Begin typing your search above and press return to search.

కేసీఆర్ మంచివాడంటూ జగన్ కాంప్లిమెంట్?

By:  Tupaki Desk   |   19 Nov 2015 9:35 AM GMT
కేసీఆర్ మంచివాడంటూ జగన్ కాంప్లిమెంట్?
X
నిజానిజాల మాట ఎలా ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రహస్య మిత్రుడిగా వైఎస్ జగన్ ను అభివర్ణిస్తారు. ఒకరు మీద ఒకరు పల్లెత్తు మాట అనుకోకుండా రాజకీయం నడిపించేస్తున్నారన్న విమర్శల్ని సైతం పట్టించుకోకుండా రాజకీయ బంధం కొనసాగటం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంటారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటం తెలిసిందే.

ఒకవైపు ధ్వజమెత్తుతూనే.. మరోవైపు.. అవకాశం ఉన్నప్పుడల్లా.. కేసీఆర్ మంచి ఆప్షన్ అన్నట్లుగా మాట్లాడటం జగన్ కు మాత్రమే చెల్లుతుంది. ఇందుకు.. ఆయన ఒక రోడ్ షోలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఉప ఎన్నికల బరిలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదనే క్రమంలో ఆయన అన్ని పార్టీలపై విమర్శలు చేయటం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ.. అదో నీచమైన పార్టీ అని.. అవసరం ఉంటే దండలు వేసే ఆ పార్టీ.. అవసరం తీరాక బండలు వేస్తారంటూ మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ ను.. మరణించిన తర్వాత.. ఎన్ని అభాండాలు వేసింది.. ఎన్ని విమర్శలు చేసింది తెలిసిన విషయమే అంటూ మండిపడ్డారు.

వైఎస్ బతికి ఉన్నంతకాలం మంచి వాడిగా చెప్పిన కాంగ్రెస్ నేతలు.. మహా నేత మరణించిన తర్వాత ఆయనపై నిందలు వేశారన్నారు. తాను కాంగ్రెస్ లో కొనసాగినంత కాలం తనను ఏమీ అనలేదని.. కానీ.. తాను పార్టీ నుంచి బయటకు రాగానే.. చెడ్డవాడినైపోయానని చెప్పుకొచ్చారు. పార్టీ నుంచి బయటకు వచ్చేశానన్న ఒకే ఒక్క కారణంతో తనపై కేసులు వేసి.. జైలుకు పంపేందుకు కూడా వెనుకాలేదని దుయ్యబట్టిన జగన్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు.

ఇలా విమర్శలు చేసే క్రమంలో.. కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీలతో పోలిస్తే.. ఉన్నంతలో అంతో ఇంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేలు అని చెప్పటం విశేషం. ఒకవైపు కేసీఆర్ పాలనపై విమర్శలు చేస్తూనే.. మరోవైపు.. ఉన్నంతలో మిగిలిన పార్టీలతో పోలిస్తే.. టీఆర్ఎస్ సర్కారు మేలు అని చెప్పటం ఏమిటో..? దాని భావం ఏమిటో.. జగన్ కు మాత్రమే అర్థం కావాలి. ఏది ఏమైనా రహస్య స్నేహితుడి మీద అభిమానాన్ని రహస్యంగా ఉంచలేకపోయారంటూ కొందరు వ్యాఖ్యలు చేయటం గమనార్హం.