Begin typing your search above and press return to search.

ఏపీలో 60 ల‌క్ష‌ల దొంగ ఓట్లు

By:  Tupaki Desk   |   4 Feb 2019 7:38 AM GMT
ఏపీలో 60 ల‌క్ష‌ల దొంగ ఓట్లు
X
ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఓట‌ర్ల జాబితా విష‌యంలో టీడీపీ ప్ర‌భుత్వం చేస్తున్న లీల‌ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత - వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్ గ‌ళ‌మెత్తారు. నేరుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ భారీగా దొంగ ఓట్ల‌ను న‌మోదు చేస్తోంద‌ని - వైసీపీ సానుభూతిప‌రుల ఓట్ల‌ను తొల‌గిస్తోంద‌ని ఆరోపించారు. డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్ వ్య‌వ‌హార శైలిని కూడా త‌ప్పుప‌ట్టారు.

వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి - ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి - మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి - వైవీ సుబ్బారెడ్డి - మిథున్ రెడ్డి - వ‌రప్ర‌సాద్ త‌దిత‌రులతో క‌లిసి జ‌గ‌న్ కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని సోమ‌వారం క‌లిశారు. రాష్ట్రంలో అధికార టీడీపీ అప్రజాస్వామిక రీతిలో ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోంద‌ని ఫిర్యాదు చేశారు. అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను ఆ పార్టీ దర్వినియోగం చేస్తోందంటూ సీఈసీ సునీల్ అరోడా దృష్టికి తీసుకెళ్లారు.

ఈసీని క‌లిసిన అనంత‌రం జ‌గ‌న్ విలేక‌ర్ల‌తో మాట్లాడారు. ఏపీలో ప్ర‌స్తుతం దాదాపు 60 ల‌క్ష‌ల మేర దొంగ ఓట్లు ఉన్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. 20 ల‌క్ష‌ల మందికి ఏపీతోపాటు తెలంగాణ‌లోనూ ఓట్లు ఉన్నాయ‌న్నారు. రాష్ట్రంలో అధికార టీడీపీ ప‌దే ప‌దే స‌ర్వేలు చేయిస్తోంద‌ని.. వాటి ముసుగులో వైసీపీ సానుభూతి ప‌రుల ఓట్ల‌ను ఓట‌రు జాబితా నుంచి తొల‌గిస్తోంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. ఇప్ప‌టికే అలా 4 ల‌క్ష‌ల మంది వైసీపీ సానుభూతిప‌రుల పేర్లు ఓట‌రు జాబితా నుంచి క‌నుమ‌రుగ‌య్యాయ‌ని పేర్కొన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీ ఆర్.పి.ఠాకూర్ ప్ర‌తి విష‌యంలో ప్ర‌భుత్వానికి కొమ్ముకాస్తున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. ఎన్నిక‌ల విధుల నుంచి ఆయ‌న్ను త‌ప్పించాల‌ని కోరిన‌ట్లు తెలిపారు. ఠాకూర్ పై కేంద్ర హోంశాఖ‌కు కూడా ఫిర్యాదు చేస్తామ‌ని జ‌గ‌న్ చెప్పారు. రాష్ట్రంలో ఇటీవ‌ల సీఐల‌కు క‌ల్పించిన ప‌దోన్న‌తుల్లో టీడీపీ ప్ర‌భుత్వం కుల పిచ్చితో వ్య‌వ‌హ‌రించింద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. ఒక‌ సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి మాత్ర‌మే ప్ర‌మోష‌న్లు ఇచ్చార‌ని తెలిపారు. మొత్తం 37 మంది సీఐల‌కు ప‌దోన్న‌తి ద‌క్కగా.. వారిలో 35 మంది ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన‌వార‌ని వెల్ల‌డించారు.