Begin typing your search above and press return to search.

ఎఫెక్ట్ రెండు రాష్ట్రాల్లో అయితే..దీక్ష కర్నూల్లో ఏంది?

By:  Tupaki Desk   |   1 May 2016 4:38 AM GMT
ఎఫెక్ట్ రెండు రాష్ట్రాల్లో అయితే..దీక్ష కర్నూల్లో ఏంది?
X
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నిరసన దీక్ష ఇప్పుడు ఆసక్తికర చర్చకు తావిస్తోంది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఏపీ విపక్ష నేత బలంగా గొంతు విప్పటమే కాదు.. ఈ ప్రాజెక్టు కారణంగా ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజానీకం ప్రయోజనాలకు దెబ్బ తీస్తుందని వాదిస్తున్న సంగతి తెలిసిందే. రెండు ప్రాంతాల్లోని ప్రజల ప్రయోజనాల మీద తాను మూడు రోజుల నిరసన దీక్షను చేపడుతున్నట్లుగా జగన్ ప్రకటించారు. జగన్ ప్రకటించిన దీక్షపై ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత.. ఒకే అంశంలో రెండు రాష్ట్రాల వారు బాధితులుగా అయిన అంశం ఇదేనని చెబుతున్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కారణంగా భారీగా ఎఫెక్ట్ అయ్యేది ఏపీనే అని చెప్పాలి. ఏపీతో పోల్చినప్పుడు.. నల్గొండ.. ఖమ్మం జిల్లాలకు ఆ ప్రభావం కాస్త తక్కువే. అయితే.. జగన్ చెప్పినట్లుగా ఏపీలోని కృష్ణా పరీవాహక జిల్లాలతో పాటు.. తెలంగాణలోని ఖమ్మం.. నల్గొండ జిల్లాలు కూడా ప్రభావితం కావటం ఖాయం. మరి.. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రభావితమై.. బాధితులుగా మారుతున్న అంశానికి సంబంధించిన దీక్ష రెండు ప్రాంతాలకు చెందిన చోట కానీ.. లేదంటే.. రెండు ప్రాంతాల నడుమ కానీ దీక్ష చేయటం సబబుగా ఉంటుంది.

అందుకు భిన్నంగా తాజాగా జగన్ ప్రకటించిన దీక్ష ఏపీలోని కర్నూలులో ఉండటం గమనార్హం. జగన్ చేస్తున్న దీక్ష రెండు రాష్ట్రాల్లోని ప్రజల కోసమే అయినప్పుడు.. జగన్ అందుకు భిన్నంగా ఒక ప్రాంతంలోనే దీక్ష చేయటం ఏమిటన్నది ఒక ప్రశ్న. రెండు రాష్ట్రాల్లోని తెలుగువారి ప్రయోజనాల కోసం జగన్ పోరాటం చేస్తున్నప్పుడు అయితే.. రెండు ప్రాంతాలకు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో కానీ.. లేదంటే..కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్న రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో దీక్ష చేయటం సబబుగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు రాష్ట్రాల ప్రజల మేలు కోసం దీక్ష చూస్తూ.. దీక్షా వేదిక మాత్రం ఒక రాష్ట్రానికే పరిమితం చేయటం సరికాదన్న మాట వినిపిస్తోంది.