Begin typing your search above and press return to search.

వంశీకి వైసీపీ కండువా దక్కేలా లేదే!

By:  Tupaki Desk   |   9 Dec 2019 6:38 AM GMT
వంశీకి వైసీపీ కండువా దక్కేలా లేదే!
X
రాజకీయ ఫిరాయింపుల విషయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. తన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు - కష్టాల్లో ఉన్నప్పుడు కూడా జగన్ విలువలను వదులుకోలేదు. అప్పట్లోనే తన పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డి చేత ఆ పదవికి రాజీనామా చేయించారు. తెలుగుదేశాన్ని వీడి వైసీపీలోకి చేరిన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

తన వెంట అధికారం లేనప్పుడే జగన్ విలువలను నమ్ముకున్నారు. ఇప్పుడు మరింత స్ట్రిక్ట్ గా ఉన్నారు ఆ విషయంలో. అందుకే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు వైసీపీ కండువా వేయడం లేదని స్పష్టం అవుతోంది. ఇప్పటికే సీఎంతో రెండు సార్లు మీటింగ్ అయ్యారు వంశీ మోహన్.

ఆయనను ఇద్దరు మంత్రులు సీఎం వద్దకు తీసుకెళ్లారు. అయితే ఆ చర్చల్లో సీఎం ఒకే విషయాన్ని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే పార్టీలోకి చేర్చుకోవడం ఉంటుందని జగన్ తేల్చి చెప్పినట్టుగా సమాచారం.

అక్కడకూ వల్లభనేని వంశీ ఏదో ఒక రాజీనామా ను అయితే వాట్సాప్ లో పంపించారట. అది చంద్రబాబుకు.. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా పంపింది. అలాంటి రాజీనామాలను జగన్ లెక్క చేయనట్టుగా ఉంది.

చంద్రబాబు దగ్గర వ్యవహారాలు - జగన్ దగ్గర రాజకీయాలకు చాలా తేడా ఉంటుందనే విషయం ఇప్పుడిప్పుడు వంశీకి కూడా బోధపడినట్టుగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకూ వైసీపీ కండువా వేసే ప్రసక్తే లేదన్నట్టుగా జగన్ తేల్చి చెబుతున్నట్టుగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే టికెట్ విషయంలో కూడా జగన్ నుంచి భరోసా అందకపోవడంతో.. వల్లభనేని వంశీ మోహన్ ఏం పాలుపోలేని స్థితిలో ఉన్నట్టుగా గన్నవరం నియోజకవర్గంలో చర్చ జరుగుతూ ఉంది.