Begin typing your search above and press return to search.

తనకు ఓట్లు వేసినోళ్లకే జగన్ అమరావతి దెబ్బేశారా?

By:  Tupaki Desk   |   20 Sep 2022 8:30 AM GMT
తనకు ఓట్లు వేసినోళ్లకే జగన్ అమరావతి దెబ్బేశారా?
X
అమరావతి అన్నంతనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. అమరావతి పేరుతో కమ్మ సామాజిక వర్గాన్ని మరింత బలోపేతం చేయటానికి.. వారి ఆస్తుల్ని ఇబ్బడి ముబ్బడి చేయటమే లక్ష్యమన్నట్లుగా కొంత ప్రచారం జరిగింది. తెలుగోళ్ల బ్యాడ్ లక్ ఏమంటే.. ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తుంటే.. దాన్ని దెబ్బేయాలంటే చాలు.. కులం ప్రస్తావన తీసుకొచ్చి నానా యాగీ చేస్తారు. దీంతో.. విషయం పూర్తిగా పక్కదారి పట్టటమే కాదు.. ఏదో జరగాల్సిన చోట మరేదో జరిగే పరిస్థితి. అమరావతి విషయంలోనూ అలానే జరిగిందన్న మాట బలంగా వినిపిస్తూ ఉంటుంది.

ఒక మంచి కుక్కను తెలివిగా చంపేయాలంటే ముందుగా దాన్నో పిచ్చికుక్కగా ప్రచారం చేస్తే.. మనకే మాత్రం సంబంధం లేకుండా.. దాన్ని చంపేసే బాధ్యతను మరెవరో తీసుకుంటారు. మనకు కావాల్సింది కుక్క చనిపోవటమే అయినప్పుడు ఎవరు చంపింది మనకు సంబంధం లేని అ:వంగా మారుతుంది. అమరావతి విషయానికి వస్తే.. అమరావతికి ముందు ఓకే చెప్పటమే కాదు.. తాను అధికారంలోకి వస్తే అమరావతిని మరింత బాగా డెవలప్ చేస్తానంటూ బహిరంగ సభల్లో నొక్కి వక్కాణించిన జగన్.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పల్లవిని ఎత్తుకోవటం తెలిసిందే.

మరి.. పవర్లోకి రావటానికి ముందు వరకు అమరావతే రాజధాని అన్నారుగా? అన్న సూటి ప్రశ్నకు సమాధానం జగన్ చెప్పనప్పటికి.. ఆయన తోటి వారు మాత్రం అమరావతిలో కమ్మ సామాజిక వర్గ డామినేషన్ ఎక్కువగా ఉందంటూ చేసిన ప్రచారం.. కాలం గడిచే కొద్దీ అదో నిజం మాదిరి మారింది. విషయం ఎక్కడి వరకు వచ్చిందంటే.. అసలు అమరావతిని ఏర్పాటు చేసిందో కమ్మ సామాజిక వర్గానికి మేలు చేసేందుకు పక్కా ప్లాన్ చేసి.. చంద్రబాబు అండ్ కో తెలివిగా తీసుకున్న నిర్ణయం అన్న రీతిలో ప్రచారం జరిగింది.

ఇక.. టీడీపీ వారి వాదన అందరికి తెలిసిందే. మొత్తంగా చూసినప్పుడు అమరావతి అన్నంతనే అదో కమ్మ సామాజిక వర్గానికి తిరుగులేని సామ్రాజ్యం అన్న రీతిలో ప్రచారం జరిగింది. దీని వల్ల మిగిలిన వారు నిజంగానే కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉంటుందన్న నమ్మకంతోనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. అమరావతికి సంబంధించిన విష ప్రచార జోరుగా సాగిన కొద్దీ.. దాన్ని అభిమానించినోళ్లలోనూ వ్యతిరేకత మొదలైంది. నిజానికి సీఎం జగన్ కూడా కావాల్సిందే ఇదే. తానెలా అనుకున్ననో.. అలానే జరిగేలా ప్రచారాన్ని తెలివిగా చేయటం.. ఆ ప్రచారం ఉత్తదే కానీ.. అందులో ఇసుమంతైనా నిజం లేదన్న విషయాన్ని తెలియజేసే గణాంకాల్ని కౌంటర్ రూపంలో ఇవ్వకపోవటంతో ఒక అబద్ధం.. శాశ్విత నిజంగా మారింది.

వాస్తవాల్ని పరిశీలించినప్పుడు షాకింగ్ నిజాలు బయటకు వస్తాయి. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్ని చూసినా.. ఆ ప్రాంతం ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాన్ని చూసినా.. కమ్మోళ్ల సామ్రాజ్యమన్న వాదనలోని డొల్లతనం ఇట్టే అర్థమవుతుంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన తాడికొండ పరిధిలోకి అమరావతి ప్రాంతం వస్తుంది. ఇదొక్కటే.. ఎవరు అక్కడ ఎక్కువ మంది ఉంటారన్న విషయాన్ని తెలియజేస్తుంది.

ఈ విషయాన్ని పక్కన పెట్టి.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్ని.. సామాజిక వర్గాల వారీగా విడగొట్టి చూస్తే అసలు విషయం మరోసారి అర్థమవుతుంది. భూములు ఇచ్చిన వారి కులాల వారీగా చూసినప్పుడు ఎస్సీ.. ఎస్టీలు 32శాతం.. రెడ్లు 23 శాతం.. కమ్మ 18 శాతం.. బీసీలు 14 శాతం.. కాపులు 9 శాతం.. మైనార్టీలు 3 శాతం.. ఇతరులు ఒక శాతం ఉన్నారు. లెక్కలు ఇలా ఉంటే.. అమరావతి ఒకే సామాజిక వర్గానిదిగా ప్రచారం చేయటంలో అసలు లక్ష్యం ఏమిటో అర్థమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే.. జగన్ అధికారంలోకి రావటానికి కీలక భూమిక పోషించిన వారి ప్రయోజనాలు అమరావతి పేరుతో దెబ్బ తిన్నాయన్న వాదన ఉంది. ఇప్పుడు చెప్పండి.. అమరావతి ఆ సామాజికవర్గానిదేనా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.