Begin typing your search above and press return to search.

హోరు వానలో... ప్రజల జోరులో..

By:  Tupaki Desk   |   19 Sept 2018 10:26 AM IST
హోరు వానలో... ప్రజల జోరులో..
X
వై.ఎస్. జగన్ ప్రజా సంకల్పయాత్ర జోరుగా జరుగుతోంది. విశాఖ జిల్లాలో యాత్రలో భాగంగా విశాఖపట్నం శివారులో యాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. విశాఖపట్నంలో గడచిన రెండు రోజులుగా వర్షం బీభత్సం స్రష్టిస్తోంది. కుంభవ్రష్టిని తలపిస్తుంది. విశాఖపట్నంలో భారీ స్థాయిలో కురిసిన వర్షానికి విశాఖ వాసులు అతలాకుతలం అయ్యారు. ఏకధాటిగా మూడు గంటల పాటు వర్షం బీభత్సం రేపింది. ఇంతటి వానలోనూ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తన యాత్ర కొనసాగించడం విశేషం. ఆయన వెంట ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. వీరంతా కూడా జోరు వానలో తడుస్తూ జగన్ వెంట అడుగులో అడుగు వేసుకుంటూ కదలడం విశేషం. ఆదివారం నాడు విశాఖ శివారులో దాదాపు పది కిలోమీటర్లు హోరు వానలో నడుస్తూ జగన్ తన పాదయాత్రను కొనసాగించారు. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభిస్తున్న జగన్ రావాలి... జగన్ కావాలి కార్యక్రమం విజయవంతం చేసేందుకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

పార్టీకి విజయాన్ని అందించడమే లక్ష్యంగా నాయకులు - కార్యకర్తలు పని చేసేందుకు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల ఇండియా టుడే జరిపిన పర్వేలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు వస్తాయని తేలడంతో పార్టీశ్రేణుల్లో మరింత ఉత్సాహం వస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి రోజరోజుకు ప్రజాదరణ తగ్గడం - ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడి పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావడం కూడా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంలా ఉంది. కాపు రిజర్వేషన్ పై జగన్ చేసిన ప్రకటనను వాడుకోవాలని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలకూ గండి పడింది. రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉన్నాయని, అయినా కాపు కులస్తుల కార్పొరేషన్ కు భారీ నిధులు కేటాయిస్తామని చెప్పడంతో కాపు యువకులందరూ జగన్ కు జై కొడుతున్నారు. పాదయాత్రకు మహిళలకు భారీగా రావడం కూడా ఆ పార్టీ విజయానికి అనుకూలించే అంశమని అంటున్నారు. గత ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో పార్టీకి ఆశించిన స్ధానాలు రాలేదు. భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ - అధికార తెలుగుదేశం పార్టీ మధ్య ఉప్పూ - నిప్పూగా మారడంతో ఇది ప్రతిపక్ష వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం.