Begin typing your search above and press return to search.

వైఎస్సార్సీపీ రాజ్య‌స‌భ స‌భ్యత్వాలు వీళ్ల‌కేనా!

By:  Tupaki Desk   |   16 Dec 2019 11:22 AM GMT
వైఎస్సార్సీపీ రాజ్య‌స‌భ స‌భ్యత్వాలు వీళ్ల‌కేనా!
X
ఏపీ అసెంబ్లీ కోటాలో రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాల‌కు గ‌ట్టి పోటీనే ఉండ‌వ‌చ్చు. మొత్తం అన్ని ప‌ద‌వులూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కే ద‌క్క‌నున్న నేప‌థ్యంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం మ‌రింత ఆస‌క్తిదాయ‌కంగా మారింది. అసెంబ్లీలో బ‌లాన్ని బ‌ట్టి అన్ని రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాలూ వైసీపీకే ద‌క్కుతాయి. తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు ద‌క్క‌దు.

అయితే వైసీపీకి ఇప్పుడొక ఫ్లెక్సిబులీటీ ఉంది. పార్టీ త‌ర‌ఫున ముఖ్య‌నేత‌లంతా వివిధ ప‌ద‌వుల్లో ఉన్నారు. ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలు..ఇలా చాలా మందికి హోదాలున్నాయి. దీంతో రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాల విష‌యంలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పెద్ద‌గా ఒత్తిడి లేకుండా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలున్నాయి.

ఈ నేప‌థ్యంలో రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాల విష‌యంలో ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యం అయిపోయింద‌ని కూడా స‌మాచారం అందుతూ ఉంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. టీటీడీ చైర్మ‌న్ హోదాలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి - జ‌గ‌న్ కు స‌న్నిహితుడు అయిన వ్యాపార వేత్త ఆళ్ల ఆయోధ్య‌రామిరెడ్డి - ఇటీవ‌లే వైసీపీలో చేరిన గోక‌రాజు కుటుంబీకులు ఒక‌రికి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాలు ఖ‌రారు అయిన‌ట్టుగా తెలుస్తోంది. వీరితో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన‌ - ఇటీవ‌ల వైసీపీలో చేరిన బీద మ‌స్తాన్ రావుకు కూడా రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఖ‌రారు అయిన‌ట్టుగా స‌మాచారం.

వీరిలో వైవీ సుబ్బారెడ్డి పార్టీ ఆదేశాల ప్ర‌కారం ఎంపీ టికెట్ ను త్యాగం చేశారు. ఒంగోలు నుంచి ఎంపీగా ఉండిన ఆయ‌న ప్ర‌త్యేక‌హోదా కోసం రాజీనామా చేశారు. త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు జ‌గ‌న్ టికెట్ కేటాయించ‌లేదు. అప్పుడు పార్టీ అవ‌స‌రం కోసం త్యాగం చేసినందుకు ప్ర‌తిఫ‌లంగా ఇప్పుడు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ద‌క్క‌నుంద‌ని స‌మాచారం.

ఇక గ‌తంలో పార్టీ త‌ర‌ఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆళ్ల అయోధ్య‌రామిరెడ్డి. ఇప్పుడు ఆయ‌న‌కు ప్ర‌తిఫ‌లం ల‌భిస్తున్న‌ట్టుగా ఉంది. ఇక రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను అనుస‌రించి ఇటీవ‌లే పార్టీలో చేరిన‌ప్ప‌టికీ బీద మ‌స్తాన్ రావుకు, గోక‌రాజు కుటుంబీకుల్లో ఒక‌రికి జ‌గ‌న్ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాల‌ను ఖ‌రారు చేసిన‌ట్టుగా స‌మాచారం.