Begin typing your search above and press return to search.

చివరి ఘట్టంలో మూడు రాజధానుల అంశం!

By:  Tupaki Desk   |   18 Jan 2020 1:30 PM GMT
చివరి ఘట్టంలో మూడు రాజధానుల అంశం!
X
ప్రస్తుత ఏపీలో జరుగుతున్న పరిస్థితులని చూస్తుంటే రాజధాని అంశం మరో రెండు రోజుల్లోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత నెల రోజులుగా రాజధాని పై జగన్ ప్రభుత్వం తీవ్రమైన కసరత్తులు చేస్తుంది. ఇంకో రెండు మీటింగ్‌ లు - ఓ కేబినెట్ భేటీ - ఆ తర్వాత ఈ అంశం పై స్పెషల్ అసెంబ్లీ సమావేశం నిర్వహించి రాజధాని ఎక్కడ ? ఎలా? ఈ అంశాలపై నెల రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించనున్నారు.

మూడు రాజధానులు ఉండచ్చు అన్న వార్త బయటకి వచ్చినప్పటినుండి అమరావతి ప్రాంత రైతులు - ప్రజలు అమరావతి నుండి రాజధానిని ఇక్కడి నుండి తరలించవద్దు అని ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వీరికి మద్దతుగా టీడీపీ - జనసేన నిలిచింది. ఇకపోతే ఇప్పటికే హైపవర్ కమిటీ భేటీ చివరి సమావేశం అయిపోవాల్సింది. కానీ , కోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ పక్రియ కొంచెం ఆలస్యం అవుతుంది. లేకుంటే శనివారం హైపవర్ కమిటీ చివరిసారి భేటీ అయ్యేది. ఆ తర్వాత కేబినెట్ ‌లో హైపవర్ కమిటీ సిఫారసుపై చర్చ - దానికి అనుగుణంగా నిర్ణయం వెంటనే జరిగిపోయేవి. కానీ, హైకోర్టు ప్రజాభిప్రాయ సేకరణ గడువు పొడిగించడంతో ఆ గడువులోగా హైపవర్ కమిటీ తన సిఫారసులకు తుది రూపు ఇచ్చే ఆస్కారం లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలోనే ఆదివారం హైపవర్ కమిటీ భేటీ కాబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత సోమవారం ఉదయం సమయంలో హైపవర్ కమిటీ నివేదిక రాష్ట్ర కేబినెట్ ముందుకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కేబినెట్ భేటీలో రాజధాని విషయం లో హైపవర్ కమిటీ ఇచ్చిన అభిప్రాయాన్ని చర్చించి , ఒక నిర్ణయం తీసుకోని , ఆ వెంటనే ఉదయం పది గంటలకు శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో ఏ రూపంలో రాజధాని అంశాన్ని సభ ముందుకు తీసుకువచ్చేది తేల్చేసి, ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని అంశంపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించడానికి ప్రభుత్వం అన్ని ప్రణాళికలు వేసుకున్నట్టు తెలుస్తుంది.

అయితే, మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లు అంశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తునట్టు తెలుస్తుంది. న్యాయ, సాంకేతిక పరమైన అడ్డంకులు రాకుండా మల్టిపుల్ ఆప్షన్స్‌ పై ఫోకస్ చేశారు. సీఎం జగన్‌ తో ఆర్థిక మంత్రి బుగ్గన, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి శనివారం భేటీ అయ్యి , ఈ విషయం లో సుదీర్ఘంగా చర్చ జరిపారు. సిఆర్డీఏ రద్దును మనీ బిల్లుగా పెట్టాలని మొదట ప్రభుత్వం భావించినా, ఆ తర్వాత అవసరమయ్యే ఆమోదాల నేపథ్యంలో ఆ ఆలోచనను క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.