Begin typing your search above and press return to search.

ఉద్యోగాలపై జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   27 Jan 2018 4:52 AM GMT
ఉద్యోగాలపై జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు
X
బాబు వ‌స్తే జాబు అంటూ సార్వ‌త్రిక ఎన్నిక‌ల సమ‌యంలో టీడీపీ అధినేత హోదాలో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల్ని మ‌ర్చిపోలేం. త‌మ్ముళ్లు.. బాబు వ‌స్తే జాబు గ్యారెంటీ అంటున్నారంటూ చెప్పిన మాట‌లు.. గ‌డిచిన మూడున్న‌రేళ్ల బాబుపాల‌న‌లో ఎంత నిజ‌మో తెలిసిందే. ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏళ్లు గ‌డుస్తున్నా.. ఉద్యోగాల విష‌యంలో ఏపీ స‌ర్కారు ఎంతో వెనుక‌బ‌డి ఉంది. ఏపీ అభివృద్ధిని దౌడు తీసేందుకు ఏం చేయాలి.. ఏపీలో ఉద్యోగాల విప్ల‌వం ఎలా సాధ్య‌మ‌వుతుంద‌న్న కీల‌క అంశాల‌పై ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

జ‌గ‌న్ స్పీక్స్ పేరుతో ఫేస్ బుక్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఏపీ రూపురేఖ‌లు ఎలా మార్చాలి? ఉద్యోగ సృష్టి ఎలా సాధ్య‌మ‌న్న అంశంపై ఆయ‌న చెబుతున్న మాట‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఉద్యోగాల విప్ల‌వాన్ని సృష్టించాల‌న్న ఆలోచ‌న‌లో తాను ఉన్న విష‌యాన్ని వెల్ల‌డించారు.

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇప్ప‌టివ‌ర‌కూ 22 సార్లు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లార‌ని.. ప్ర‌తిసారి తాను ప‌రిశ్ర‌మ‌లు.. ఉద్యోగాల్ని తీసుకురావ‌టం కోస‌మే ఫారిన్ టూర్లు చేస్తున్న‌ట్లు చెబుతున్నార‌ని చెప్పారు. ప్ర‌తి ఏడాది దావోస్‌కు వెళ్లే చంద్ర‌బాబు .. పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌టాని కాద‌ని.. తాను పోగేసిన న‌ల్ల‌ధ‌నాన్ని దాచుకోవ‌టానికేన‌న్నారు.

ఇన్నిసార్లు విదేశీ ప‌ర్య‌ట‌న చేసిన చంద్ర‌బాబు కార‌ణంగా.. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు వ‌చ్చాయో చెప్పాలంటూ జ‌గ‌న్ సూటిగా ప్ర‌శ్నించారు. బాబు నోరు తెరిస్తే అబ‌ద్ధాలేన‌న్న జ‌గ‌న్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిశ్ర‌మ‌లు రావాలంటూ చంద్ర‌బాబు మొహం చూసో.. జ‌గ‌న్ ముఖం చూసో పారిశ్రామిక‌వేత్త‌లు రార‌ని.. రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌లు.. హోట‌ళ్లు.. ఆసుప‌త్రులు పెట్టేందుకు అనువుగా ప‌రిస్థితులు ఉన్నాయా? లేదా? అన్న‌ది మాత్ర‌మే చూస్తార‌న్నారు.

ఏపీలో అలాంటి అనువైన ప‌రిస్థితులు ఉన్నాయా? అని ప్ర‌శ్నించిన జ‌గ‌న్‌.. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టే స‌మ‌యంలో బెంగ‌ళూరు.. చెన్నై.. హైద‌రాబాద్‌లో ఉన్న అనువైన ప‌రిస్థితుల్ని బేరీజు వేసుకుంటార‌న్నారు. ఆ న‌గ‌రాల్లో 60 ఏళ్లుగా మౌలిక స‌దుపాయాలు విప‌రీతంగా అభివృద్ధి చెందాయ‌ని.. అనువైన ప‌రిస్థితులు ఉన్నాయ‌న్నారు. ఇలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో ఏపీకి ప‌రిశ్ర‌మ‌లు రావాలంటే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఉంటేనే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ట్రాల‌కు ఆదాయ‌ప‌న్ను.. జీఎస్టీ మిన‌హాయింపులు ల‌భిస్తాయ‌ని గుర్తు చేశారు.

ఏపీలో ఎవ‌రైనా పెట్టుబడుల‌తో రావాలంటే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తేనే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ట్రాల‌కు ఆదాయ‌ప‌న్ను.. జీఎస్టీ మిన‌హాయింపులు ల‌భిస్తాయ‌ని.. ఐదేళ్ల పాటు ఆదాయ‌ప‌న్ను.. జీఎస్టీలో మిన‌హాయింపులు ఉంటే.. ఎవ‌రైనా వ‌చ్చి.. ఆ రాష్ట్రాల్లో పెట్టుబ‌డులు పెడ‌తార‌న్నారు.

