Begin typing your search above and press return to search.

య‌న‌మ‌ల అండ్ కో అవినీతి లెక్క‌లు చెప్పిన జ‌గ‌న్

By:  Tupaki Desk   |   12 Aug 2018 4:16 AM GMT
య‌న‌మ‌ల అండ్ కో అవినీతి లెక్క‌లు చెప్పిన జ‌గ‌న్
X
ఏపీలో సాగుతున్న ఆరాచ‌క పాల‌న‌పై జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌దేళ్ల త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన బాబు స‌ర్కారు వ‌న‌రుల దోపిడీ ఏ స్థాయిలో చేస్తుంద‌న్న విష‌యంపై విప‌క్ష నేత తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. త‌న పాద‌యాత్ర సంద‌ర్భంగా ఏపీ ప్ర‌భుత్వంలో కీల‌క స్థానాల్లో ఉన్న వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో అవినీతి.. అక్ర‌మాలు ఏ స్థాయిలో ఉన్నాయ‌న్న విష‌యంపై ఇప్ప‌టికే ప‌లు సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టిన జ‌గ‌న్‌.. తాజాగా రాష్ట్ర ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి నియోజ‌క‌వ‌ర్గంలో వ‌న‌రుల దోపిడీ ఏ రీతిలో సాగుతుందో చెప్పి షాక్ కు గురి చేశారు.

ఆర్థిక‌మంత్రి ప్రాంతంలో అవినీతి ఏరులై పారుతుంద‌న్న జ‌గ‌న్ య‌న‌మ‌ల ఇప్ప‌టివ‌ర‌కూ.. రెండుసార్లు ఆర్థిక‌మంత్రి.. మ‌రో రెండుసార్లు అసెంబ్లీ స్పీక‌ర్ గా ప‌ని చేసి 35 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్న వ్య‌క్తి అని చెప్పారు. మ‌రి.. ఇలాంటి నేత‌కు చెందిన నియోజ‌క‌వ‌ర్గం అంటే అభివృద్ధి స‌హ‌జంగానే ప‌రుగులు పెడుతుంద‌ని ఎవ‌రైనా అనుకుంటార‌ని.. కానీ ఇక్క‌డ అభివృద్ధి కాదు.. అవినీతి ముందుకు ప‌రుగులు పెడుతోంద‌ని త‌న‌తో ప‌లువురు చెప్పార‌న్నారు.

తునిలో తాగేందుకు మంచినీళ్లు కూడా లేవ‌న్న జ‌గ‌న్‌.. డ్రైనేజి భూముల‌ను కూడా పాల‌కులు ఆక్ర‌మిస్తున్నార‌న్నారు. ప‌క్క‌నే తాండ‌వ న‌దిలో ఒక్క స్పూన్ కూడా ఇసుక లేకుండా దోచేశార‌న్న జ‌గ‌న్‌.. నిర్మాణాల‌కు స‌ముద్ర‌పు ఇసుక వాడ‌ర‌ని.. కానీ చంద్ర‌బాబు వ‌ద్ద నేర్చుకున్న మోసపూరిత విధానాల‌తో స‌ముద్రంలోని ఇసుక‌తో తాండ‌వ న‌ది ఇసుక క‌లిపి మోసం చేసి అమ్ముతున్నార‌న్నారు.

ఓప‌క్క ఇసుక ఉచిత‌మ‌ని చెబుతున్న చంద్ర‌బాబు స‌ర్కారు.. ఉచితంగా ఇసుక ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్న త‌న‌పై మాత్రం కేసులు పెడుతున్నార‌న్నారు. తుని నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో దాదాపు వంద చెరువుల్ని త‌వ్వేశార‌న్న జ‌గ‌న్‌.. ఒక్కో చెరువును తాటిచెట్టు లోతులో త‌వ్వేశార‌న్నారు. వంద చెరువుల్లో లక్ష ట్రాక్ట‌ర్ల మట్టిని అమ్ముకున్నార‌న్నారు. ఎక్క‌డైనా చెరువుల్లో రెండు మూడు అడుగులు త‌వ్వుతుంటార‌ని.. కానీ.. ఇంత దారుణంగా తాటి చెట్టు లోతులో త‌వ్వేస్తే ఎలా అని స్థానిక ప్ర‌జ‌లు వాపోతున్నార‌న్నారు.

మట్టి - ఇసుక - మరుగుదొడ్లు.. చివరికి గుడి భూములు కూడా వదలి పెట్టడం లేదంటూ టీడీపీ నేత‌ల దోపిడీ గురించి చెప్పుకొచ్చారు. తొండంగి మండలం పి.అగ్రహారంలో ఉత్తరాది మఠానికి చెందిన 425 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో 66 ఎకరాల రికార్డులు ఓ టీడీపీ నాయకుడు తారుమారు చేస్తే, మరో నాయకుడు, అన్నవరం ట్రస్టు బోర్డు మెంబరు 36 ఎకరాల భూముల రికార్డును తారుమారు చేసి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకుంటున్నా విచారణలు జరగనే జరగవన్నారు.

ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్థానికుడే అయిన‌ప్ప‌టికీ త‌మ ఖ‌ర్మ కొద్దీ చివ‌ర‌కు పోలీస్ స్టేష‌న్ భూముల్ని కూడా వదిలిపెట్ట‌టం లేద‌ని స్థానికులు త‌న‌తో చెప్పిన‌ట్లుగా జ‌గ‌న్ వెల్ల‌డించారు. తుని పోలీస్ స్టేష‌న్ భూమిని ఆక్ర‌మించ‌ట‌మే కాదు దాని ప‌క్క‌నే ఉన్న 1.5 ఎక‌రాల బాతుల కోనేరును కూడా క‌ప్పి పెట్టి అమ్మేశార‌న్నారు. డ్రైనేజీ స్థ‌లాల్ని కూడా క‌లుపుకొని అమ్మేశార‌ని.. దీంతో తుని ప‌ట్ట‌ణంలోని 10 వార్డుల‌కు డ్రైనేజీ లేక మురుగు రోడ్ల‌పై పారుతోంద‌న్నారు.