Begin typing your search above and press return to search.

జగన్ పిల్లాడి చేష్టలు బయటపడ్డాయి

By:  Tupaki Desk   |   25 Nov 2015 4:50 AM GMT
జగన్ పిల్లాడి చేష్టలు బయటపడ్డాయి
X
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారీ ఒక మాట ప్రతిరోజూ వినిపిస్తుంటుంది. అసెంబ్లీ సమావేశాల్ని లైవ్ గా టీవీలో చూసే వారంతా ఈ విషయం సుపరిచితం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వ్యవహరించాల్సిన తీరును విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారపక్ష నేతలు దగ్గర నుంచి.. స్పీకర్ వరకూ చెబుతూనే ఉంటారు. సబ్జెక్ట్ కాస్త పెంచుకోవాలన్న హితవు అందులో ఉంటుంది. తన మీద ‘‘బండలు’’ వేస్తున్నారంటూ అధికారపక్షంపై జగన్ నిప్పులు చెరిగినా.. సాంకేతికంగా ఒక విపక్ష నేత వ్యవహరించాల్సిన విషయాల్లో ఆయన తరచూ తప్పులు చేసి దొరికిపోతుంటారు.

మిగిలిన నేతల సంగతి ఎలా ఉన్నా.. జగన్ అవగాహన లేమిని.. అనునిత్యం ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అర్థమయ్యేలా చెబుతుంటారు. శాసనసభా వ్యవహారాల విషయంలో మాంచి పట్టున్న యనమల.. జగన్ చేసే తప్పును రికార్డు అయ్యేలా చేయటంలో సక్సెస్ అవుతుంటారు. జగన్ లాంటి నేత సాంకేతికంగా తప్పులు చేయటాన్ని జీర్ణించుకోలేం. ఒక వ్యవస్థలో భాగస్వామి అయినప్పుడు.. సాంకేతికంగా ఎలా వ్యవహరించాలన్న విషయంపై అవగాహన చాలా ముఖ్యం.

ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ.. సిస్టమ్ కు తగినట్లుగా వ్యవహరించాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. నిబంధనల మీద అవగాహన పెంచుకోవాల్సిన జగన్ వాటి మీద దృష్టి సారించకుండా.. అభాసుపాలు అవుతుంటారు. ఇంతకాలం సబ్జెక్ట్ మీదనే పట్టులేదన్న విమర్శ ఎదుర్కొనే జగన్ కు.. తాజా వరంగల్ ఉప ఎన్నికల ఫలితం పుణ్యమా అని రాజకీయ వ్యూహం విషయంలోనూ అంత సీన్ లేదన్న విషయం స్పష్టమవుతుంది.

తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం ఉనికి లేదన్న విషయం రాజకీయాల మీద అవగామన ఉన్న ప్రతిఒక్కరికి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తన పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపితే భారీ నష్టమే తప్ప ఏ మాత్రం లాభం ఉండదు. ఒకవేళ జగన్ రహస్య స్నేహితుడుగా చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సాయం చేయాలన్న ఉద్దేశంతో.. విపక్ష ఓట్లను చీల్చేందుకు తన పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపారని అనుకున్నా.. చేయకూడని తప్పును జగన్ చేశారన్న మాట బలంగా వినిపిస్తోంది.

వరంగల్ ఉప ఎన్నికల్లో తన పార్టీ ఏ మాత్రం ప్రభావితం చేయలేదన్న విషయం తెలిసినప్పటికీ.. అభ్యర్థిని బరిలోకి దింపి జగన్ ఒక తప్పు చేస్తే.. తనకు తానుగా వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి మూడు.. నాలుగు రోజులు కేటాయించటం మరో భారీ తప్పిదంగా చెప్పొచ్చు. వరంగల్ ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కు తన పార్టీకి మాత్రమే ఉందంటూ జగన్ పదే పదే చెప్పుకున్నారు. తన మాటను అర్థమయ్యేలా చెప్పటం కూడా.. భారీ వివరణే ఇచ్చే ప్రయత్నం చేశారు. అధికార టీఆర్ ఎస్ మొదలు విపక్షాల వరకూ అన్నీ పార్టీల్నిఏకేసిన జగన్.. తన పార్టీకి మాత్రమే ఓటు వేయాలని.. అలా ఓటు అడిగే హక్కు తమకు మాత్రమే ఉందంటూ పదేపదే చెప్పుకున్నారు.

జగన్ మాట ఇలా సాగితే.. వరంగల్ ప్రజలు మాత్రం ఆయనకు కరెంటు షాకిచ్చేలా తీర్పు ఇచ్చారు. వరంగల్ ఉప ఎన్నికలో జగన్ పార్టీకి ఐదో స్థానాన్ని కట్టబెట్టారు. ఎవరికి పెద్దగా పరిచయంలేని శ్రమజీవి పార్టీ నాలుగో స్థానం దక్కితే.. జగన్ కు మాత్రం ఆ పార్టీ తర్వాత స్థానం దక్కటానికి మించిన అవమానం మరేం ఉండదేమో. తనకు మాత్రం ఓటు అడిగే హక్కు ఉందని చెప్పుకున్న జగన్ కు వరంగల్ ఓటర్లు ఇచ్చిన తీర్పు చూసినప్పుడు జగన్ లోని పిల్లాడు స్పష్టంగా కనిపిస్తాడు. ఒక పార్టీ అధినేతగా తాను కానీ ఎన్నికల బరిలోకి దిగితే జరిగే లాభనష్టాల మీద ఎంతోకొంత అంచనా వేయాల్సి ఉంటుంది. అలాంటి అంచనాలు వేయటంలోనూ జగన్ ఘోరంగా విఫలమైనట్లు ఉప ఎన్నిక ఫలితం చెప్పకనే చెప్పేస్తుంది. మరి.. జగన్ లోని ‘పిల్లాడు’ ఎప్పటికి ‘పెద్దోడు’ అయ్యేటట్లో..?