ఫారిన్ టూర్లు వెళ్లేందుకు చంద్ర‌బాబు ప్ర‌ద‌ర్శించే శ్ర‌ద్ధ.. ప్ర‌త్యేక హోదా మీద పెడితే బాగుంటుంద‌న్నారు. ఇప్ప‌టికి 22 సార్లు విదేశీ టూర్ల‌కు వెళ్‌లిన చంద్ర‌బాబు ప్ర‌త్యేక విమానాల్లో మందీ మార్బ‌లంతో వెళ్లి రూ.250 కోట్ల ప్ర‌జాధ‌నాన్ని నీటిపాలు చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు.

ఫారిన్ టూర్ల‌కు వెళ్లే దాన్లో కొంత స‌మ‌యాన్ని అయినా ప్ర‌ధాని మోడీ వ‌ద్ద‌కు వెళ్లి.. హోదా కోసం ఒత్తిడి పెడితే ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌న్నారు. ప్ర‌ధాని మోడీని చంద్ర‌బాబు అస్స‌లు క‌ల‌వ‌ర‌ని.. మోడీకి రాసిన లేఖ‌లో కానీ అంత‌కు ముందు పార్టీ ఎంపీలు రాసిన లేఖ‌ల్లోనూ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌నే అంశంపై ఒక్క వ్యాక్యం కూడా ప్ర‌స్తావించ‌లేద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌చ్చి ఉంటే బాబు విదేశాల‌కు వెళ్లాల్సిన ప‌నే ఉండేది కాద‌న్నారు. విదేశాల్లో ఉన్న ప‌రిశ్ర‌మ‌లే రాష్ట్రానికి వ‌చ్చి ఉండేవ‌న్నారు.

హోదా వ‌చ్చి ఉంటే.. బాబు స‌చివాల‌యంలో ఉంటే.. విదేశీ సంస్థ‌ల ప్ర‌తినిధులు ప‌రిశ్ర‌మ‌లు పెడ‌తామ‌ని రాష్ట్రానికే వ‌చ్చేవార‌న్నారు. ప్ర‌త్యేక హోదా వ‌చ్చి ఉంటే ల‌క్ష‌ల కోట్ల రూపాయిల పెట్టుబ‌డులు వ‌చ్చి ఉండేవ‌ని.. ఈపాటికే రాష్ట్రంలో ల‌క్ష‌లాది ఉద్యోగాలు కూడా వ‌చ్చేవ‌న్నారు. విశాఖ‌లో నిర్వ‌హించిన రెండు భాగ‌స్వామ్య స‌ద‌స్సుల్లో ఒకసారి రూ.5ల‌క్ష‌ల కోట్లు.. మ‌రోసారి రూ.10ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చిన‌ట్లుగా చెప్పార‌న్నారు. ఒక‌వేళ నిజంగానే రూ.15 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులుగా వ‌చ్చి ఉంటే ఈపాటికే ఎన్ని ప‌రిశ్ర‌మ‌లు.. ఉద్యోగాలు వ‌చ్చేవి అని ప్ర‌శ్నించారు.

బాబు స‌ర్కారు చెప్పిన దానికి.. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండ‌స్ట్రియ‌ల్ ప్ర‌మోష‌న్ అండ్ పాల‌సీ వ‌ద్ద రిజిస్ట‌ర్ అయిన సంస్థ‌ల్ని చూస్తే.. మూడేళ్ల వ్య‌వ‌ధిలో వ‌చ్చిన పెట్ట‌బడులు ఏడాదికి రూ.5వేల కోట్ల‌కు దాట‌లేద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ లెక్క‌లే ఇలా ఉంటే.. రాష్ట్రానికి రూ.15ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చిన‌ట్లుగా బాబు చెబుతున్నార‌న్నారు.

ఏపీలో ఉద్యోగాల విప్ల‌వం రావాలంటే క‌చ్ఛితంగా ప్ర‌త్యేక హోదా రావాల్సిందేన‌ని.. అందుకోసం గ‌ట్టిగా పోరాటం చేయాల్సిందేన‌న్నారు. ఇవాళ కాకుంటే రేపైనా ప్ర‌త్యేక హోదాను సాధిస్తామ‌ని.. ఒక్క‌సారి హోదా వ‌స్తే రాష్ట్రం అభివృద్ధి ప‌థంలోకి ఉన్న‌త‌స్థాయిలోకి దూసుకెళుతుంద‌న్నారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్పుడు ఏపీలో రూ.1.42 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని.. బాబు మూడున్న‌రేళ్ల కాలంలో ఒక్క ఉద్యోగాన్ని భ‌ర్తీ చేయ‌లేద‌న్నారు. కొన్ని ప‌రీక్ష‌లు పెట్టినా పోస్టింగులు ఇవ్వ‌లేద‌న్నారు. బాబు త‌న పాల‌న‌లో న‌చ్చిన వారికి పారిశ్రామిక రాయితీలు ఇచ్చి.. న‌చ్చ‌ని వారికి ఇవ్వ‌టం లేద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పారిశ్రామిక‌వేత్త‌లంద‌రికి రాయితీలు వ‌చ్చేలా పార‌ద‌ర్శ‌క పారిశ్రామిక విధానాన్ని తీసుకురానున్న‌ట్లు చెప్పారు.