Begin typing your search above and press return to search.

వై ఎస్ జగన్ @ 1000 కిలోమీటర్లు

By:  Tupaki Desk   |   29 Jan 2018 11:19 AM GMT
వై ఎస్ జగన్ @ 1000 కిలోమీటర్లు
X
వైసీపీ అధినేత‌, ఏపీ అసెంబ్లీలో విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంకల్ప యాత్ర నేటి మ‌ధ్యాహ్నానికి వెయ్యి కిలో మీట‌ర్లు దాటేసింది. మూడు వేల కిలో మీట‌ర్ల మేర సాగ‌నున్న ఈ యాత్రను జ‌గ‌న్‌... ఆరు నెల‌ల పాటు కొన‌సాగించ‌నున్నారు. వ‌చ్చే ఎన్నికల్లో అధికార‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ చేప‌ట్టిన ఈ యాత్ర‌కు జ‌నం బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది న‌వంబ‌ర్ 6న త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లోని ఇడుపుల‌పాయ‌లో ఉన్న త‌న తండ్రి, దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌మాధి నుంచి యాత్ర‌ను ప్రారంభించిన జ‌గ‌న్‌... ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల‌ను చుట్టేశారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ యాత్ర నెల్లూరు జిల్లాలో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

యాత్ర‌లో ఏమాత్రం అల‌సిపోని విధంగా ముందుకు సాగుతున్న జ‌గ‌న్‌... తాను అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తాన‌న్న విష‌యంతో స్ప‌ష్టంగా చెప్ప‌డంతో పాటు ప్ర‌స్తుతం టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడి ఆధ్వ‌ర్యంలోని ప్ర‌భుత్వం సాగిస్తున్న పాల‌న‌పై నిప్పులు చెరుగుతూ ముందుకు సాగుతున్నారు. జ‌గ‌న్ మాట‌ల‌కు జ‌నం నుంచి మంచి రెస్పాన్సే వ‌స్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ జ‌గ‌న్ యాత్ర‌కు జ‌నం తండోప‌తండాలుగా వ‌స్తున్నారు. చంద్ర‌బాబు సొంతూరు నారావారిపల్లె స‌మీపంలోనూ జ‌గ‌న్ యాత్ర‌కు మంచి స్పంద‌నే వ‌చ్చింద‌ని చెప్పాలి.

జ‌నం నుంచి వ‌స్తున్న స్పంద‌న‌తో మ‌రింత ఉత్సాహంగా క‌దులుతున్న జ‌గ‌న్‌... నేటి మ‌ధ్యాహ్నం నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం సైదాపురం వ‌ద్ద వెయ్యి కిలో మీట‌ర్ల మైలు రాయిని దాటారు. వెయ్యి కిలో మీట‌ర్ల యాత్ర పూర్తి అయిన సంద‌ర్బంగా వైసీపీ నేత‌లు సైదాపురం వ‌ద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ ను జ‌గ‌న్ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి కూడా జ‌నం పెద్ద ఎత్తున హాజ‌రయ్యారు. మ‌రోవైపు జ‌గ‌న్ యాత్ర‌కు సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో *వాక్ విత్ జ‌గ‌న్‌* పేరిట స్థానిక నేత‌లు యాత్ర‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. మొత్తంగా చూస్తే... జ‌గ‌న్ యాత్ర వెయ్యి కిలో మీట‌ర్లు దాటిన విష‌యం పార్టీ నేత‌ల్లో ఉత్సాహం నింపింద‌నే చెప్పాలి.