Begin typing your search above and press return to search.

అసెంబ్లీకి గైర్హాజర్.. జగన్ వ్యూహాత్మక తప్పిదమే!

By:  Tupaki Desk   |   24 Oct 2017 2:49 PM GMT
అసెంబ్లీకి గైర్హాజర్.. జగన్ వ్యూహాత్మక తప్పిదమే!
X
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం పట్ల ఎలా అయినా వ్యవహరిస్తూ ఉండవచ్చు గాక.. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగకపోవచ్చు.. ప్రతిపక్ష పార్టీని దూషించడం తప్ప అధికార పక్షం మరో పని పెట్టుకోకపోవచ్చు. జగన్ పై వ్యక్తిగత ఆరోపణలతో మొదలుపెట్టి దూషణలకు కూడా అధికార పార్టీ వెనుకాడకపోవచ్చు. కేవలం జగన్ ను మాత్రమే కాకుండా.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలను కూడా వ్యక్తిగత దూషణలతో అధికార పార్టీ విసుగెత్తిస్తూ ఉండవచ్చు. ఇక ఫిరాయింపుల విషయంలో అయితేనేం.. ఏ వ్యవహారంలో అయితేనేం.. అధికార పార్టీ తీరు చాలా దారుణంగానే ఉండవచ్చు.

అయితే.. అలాంటి అసెంబ్లీకి గైర్హాజరు కావడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది కాదు. గైర్హాజరు కావడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతామని అంటోంది. కానీ అసెంబ్లీ అంటే.. మిగతా అలజడుల సంగతెలా ఉన్నా, హాజరు కావడం ప్రజా సమస్యలను ప్రస్తావించే ప్రయత్నం చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధి. ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేయాలి. దానిపై అధికార పార్టీ ఎలా అయినా స్పందించవచ్చు. అసెంబ్లీలో ఏ పార్టీ ఎలా వ్యవహరిస్తోంది అనేది ప్రజలంతా గమనిస్తారు కదా. అప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల విషయంలో తన దక్షత ఏమిటో నిరూపించుకోవచ్చు.

అసెంబ్లీలో ఎంతసేపూ అధికార పార్టీ దాష్టీకమే కొనసాగకపోవచ్చు. ఎక్కడో ఒక చోట ప్రతిపక్షపార్టీకి కూడా అవకాశం దొరుకుతుంది. అప్పుడు చంద్రబాబును ఇరకాటంలో పెట్టడానికి ప్రతిపక్షానికి పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. ఇది వరకూ పలుసార్లు జగన్ చక్కగా మాట్లాడాడు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. కేవలం జగన్ మాత్రమే కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలు రాజేంద్రనాథ్ రెడ్డి - శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్లు అసెంబ్లీలో చక్కగా ప్రసంగించారు కూడా. కావాలంటే అసెంబ్లీ పాత సమావేశాల వీడియోలను కూడా చూసుకోవచ్చు.

అలాంటి అవకాశాలను క్రియేట్ చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నించాలి. అంతే కానీ.. అసెంబ్లీని బహిష్కరించేశాం అంటే అదేదో వెన్ను చూపే వ్యవహారమే అవుతుంది. ముందుగానే తెలుగుదేశం పార్టీపై ఇలాంటి యుద్ధం ప్రకటిస్తే... వారు మరింత దాడిని పెంచే అవకాశం ఉంది. వైసీపీనే ఈ అవకాశం ఇవ్వడం ఆ పార్టీకే మంచిది కాదు.

అసెంబ్లీనే చాలా మంది లోని లీడర్ షిప్ క్వాలిటీలను బయటపెడుతుంది. అలాంటి అవకాశాన్ని వైసీపీ వదులుకోవడం ఏ మాత్రం సమంజసం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా.. ఆయనలోని హీరోయిజం బయటపడింది అసెంబ్లీలోనే. ఆ తరహాలో వైసీపీ అధినేత అసెంబ్లీలోనే తన సత్తా చాటాలి. అంతే కానీ.. గైర్హాజర్ అంటే, అది వ్యూహాత్మకం తప్పిదమే.

ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపడితే.. తన పార్టీ వాళ్లను అయినా అసెంబ్లీకి పంపాలి.. ప్రజా సమస్యల గురించి ప్రస్తావించమనాలి..చక్కగా వ్యవహరించమని సూచనలు చేయాలి.

అసెంబ్లీ చంద్రబాబు భయం ఉంది. అందుకే..కేవలం పది రోజుల పాటు మాత్రమే సమావేశాలు అంటున్నారు. రోజులు సమావేశాలు నిర్వహిస్తే ఎక్కడ ఇరుక్కుపోతామో అనే భయం బాబుకే ఉన్నప్పుడు వైసీపీ వెనక్కు తగ్గితే పొరపాటు జగన్ దే అవుతుంది. ఈ విషయంలో తన పార్టీ సీనియర్లతో జగన్ చర్చించాలి. ఉమ్మారెడ్డి వంటి వారి అభిప్రాయాలను తీసుకుని ముందుకు పోవాలి. అసెంబ్లీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.