Begin typing your search above and press return to search.

శతకోటి దరిద్రాలకు జగన్ అనంతకోటి ఉపాయాలు

By:  Tupaki Desk   |   31 Oct 2019 8:46 AM GMT
శతకోటి దరిద్రాలకు జగన్ అనంతకోటి ఉపాయాలు
X
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఏపీ లోటు బడ్జెట్ తో ఉన్నా కూడా పథకాల అమలుకు పెద్ద ప్లానే వేశారు. సంకల్పం ఉంటే అప్పులు - ఆర్థిక లోటు పెద్ద సమస్యే కాదని జగన్ నిరూపించడానికి రెడీ అవుతున్నారు..

ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు.. జీతాలు - పింఛన్లు - సామాజిక పింఛన్లు - సంక్షేమ పథకాల అమలుకు నిధులు సేకరించేందుకు ప్రతీ నెల ఆపసోపాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కొత్తగా జగన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు అస్సలు డబ్బులే లేవు. మరి ఎలా? ఏపీ అప్పుల కుప్ప చూసి బ్యాంకులు సహా ఎవ్వరూ అప్పులు ఇవ్వని పరిస్థితి. మరి ఏం చేయాలి..? జగన్ ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలి? ఈ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే ‘మిషన్ బిల్డ్’.

మిషన్ బిల్డ్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి చెందిన విలువైన భూములను విక్రయించి పథకాలకు నిధులు సమకూర్చుకోవాలని జగన్ సర్కారు మాస్టర్ ప్లాన్ వేసింది. ముఖ్యంగా జగన్ హామీనిచ్చిన నవరత్నాలు - ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే ‘నాడు-నేడు’తోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ‘మిషన్ బిల్డ్’ద్వారా నిధులు సేకరించాలని నిర్ణయించింది.

మిషన్ బిల్డ్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘నేషనల్ బిల్డింగ్ కనస్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ)’తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ భూముల అభివృద్ధి - భవన నిర్మాణాలు - ప్రభుత్వ భూములను రియల్ వెంచర్లుగా మార్చి సొమ్ము చేయడంలో ఎన్బీసీసీకి అపారమైన అనుభవం ఉంది. అందుకే ఈ ప్రభుత్వ భూముల క్రయవిక్రయాలు - అభివృద్ధి బాధ్యతను జగన్ సర్కారు ఎన్బీసీసీకి అప్పగించింది.

ప్రధానంగా జగన్ సంకల్పించిన నవరత్రాలు అమలు చేయడానికి నిధుల కొరత తీవ్రంగా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం జగన్ సర్కారు ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఏపీలో వివిధ ప్రభుత్వ శాఖలు - ప్రభుత్వ రంగ సంస్థలు - కార్పొరేషన్లకు వేల ఎకరాల భూములు నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయకుండా.. మౌళిక వసతులు కల్పించకుండా ఊరికే వదిలేశారు. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా ఉన్న ఈ ప్రభుత్వ భూములను, భవనాలను గుర్తించి.. శిథిలమైన - అక్కరకు రాకుండా ఉన్న ప్రభుత్వ భూములను సేకరించి వాటికి మౌళిక సదుపాయాలు కల్పించడం.. ఆ తర్వాత అమ్మి సంక్షేమానికి వాడుకునేందుకు జగన్ సర్కారు రెడీ అయ్యింది.