Begin typing your search above and press return to search.

తెలుగు గ‌డ్డ మీద జ‌గ‌న్ తిరుగులేని రికార్డ్‌!

By:  Tupaki Desk   |   30 May 2019 6:10 AM GMT
తెలుగు గ‌డ్డ మీద జ‌గ‌న్ తిరుగులేని రికార్డ్‌!
X
తెలుగు గ‌డ్డ రెండు రాష్ట్రాలుగా ఏర్ప‌డిన‌ప్ప‌టికీ.. 1956 నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఏ రాజ‌కీయ నేత‌.. వారి వార‌సులు సాధించ‌లేని రికార్డును వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇప్ప‌టివ‌ర‌కూ ప‌ద‌హారు మంతి ముఖ్య‌మంత్రుల్ని చూసింది. కానీ.. తాజాగా జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవుతున్న వేళ‌.. ఆయ‌నో అరుదైన రికార్డును సృష్టిస్తున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

తెలుగు నేల మీద ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ముఖ్య‌మంత్రి కూడా త‌న కుమారుడు.. కుటుంబ స‌భ్యులు మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అయ్యింది లేదు. ఆ ఘ‌నత‌ను సొంతం చేసుకున్న ఒకే ఒక్క నేత‌గా జ‌గ‌న్ నిలుస్తారు. త‌న తండ్రి.. దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయ వార‌స‌త్వంతో రాజ‌కీయాల్లోకి రావ‌ట‌మే కాదు.. భారీ మెజార్టీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయి వ‌ర‌కూ వెళ్ల‌టం విశేషం.

2004లో ఏపీకి ముఖ్య‌మంత్రి అయిన వైఎస్.. 2009లో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించి రెండో సారి సీఎం అయ్యారు. అనూహ్య ప‌రిణామాల న‌డుమ ఆయ‌న హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా జ‌గ‌న్ సీఎం ప‌ద‌విని చేప‌ట్టే ప్ర‌య‌త్నం చేసినా.. సాధ్యం కాలేదు. అనంత‌రం కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కువ‌చ్చిన ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. 2014 ఎన్నిక‌ల్లో ఓట‌మి చ‌విచూసిన ఆయ‌న‌.. తాజాగా ముగిసిన ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఒక ముఖ్య‌మంత్రి కుమారుడు రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఎన్నిక కావ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకోలేదు. ముఖ్య‌మంత్రుల కుమారులు ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. రాష్ట్ర మంత్రులు అయ్యారు కానీ మ‌ళ్లీ సీఎం మాత్రం కాలేదు. ఈ లోటును భ‌ర్తీ చేస్తూ జ‌గ‌న్ సీఎం అవుతున్నారు. ద‌క్షిణ భార‌తంలో చూస్తే.. ఈ త‌ర‌హా రికార్డు క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార‌స్వామికి మాత్ర‌మే సాధ్య‌మైంది. ఏపీలో మాత్రం ఆ రికార్డు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత‌మ‌ని చెప్పాలి.