సీఎం జగన్‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.